బ్లాక్, వైట్ ఫంగ‌స్‌ల‌ను మీ ఆరోగ్య బీమా పాల‌సీ కవర్‌ చేస్తుందా?  - Do-you-know-Your-health-insurance-policy-cover-black-white-fungus-disease
close

Updated : 04/06/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్లాక్, వైట్ ఫంగ‌స్‌ల‌ను మీ ఆరోగ్య బీమా పాల‌సీ కవర్‌ చేస్తుందా? 

కరోనా వైర‌స్ సెకెండ్ వేవ్ ఉదృతి భార‌త్‌లో కొన‌సాగుతూనే ఉంది. దీనికి తోడు బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్  ఇన్ఫెక్ష‌న్లకు సంబంధించిన కేసులు వెలుగుచూస్తున్నాయి. అనేక రాష్ట్రాలు వీటిని అంటువ్యాధులుగా ప్ర‌క‌టించాయి. ఈ వ్యాధులు కోవిడ్‌-19తో భాద‌ప‌డుతున్న‌, ఇప్ప‌టికే కోలుకున్న వారిని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నాయి.

ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి నేపథ్యంలో, బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధి వ్యాధిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరినట్లు   ఇన్సురెన్స్ డెఖో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్ తెలిపారు. రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, ధిల్లీ, మ‌హారాష్ట్ర ప్రభుత్వాలు దీనిని అంటువ్యాధిగా ప్రకటించాయి, ఈ ఇన్ఫెక్షన్ల నుంచి ప్రజలను రక్షించడానికి అనేక నివారణ చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

"దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10,000 కు పైగా బ్లాక్‌ ఫంగస్ కేసులు, వందలాది వైట్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి"  అంతేకాకుండా, ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ అంటువ్యాధుల చికిత్స కూడా ఖరీదైనది,  ఇది చాలా మందికి భారంగా మారుతుంది. అని అగర్వాల్ చెప్పారు.

బ్లాక్‌, వైట్ ఫంగ‌స్ అంటే..
బ్లాక్‌ఫంగ‌స్‌ను మ్యూకోర్మైకోసిస్  అని కూడా అంటారు. ఈ ఫంగ‌స్‌ సాధార‌ణంగా నేల‌, మొక్క‌లు, పాడ‌వుతున్న కూర‌గాయ‌లు, పండ్లు వంటి వాటిలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇది ముక్కు, కంటిని ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తుంది. దీని కారణంగా కొందరు కంటిచూపు కోల్పోవడం, ముఖ భాగంలో ఉబ్బడం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. డ‌యాబిటిస్‌( షుగ‌ర్ లెవెల్స్ నియంత్ర‌ణ‌లో లేక‌పోవ‌డం,) అదిక మోతాదులో స్టెరాయిడ్లు వాడ‌డం వ‌ల్ల‌ ఈ వ్యాధి సోకే ప్ర‌మాదం ఉంది. 

వైట్ ఫంగస్, కాన్డిడియాసిస్ అని కూడా పిలుస్తారు,  కాండిడా ఈస్ట్ ఫంగస్ రకానికి చెందింది. ఇది తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న‌వారిని, హెచ్ఐవి, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు ఉన్న వారిని ఎక్కువ‌గా ప్రభావితం చేస్తుంది.

ఆరోగ్య బీమా పాల‌సీ క‌వ‌ర్ చేస్తుందా..
బ్లాక్‌, వైట్ ఫంగ‌స్‌ల‌కు సంబంధించిన చికిత్సా ఖ‌ర్చుల‌ను అన్ని స‌మగ్ర ఆరోగ్య బీమా పాల‌సీలు డిఫాల్ట్‌గా క‌వ‌ర్ చేస్తాయి. అందువ‌ల్ల ప్ర‌త్యేకించి ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదని అగ‌ర్వాల్ తెలిపారు. 

అయితే పాల‌సీదారులు త‌మ ఆరోగ్య బీమా పాల‌సీలో పేర్కొన్న నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌కు లోబ‌డి ఉండాలి. ముందుగా ఉన్న అనారోగ్యాల గురించి బీమా సంస్థ‌కు తెలియ‌జేయ‌డం, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా లేదా అత్య‌వ‌స‌రంగా ఆసుప‌త్రిలో చేరాల్సివ‌చ్చిన‌ప్పుడు, అవ‌ర‌మైన అన్ని ప‌త్రాల‌ను ఇవ్వ‌డం.. మొద‌లైన‌వి అన్నీ.. బీమా సంస్థ నియ‌మాల‌కు అనుగుణంగా చేయాలి. క్లెయిమ్ చేయాలంటే క‌నీసం 24 గంట‌లు పాటు ఆసుప‌త్రిలో ఉండాలి. 

కొన్ని రాష్ట్రాలు త‌మ రాష్ట్ర ఆరోగ్య బీమా ప్ర‌ణాళిక‌ల‌లో బ్లాక్ ఫంగ్‌స్‌ను చేర్చాయి. బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్న రోగులకు ప్రధాన్ మంత్రి జ‌న్‌ ఆరోగ్య యోజన,  మహాత్మా జ్యోతిరావు ఫులే జ‌న్ ఆరోగ్య యోజన ఆరోగ్య బీమా పథకాల కింద  రూ. 1.5 లక్షల వరకు రక్షణ లభిస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రవేశ, చికిత్స ఖర్చులను తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం చిరంజీవి బీమా పథకాన్ని ప్రకటించింది. "అని అగ‌ర్వాల్ తెలిపారు.

కోవిడ్‌-స్పెసిఫిక్ పాల‌సీలు క‌వ‌ర్ చేస్తాయా?
సంస్థ అందించే గ్రూప్ బీమా పాల‌సీలో క‌వ‌ర్ అయ్యే వారికి, సూప‌ర్ టాప్‌-అప్ ప్లాన్ ఉన్న వారికి ఆయా పాల‌సీలు ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్ల‌ను  క‌వ‌ర్ చేస్తాయి. అయితే క‌రోనా వైర‌స్‌-స్పెసిఫిక్ పాల‌సీలు ఈ వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. 

కోవిడ్ న‌యం చేసే ప్రాసెస్‌లో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్ల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తున్న‌ట్లు గుర్తించిన‌ప్ప‌టికీ,  దీనికి సంబంధించిన చికిత్స ఖ‌ర్చుల‌ను కోవిడ్ స్పెసిఫిక్ పాల‌సీలు క‌వ‌ర్ చెయ్య‌వు. ఇలాంటి క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. 

అందువ‌ల్ల, స‌మ‌గ్ర ఆరోగ్య బీమా ఉన్న‌వారు, బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ చికిత్సకు క్లెయిమ్ చేయ‌వ‌చ్చు. ఆసుప‌త్రిలో చేర‌డం గురించి బీమా సంస్థ‌కు స‌మాచారం అందించాలి. న‌గ‌దు ర‌హిత చికిత్స కోసం బీమా సంస్థ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రిలో చేరాల్సి ఉంటుంది. ఇబ్బందులు త‌లెత్త‌కుండా క్లెయిమ్‌లు త్వ‌ర‌గా ప‌రిష్కార‌మ‌య్యేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాల‌ను బీమా సంస్థ‌కు అందించాలి.   


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని