Investments: పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 ప్రశ్నలు సంధించుకోండి! - ask these 5 questions yourself before investing
close

Updated : 17/09/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Investments: పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 ప్రశ్నలు సంధించుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడే పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం అంత సులభమేం కాదు! డబ్బును మదుపు చేయడానికి చాలా మార్గాలున్నాయి. ప్రతి దాంట్లో కొన్ని సవాళ్లుంటాయి. అయితే, మీకు సరిపడే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. వాటిలో ఒకటి మిమ్మలి మీరు కొన్ని ప్రశ్నలు సంధించుకోవడం. ఆ ప్రశ్నలేంటో చూద్దాం..!

మీ పెట్టుబడి లక్ష్యం ఏంటి?

కొత్తకారు, విదేశీయానం, రిటైర్‌మెంట్.. ఇలా వివిధ కాలపరిమితులతో కూడుకున్న ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. మొట్టమొదట మీరు మీ లక్ష్యాన్ని ఎంత సమయంలో చేరాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. వచ్చే ఏడాది విదేశీయానం చేయాలని అనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వంటి వాటిని ఎంచుకుంటే మేలు. వీటిలో ఎలాంటి నష్టభయం ఉండదు. నిర్ణీత సమయంలో మీ సొమ్ము కొంత పెరుగుతుంది. మార్కెట్‌తో సంబంధం లేకుండా మీరు మదుపు చేసిన డబ్బు వృద్ధి చెందుతుంది.

ఒకవేళ మీరు రిటైర్‌మెంట్‌ వంటి దీర్ఘకాల లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే.. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల(ఎంఎఫ్‌) వాటిని ఎంచుకోవచ్చు. తిరిగి ఎంఎఫ్‌లలో ఫ్లెక్సీ క్యాప్‌, లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ వంటి వాటిపై దృష్టి పెట్టొచ్చు. కాబట్టి మీ లక్ష్యం ఏంటి.. అంది ఎంతకాలంలో చేరాలనుకుంటున్నారన్నది ముఖ్యం.

ఎంత వరకు నష్టభయాన్ని భరించగలరు?

కొన్ని పెట్టుబడి మార్గాల్లో నష్టాలూ రావొచ్చు. అలాంటప్పుడు ఆ నష్టాల్ని భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా?మీపై ఉన్న ఆర్థిక బాధ్యతలు ఏంటి?మీరు పెట్టుబడి పెట్టబోయే పథకంలో నష్టభయం ఎంత? వంటి వాటికి స్పష్టమైన సమాధానం మీ దగ్గర ఉండాలి. మీ వయసు 20లలో ఉన్నప్పుడు మీపై బాధ్యతలు తక్కువగా ఉంటాయి. అప్పుడు మీరు కొంచెం రిస్క్‌ చేయొచ్చు. అదే మీరు 40లలోకి ప్రవేశించారంటే పెద్దగా రిస్క్‌ తీసుకునే అవకాశం ఉండదు. ఇలా మీ పరిస్థితిని బట్టి నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి.

పెట్టుబడిని వివిధీకరణ(డైవర్సిఫై) చేసుకునే అవకాశం ఉందా?

మన పెట్టే పెట్టుబడిని వివిధ మార్గాల్లోకి మళ్లించడమే వివిధీకరణ(డైవర్సిఫికేషన్‌). ఒకే పథకంలో పెట్టుబడి వల్ల నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అదే ఈక్విటీ, డెట్‌, గోల్డ్‌ ఇలా వివిధ మార్గాల్లోకి మళ్లించగలిగితే.. ఒక దాంట్లో నష్టం వచ్చినా మిగిలిన రెండు రాణిస్తే రాబడి పెద్దగా దెబ్బతినదు. కాబట్టి మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ దగ్గర ఉన్న సొమ్మును డైవర్సిఫై చేసుకునే అవకాశం ఉందేమో చూసుకోండి. తద్వారా నష్టభయాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది.

పెట్టుబడి గురించి మీకు అవగాహన ఉందా?

‘మనం ఏం చేస్తున్నామో తెలియనప్పుడే నష్టభయం పెరుగుతుంద’ని ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ ఓ సందర్భంలో అన్నారు. కాబట్టి మనం దేంట్లో పెట్టుబడి పెడుతున్నాం?దాంట్లోనే ఎందుకు పెడుతున్నాం? వంటి సమాధానాలు తెలియకపోతే నిరాశజనక ఫలితాలు తప్పవు. ఉదాహరణకు మీరు ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే.. మీకు దానిపై ప్రాథమిక అవగాహన ఉండాలి. లేదంటే దాని జోలికి వెళ్లకపోవడం మేలు. అలాగే బంగారం కొనాలనుకుంటే.. ఏది అనువైన సమయం?తిరిగి దాన్ని ఎప్పుడు విక్రయించాలి? వంటి విషయాలు తెలిస్తేనే బంగారం ద్వారా లబ్ధి పొందగలుగుతారు. ఈ మధ్య క్రిప్టో కరెన్సీ విలువ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోందన్న వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏమీ తెలియకుండా దాంట్లో పెట్టుబడులు పెడితే ఫలితాలు తలకిందులవ్వొచ్చు.

పెట్టుబడి వ్యయం ఎంత?

పెట్టుబడి పెట్టడానికి కూడా కొంత ఖర్చవుతుంది. ఆ ఖర్చులేవో ముందే తెలుసుకోవాలి. ఎందుకంటే అవి రాబడిపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు.. మీరు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెడితే.. ఎక్స్‌పెన్స్‌ రేషియో వంటి ఛార్జీలు వర్తిస్తాయి. మీకు వచ్చే రాబడి నుంచి వీటిని కత్తిరిస్తారు. ఈక్విటీలో మదుపు చేస్తే బ్రోకరేజీ ఛార్జీలుంటాయి. ఇలా ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన ఛార్జీలుంటాయి. అవేంటో ముందే తెలసుకోవాలి. ఈ రుసుములు వివిధ సంస్థల మధ్య ఎలా ఉన్నాయో సరిపోల్చుకోవాలి.

సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడమే పెట్టుబడికి తొలి మెట్టు. అలాగే ఒకే మార్గాన్ని అనుసరించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు మీ పెట్టుబడిపై వస్తున్న రాబడిని సమీక్షించుకోవాలి. అవసరమైతే.. మరో మార్గంలోకి మారాలి. అప్పుడే మనం ఆర్థిక లక్ష్యాన్ని సరైన సమయంలో అందుకోగలుగుతాం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని