SSY:  మే చివ‌రికి రూ.1.05 ల‌క్ష‌ల కోట్లకు చేరిన పొదుపు  - Sukanya-Samriddhi-Yojana-scheme
close

Updated : 03/07/2021 11:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SSY:  మే చివ‌రికి రూ.1.05 ల‌క్ష‌ల కోట్లకు చేరిన పొదుపు 

నేష‌న‌ల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ అందించిన స‌మాచారం ప్ర‌కారం మే2021 చివ‌రి నాటికి సుక‌న్య స‌మృద్ధి యెజ‌న ప‌థ‌కంలో ప్ర‌జ‌లు పొదుపు చేసిన మొత్తం రూ. 1.05 ల‌క్ష‌ల‌ కోట్ల‌కు చేరింది. ఆడ‌పిల్ల‌ల కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కం ఎస్ఎస్‌వై.  గ‌త ఏడాది మే నెల‌లో ఈ మొత్తం రూ.75,522 కోట్లుగా ఉంది. గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే పొదుపు మొత్తం సుమారు 40శాతం పెరిగింది.

ప్రభుత్వ హామీ ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో అధిక వ‌డ్డీ రేటు ఇస్తున్న ప‌థ‌కం కావ‌డంతో దీనికి ప్ర‌జాద‌ర‌ణ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పాలి. ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌స్తుతం అందిస్తున్న వ‌డ్డీ రేటు 7.6 శాతం. ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ‘బేటి బ‌చావో బేటి ప‌డావో’ కార్య‌క్ర‌మంలో భాగంగా జనవరి 2015 లో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్రారంభించింది. భార‌తీయ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెల పెంప‌కం, చ‌దుపు, వివాహం కోసం.. చిన్న వ‌య‌సు నుంచే పొదుపు చేయ‌డాన్ని ప్రోత్స‌హిస్తుంది. 

ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించిన‌ప్పుడు ఖాతా తెరిచేందుకు క‌నీస మొత్తాన్ని రూ.1000గా నిర్ణ‌యించారు. అయితే 2018లో ఈ మొత్తాన్ని రూ.250కి త‌గ్గించారు. ఒక సంవ‌త్స‌రంలో గ‌రిష్టంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పొదుపు చేయ‌వ‌చ్చు. 

ప‌థ‌కం గురించిన ముఖ్యంశాలు..
* ఆడ పిల్ల పుట్టిన తరువాత నుంచి ఆమెకు పది సంవత్సరాల వయస్సు వచ్చే లోపు ఎప్పుడైనా ఖాతాను తెరవచ్చు. అయితే ఆమె ఖచ్చితంగా భారతీయ పౌరురాలై ఉండాలి. అలాంటప్పుడే ఈ ఖాతా ప్రయోజనాలను పొందగలరు.
* తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతినిస్తారు. ఇందుకోసం వైద్య‌ప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
* దత్తత తీసుకున్న బాలిక పేరుపై కూడా ఈ ఖాతా తెరవవచ్చు. ఒక‌రి కోసం రెండు ఖాతాలను తీసేందుకు వీల్లేదు. 
వ్య‌క్తిగ‌త గుర్తింపు ప‌త్రం, చిరునామా గుర్తింపు ప‌త్రాల‌తో పాటు జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
* పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా ఖాతాను తెర‌వ‌వ‌చ్చు.  
* సుక‌న్య స‌మృద్ధి ఖాతా మెచ్యూరిటీ గ‌డువు 21 సంవ‌త్స‌రాలు. ఉదాహ‌ర‌ణ‌కు 8 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఖాతా ప్రారంభిస్తే, అమ్మాయికి 29 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుక‌న్య స‌మృద్ధి ఖాతా నుంచి అమ్మాయికి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత డ‌బ్బు తీసుకునే వీలుంది.
* ఖాతాను ప్రారంభించేందుకు క‌నీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం. అలాగే ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.250 డిపాజిట్ చేసి ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు. గ‌రిష్ఠంగా రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌మ‌ చేయ‌వ‌చ్చు. 
* ఒకవేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే, మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ. 3 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.
* న‌గ‌దు లేదా చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) రూపంలో డ‌బ్బును డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
* డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు.
* ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఖాతాను 'డిఫాల్ట్ అకౌంట్’గా పరిగణిస్తారు.
* ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* ఖాతాను తెరిచిన‌ప్పుడు మాత్రం పోస్టాఫీసు/బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ త‌రువాత నుంచి బ్యాంకుకు త‌గిన సూచ‌న‌లు అందించ‌డం ద్వారా ఆన్‌లైన్ ద్వారా న‌గ‌దు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
* ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే, ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై వడ్డీ చెల్లించరు.
* ఇదేవిధంగా, 21 సంవత్సరాల తర్వాత ఖాతాలో మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, ఆ మొత్తంపై కూడా వడ్డీ చెల్లించరు.
* ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే వీలుంటుంది.
* ఈ ఖాతాలో ప్ర‌తి నెల 10 వ తేది కంటే ముందు న‌గ‌దు డిపాజిట్ చేస్తే నెలంత‌టికీ వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్ర‌తినెల 10 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న త‌క్కువ న‌గ‌దుపై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే లాభం ఉంటుంది.
* సుక‌న్య స‌మృద్ధిపై వ‌డ్డీ రేటును ప్ర‌భుత్వ నిర్ణ‌యిస్తుంది కాబ‌ట్టి ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వ‌డ్డీ రేట్లు ఉంటాయి. వ‌డ్డీ రేట్ల‌ను త్రైమాసికంగా స‌వ‌రిస్తారు. 
* ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్ర‌కారం ఈ ప‌థ‌కంలో పెట్టుబడుల‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. 

సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్:
సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ఆఫ‌ర్ చేస్తున్న వ‌డ్డీ రేటు 7.6 శాతం ప్ర‌కారం లెక్కిస్తే..సంవత్సరానికి రూ.1000 పెట్టుబడి పెడ‌తూ 15 సంవత్సరాల పాటు పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అనగా మెచ్యూరిటీ సమయంలో రూ. 42,434 పొందవచ్చు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబ‌డి రూ.15,000, వ‌డ్డీ మొత్తం రూ.27,434. అదేవిధంగా, ఏడాదికి అనుమ‌తించిన గ‌రిష్ట మొత్తం రూ. 1,50,000 చొప్పున‌ పెట్టుబ‌డి పెడుతూ 15 ఏళ్ల‌ పాటు పెట్టుబ‌డిని కొన‌సాగిస్తే, 21 సంవత్సరాల తరువాత రూ. 63,65,155 పొంద‌వ‌చ్చు. ఇందులో మీరు పెట్టిన పెట్టుబ‌డి రూ.22,50,000, వ‌డ్డీ మొత్తం రూ.41,15,155.

చివ‌రిగా..
రోజుల వ‌య‌సున్న ఆడ‌పిల్ల ద‌గ్గ‌ర నుంచి 10 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సున్న ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు త‌మ పాప భవిష్య‌త్తును భ‌ద్ర‌ప‌రిచేందుకు ఈ ప‌థకంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచింది. ఈ ప‌థ‌కానికి ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. కాబ‌ట్టి పెట్టుబ‌డుల‌కు భ‌ద్రత ఉంటుంది. అలాగే మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. 


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని