Investments: మీ పెట్టుబడులు బాగున్నాయా?
close

Updated : 17/09/2021 09:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Investments: మీ పెట్టుబడులు బాగున్నాయా?

అందుబాటులో ఎన్నో పెట్టుబడి పథకాలు.. వీటిలో మదుపు చేయడమూ సులభమే. కానీ.. మీ ఆ పథకాల్లో మీ డబ్బు పెరుగుతుందా.. ఇదే ఎప్పుడూ ముఖ్యం. మీరు మదుపు చేసిన పథకాల గురించి, ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మార్కెట్‌ పోకడలను అర్థం చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారైనా మీరు మదుపు చేసిన పథకాల పరిస్థితిని చూసుకోవాలి. అప్పుడే డబ్బు డబ్బును సృష్టిస్తుంది.

పెట్టుబడి పెట్టిన వెంటనే రెట్టింపు రాబడి వస్తుందనే ఆలోచన ఎప్పుడూ మంచిది కాదు. పెట్టుబడి పథకాలు ఎప్పుడూ దీర్ఘకాలిక వ్యూహంతో ఉండాలి. సమీక్షించుకునే సమయంలోనూ దీన్ని మర్చిపోకూడదు. ఇటీవల కాలంలో చాలామంది అత్యవసర నిధిపై దృష్టి పెట్టారు. ఈ నిధిని దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో ఉంచడం అంత క్షేమం కాదు. ఈ పథకాలు స్వల్పకాలంలో కొన్నిసార్లు నష్టాలను ఇచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి, ఈ విషయంలో స్వల్పకాలిక పథకాలే మెరుగైనవి. నష్టభయం అధికంగా ఉండే పథకాల్లో.. కాలం గడుస్తున్న కొద్దీ అది తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈక్విటీలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. కానీ, వాటిలో అధిక లాభాలకు ఆస్కారం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి సాధించాలంటే ఇవే అవసరం. మీరు మదుపు చేసిన మ్యూచువల్‌ ఫండ్లు ఇటీవల మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోండి. ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే.. పోర్ట్‌ఫోలియో ఎప్పుడూ విభిన్న పథకాలతో నిండి ఉండాలి. మీరు సమీక్షించుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్థిరాదాయం అందించే పథకాలు, సార్వభౌమ పసిడి బాండ్లు, కొంత మొత్తం స్థిరాస్తిలో పెట్టుబడులు ఉండాలి. ఈ వ్యూహాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.

లక్ష్యాలకు అనుగుణంగా..

ప్రతి పెట్టుబడి పథకానికీ ఒక లక్ష్యం ఉండాలి. మీ నష్టభయం భరించే సామర్థ్యం, ఆశిస్తున్న రాబడి ఆధారంగా ఈక్విటీలు, డెట్‌ పథకాల్లో మదుపు చేయాలి. దీంతోపాటు.. మార్కెట్ హెచ్చుతగ్గులు, మారుతున్న వడ్డీ రేట్లనూ గమనించాలి. మీ ఆదాయం పెరిగినప్పుడు.. లేదా మీ ఆర్థిక లక్ష్యాలు మారినప్పుడు అందుకు అనుగుణంగా పెట్టుబడి పథకాల్లో మార్పులు చేర్పులు రావాలి. ఉదాహరణకు 55 ఏళ్ల వయసులోకి వచ్చాక ఈక్విటీల్లో పెట్టుబడులను సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవాలి. హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లు, డెట్‌ పథకాల వైపు పెట్టుబడులను మళ్లించాలి. మీరు సమీక్షించుకునేటప్పుడు.. ఈక్విటీ పెట్టుబడుల మొత్తం మీరు అనుకున్న దానికన్నా అధికంగా ఉంటే.. ఆ నిష్పత్తి మేరకు పెట్టుబడిని డెట్‌లోకి మార్చుకోవాలి.

పన్ను భారం లేకుండా..

వచ్చిన రాబడికి పన్ను భారం లేకుండా ఉందా.. లేదా మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, పన్ను చెల్లించాలా అనేదీ చూసుకోవాలి. ఒకవేళ రాబడికి పన్ను చెల్లిస్తే.. నికర రాబడి ఎంత ఉంటుంది అనే అంశాలను పరిశీలించుకోవాలి. ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్న నేపథ్యంలో ఇలా పన్ను వర్తించే రాబడుల గురించి ఇప్పుడే ఆలోచించాలి. అదే సమయంలో పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేందుకూ ఇదే సరైన సమయం. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో సిప్‌ ప్రారంభించడం, పీపీఎఫ్‌, లేదా వీపీఎఫ్‌ను మొదలు పెట్టవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఆర్థిక లక్ష్యాల సాధనకే ఎప్పుడూ పెట్టుబడులు పెట్టాలి. పన్ను ఆదా అనేది అది కల్పించే అదనపు సౌకర్యం మాత్రమే. ఇక రాబడిపై పన్ను వర్తించే పథకాలను ఎంచుకుంటే.. వాటిని మార్చి, అధిక రాబడినిచ్చే వాటిలోకి మారడమే ఉత్తమం.

నగదుగా మారాలి...

ఒకసారి మదుపు చేసి, అలాగే కొనసాగాలంటే అన్నిసార్లూ కుదరకపోవచ్చు. అందుకే, పెట్టుబడులు వీలైనంత త్వరగా నగదుగా మార్చుకునే వీలూ ఉండాలి. స్వల్పకాలిక అవసరాల కోసం మనీ మార్కెట్‌ పథకాలు లేదా పొదుపు ఖాతాలో డబ్బు ఉంచుకోవాలి. కనీసం 10 ఏళ్లకు పైన కొనసాగించే వీలున్నప్పుడే ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు ఉండాలి. మీ పెట్టుబడి పథకాల బాగోగులను చూస్తున్నప్పుడు ఈ విషయానికీ ప్రాధాన్యం ఇవ్వండి.

పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగిన సమయం ఇవ్వాలనేది నిపుణుల సూచన. అయితే, మదుపు చేశామా.. మర్చిపోయామా అనే ధోరణితో ఉంటే... మనకు లాభాలను పంచాల్సినవి నష్టాలను మిగిల్చే అవకాశం ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని