సరైన చోట మదుపు చేస్తే చాలు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు.
ఇలా చదువు పూర్తికాగానే… అలా వేల రూపాయల కొలువులో చేరిపోతున్నారు నేటి యువత. మరి, సంపాదనలో ఎంత పొదుపు చేస్తున్నారనే విషయంలో అనుమానమే. 22 ఏళ్లకు ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఒక వ్యక్తికి 35 ఏళ్లు వచ్చేనాటికి తన ఆదాయం కన్నా రెట్టింపు మొత్తం చేతిలో ఉండాలి. ఇది ఎలా సాధ్యం అనే సందేహం వస్తోందా? నిజం చెప్పాలంటే… ఇది ఏమాత్రం కష్టం కాదు. ఉద్యోగం వచ్చిన మొదటి నెల నుంచే క్రమశిక్షణతో పొదుపు చేసుకుంటూ… దాన్ని సరైన చోట మదుపు చేస్తే చాలు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు.
ఏం చేయాలి?
ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం మీ వయసు 22 ఏళ్లు. ఏటా మీ ఆదాయం 10శాతం చొప్పున పెరుగుతుంది. 22 ఏళ్లప్పుడు మీ ఆదాయం ఎంత ఉందన్నది ఇక్కడ సంబంధం లేదు. ఏటా 10శాతం పెరుగుతుందని అంచనా వేసుకుందాం. మీకు 35 ఏళ్ల వయసు రావడానికి ఇంకా 13 ఏళ్ల సమయం ఉంది. చేయాల్సిందేమిటంటే… మీకు వచ్చే వార్షికాదాయంలో 15శాతం పొదుపు చేయడమే. (ఇక్కడ 15శాతం అనేదే కీలకం. ఒకవేళ ఇంతకన్నా తక్కువ పొదుపు చేస్తే… 35 ఏళ్లనాటికి రెట్టింపు పొదుపు అనే లక్ష్యం నెరవేరకపోవచ్చు.). ఇక ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని కనీసం 10శాతం వార్షిక రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. వీటిల్లో నెలనెలా నిర్ణీత మొత్తాన్ని క్రమానుగత మదుపు విధానం (సిప్)లో పెట్టుబడి పెట్టాలి. మీరు మదుపు చేస్తున్న ఫండ్లు వార్షిక రాబడి 12శాతం ఇచ్చాయనుకోండి… మీరు మీ వార్షికాదాయానికి సరైన మొత్తం 27 ఏళ్లు వచ్చేనాటికే సాధిస్తారు. 33 ఏళ్లు వచ్చేనాటికి మీ చేతిలో మీ వార్షికాదాయానికి రెట్టింపు మొత్తం ఉంటుంది.
22 ఏళ్ల వ్యక్తి ఏడాదికి రూ.2.4లక్షలు ఆర్జిస్తున్నాడు. అతని ఆదాయం ఏటా 10శాతం పెరుగుతుందని అంచనా వేసుకున్నప్పుడు… 34 ఏళ్లనాటికి దాదాపు రూ.7.53లక్షలకు ఆదాయానికి చేరుకుంటాడు. 35 ఏళ్లు వచ్చేనాటికి అతని పెట్టుబడుల విలువ రూ.18.19లక్షలు అవుతుంది. అంటే… అతని ఆదాయానికి 2.42 రెట్లు అవుతుందన్నమాట. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… పెట్టుబడుల్లో ఆలస్యం చేసిన కొద్దీ… అనుకున్న లక్ష్యాన్ని సాధించడమూ ఆలస్యం అవుతుంది. అప్పుడు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు 28 ఏళ్ల వరకూ ఒక్క పెట్టుబడి కూడా లేకపోతే… వచ్చిన ఆదాయంలో నుంచి 30శాతం వరకూ మదుపు చేస్తేనే… 35 ఏళ్ల వయసు నాటికి వార్షిక సంపాదనకు రెండు రెట్లు కూడబెట్టగలం. 30 ఏళ్ల తర్వాత ప్రారంభిస్తే… సంపాదనలో 40శాతం మదుపు చేయాల్సిందే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఎంత తొందరగా పెట్టుబడి ప్రారంభిస్తే… అంత తొందరగా ఆర్థిక లక్ష్యం నెరవేరుతుంది.
ఎక్కడ మదుపు చేయాలి?
దీర్ఘకాలం మదుపు చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవడమే సరైన నిర్ణయం. ఫండ్లలో ఎంత రాబడి వస్తుందనేదానికి ఎలాంటి హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి, ఇది మారుతూ ఉంటుంది. గత 10ఏళ్ల సగటు రాబడిని పరిగణనలోనికి తీసుకుంటే… సగటున ఇవి 11.80శాతం వార్షిక రాబడిని అందించాయి. బ్యాలెన్స్డ్ ఫండ్లు కూడా సగటున 12.53శాతం వరకూ రాబడినిచ్చాయి. కాబట్టి, వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడమే ప్రయోజనం. ఆదాయపు పన్ను మినహాయింపు కావాలనుకునే వారు పెట్టుబడి కోసం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) ఎంచుకోవచ్చు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?