ఆఫీసుకొస్తారా.. ఇప్పుడే కాదు
close

Updated : 02/04/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఫీసుకొస్తారా.. ఇప్పుడే కాదు

సిబ్బందిని రప్పించేందుకు కంపెనీల అనాసక్తి
ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితి మారొచ్చు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని పిలిచేందుకు హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవు. గత ఏడాది నాటి పరిస్థితితో పోల్చితే ప్రస్తుతం 20-25 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఈ సంఖ్య ఇప్పటికిప్పుడు పెరిగే అవకాశం లేదని, ఉద్యోగులు పూర్తిస్థాయిలో ఆఫీసులకు వచ్చి పనిచేయటానికి ఇంకా చాలా కాలం పడుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌తో ఐటీ కంపెనీల ప్రణాళికల్లో మార్పు వస్తోంది. ఉద్యోగులను ఇప్పటికిప్పుడు పెద్ద సంఖ్యలో ఆఫీసులకు పిలిచే పరిస్థితి లేదు- అని హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు భరణి కె.అరోల్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాలని ఐటీ కంపెనీలు అనుకోవటం లేదని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడా ఐటీ ప్రాజెక్టులు ఆగడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని, తత్ఫలితంగా 60-65 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఐటీ ఉద్యోగుల సగటు వయస్సు 40 సంవత్సరాలకు దగ్గరగా ఉంటుంది. ఈ వయస్సు కల వారందరికీ కొవిడ్‌-19 టీకా ఇస్తే, ఐటీ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ నెల 9న ‘బిజ్‌సమ్మిట్‌ 2021’:  ఎంతో ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమమైన ‘బిజ్‌సమ్మిట్‌ 2021’ను హైసియా ఈ నెల 9న నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌లో ఈ సదస్సు జరుగుతుందని, కాగ్నిజెంట్‌ ఇండియా సీఎండీ రాజేష్‌ నంబియార్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని హైసియా అధ్యక్షుడు భరణి తెలిపారు. గౌరవ అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌-ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ప్రధానోపన్యాసం చేస్తారు. ఐటీ రంగంలో తదుపరి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే అంశంపై కంట్రోల్‌ఎస్‌ ఛైర్మన్‌ పి.శ్రీధర్‌ మాట్లాడతారు. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఐటీ కంపెనీలకు..., మరీ ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి ఐటీ సంస్థలకు అందివచ్చే అవకాశాలు, అందుకు ఎలా సన్నద్ధం కావాలి... అనే అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రధానంగా హైసియా పనిచేస్తోందని, అందువల్ల ఈ అంశాన్ని ఎంచుకున్నట్లు హైసియా ఉపాధ్యక్షుడు కిరణ్‌ చెరుకూరి వివరించారు. బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ, జీవశాస్త్రాలు- వైద్యం, టెలికామ్‌ రంగాల్లోని అవకాశాలను విశ్లేషించే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని