బ్యాంకులకు మళ్లీ ‘కొవిడ్‌’ ముప్పు
close

Updated : 10/04/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులకు మళ్లీ ‘కొవిడ్‌’ ముప్పు

వృద్ధి పుంజుకోడానికీ విఘాతం : ఫిచ్‌ 

దిల్లీ: రెండో విడత కొవిడ్‌-19 వ్యాప్తితో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ, బ్యాంకుల పురోగతికి ముప్పు పొంచి ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. 2021లో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఓ మోస్తరు ప్రతికూల పరిస్థితులే ఎదురు కావొచ్చని భావిస్తోంది. కొవిడ్‌ కేసుల ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకునే చర్యలతో వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. ఫిబ్రవరి మధ్యలో రోజుకు 9,300 చొప్పున కరోనా కేసులు నమోదవ్వగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు పైగా చేరడాన్ని ప్రస్తావించింది. ‘ప్రభుత్వం అనుసరిస్తున్న సర్దుబాటు విధాన వైఖరి, వృద్ధిపై ఒత్తిడిని కొంత మేర పరిమితం చేయొచ్చు. కొవిడ్‌-19 అవరోధాలు తగ్గాలంటే అత్యధిక ప్రజలకు టీకాను త్వరగా, సమర్థంగా అందించడం కీలకమ’ని ఫిచ్‌ పేర్కొంది. 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ జీడీపీ వృద్ధి 12.8 శాతంగా నమోదుకావచ్చని ఫిచ్‌ పేర్కొంది. కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏప్రిల్‌- జూన్‌లో వృద్ధి నెమ్మదించొచ్చనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొనే, ఈ అంచనాను వెలువరించింది. అయితే కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటే వృద్ధి అంచనాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 
వ్యాపార సెంటిమెంట్‌పై ప్రభావం: ‘80 శాతం కొత్త కేసులు ఆరు ప్రధాన రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో 45 శాతం రుణాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని అంచనా. అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు  అవరోధాలు పెరిగితే వ్యాపార సెంటిమెంటు దెబ్బతినొచ్చు. అయితే గత సంవత్సరం మాదిరి కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే అవకాశాలైతే ఉండకపోవచ్చని భావిస్తున్నామ’ని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.  కొవిడ్‌-19 రెండో విడత వ్యాప్తితో వినియోగదారు, కార్పొరేట్‌ విశ్వాసంపైనా ప్రభావం పడితే, బ్యాంకుల కొత్త వ్యాపార ప్రణాళికలకు అవరోధం ఏర్పడుతుందని ఫిచ్‌ తెలిపింది. కొవిడ్‌-19 మొదట విడత, 2020 లాక్‌డౌన్‌ ఆంక్షల ప్రభావం బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై ఇంకా పూర్తిగా పడలేదని, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు తొలగలేదని పేర్కొంది. ‘సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు, రిటైల్‌ విభాగాల్లోని రుణాలు మొండి బకాయిలుగా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నామ’ని ఫిచ్‌ అభిప్రాయపడింది.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని