మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు
close

Updated : 27/04/2021 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు

అనుమతి కోరిన నాట్కో ఫార్మా 

ఈనాడు, హైదరాబాద్‌: స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కొవిడ్‌-19ను అదుపు చేసే ఔషధంగా పేర్కొంటున్న మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఇన్‌ఫ్లుయంజా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తున్న మోల్నుపిరవిర్‌ను కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వారిపై వినియోగించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ‘రీపర్పసింగ్‌’ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాట్కో ఫార్మా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఈ ఔషధాన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌-19 రోగులకు అందించి, చికిత్సలో వినియోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనుమతులు కోరుతూ.. సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు దాఖలు చేసినట్లు సోమవారం తెలిపింది. ఇప్పటిదాకా రెండు దశల్లో నిర్వహించిన ప్రీ క్లినికల్‌ పరీక్షల్లో అంచనాలకు మించి ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ ద్వారా చికిత్స అందించినప్పుడు 5 రోజుల వ్యవధిలో సత్ఫలితాలు కనిపిస్తాయని, నోటి ద్వారా అందించే చికిత్స కావడం వల్ల రోగులకు ఇబ్బందులూ తగ్గుతాయని పేర్కొంది. కొవిడ్‌-19 రెండో దశ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఔషధానికి సీడీఎస్‌సీఓ అత్యవసర వినియోగ అనుమతిని ఇస్తుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది. అనుమతి లభిస్తే.. నెల రోజుల్లోపు ఈ ఔషధాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.

మోల్నుపిరవిర్‌పై క్లినికల్‌ పరీక్షలకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో నాట్కో షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 3.29% పెరిగి, రూ.906.70కి చేరింది. 

ఆప్టిమస్‌ ఫార్మా సైతం...
మోల్నుపిరవిర్‌కు జనరిక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా వెల్లడించింది. ఈ ఔషధంపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు అనుమతి కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసినట్లు సోమవారం వెల్లడించింది. అనుమతి లభించగానే భారతీయ మార్కెట్లోకి దీన్ని వేగంగా తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆప్టిమస్‌ ఫార్మా ఛైర్మన్‌, సీఈఓ డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిర్వహించిన ప్రీ-క్లినికల్‌ పరీక్షల్లో ఈ ఔషధం సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనట్లు తేలిందని, ఎలాంటి ప్రతికూల లక్షణాలూ కనిపించలేదని పేర్కొన్నారు. స్వల్ప, మధ్యస్థ కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారికి చికిత్సలో ఉపయోగిస్తున్న ఫావిపిరవర్‌ను తాము ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మోల్నుపిరవిర్‌ను 800 ఎంజీ మోతాదులో విడుదల చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.


విన్‌కొవ్‌-19 పరీక్షలకు అనుమతి..

కొవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే ఆంటీడోట్‌ ఔషధం ‘విన్‌కొవ్‌-19’ క్లినికల్‌ పరీక్షలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. ఈ ఔషధాన్ని సెంట్రల్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ (సీసీఎంబీ), యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో హైదరాబాద్‌కు చెందిన ఇమ్యునాలాజికల్‌ సంస్థ విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. ఈ విన్‌కొవ్‌-19పై క్లినికల్‌ పరీక్షలకు అనుమతి పొందినట్లు సోమవారం ఒక ప్రకటనలో సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19తో బాధపడుతున్న 300 మందిపై ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ప్రీ-క్లినికల్‌ పరీక్షలను గత ఏడాది అక్టోబరులో ప్రారంభించినట్లు, అవి విజయవంతం అయినట్లు విన్స్‌ బయోప్రొడక్ట్స్‌ సీఈఓ సిద్ధార్థ్‌ దాగా తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని