ఇప్పుడు ఇల్లు కొనొచ్చా?
close

Published : 08/01/2021 04:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడు ఇల్లు కొనొచ్చా?

నేను ఇల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నాను. ప్రస్తుతం గృహరుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కదా! ఇల్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా?

- రాజేశ్‌

ప్రస్తుతం ఇల్లు కొనేందుకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ, కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇల్లు కొనేందుకు సిద్ధపడకూడదు. మీ ఆదాయంలో నెలసరి వాయిదాలు 40 శాతం లోపే ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీరు ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం కొంత మేరకు పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. మీ ఉద్యోగం, ఆదాయం విషయంలో పూర్తి భద్రత ఉందా చూసుకోండి. ఏమాత్రం అనుమానం ఉన్నా దీర్ఘకాలిక రుణాల జోలికి వెళ్లకూడదు. మీరు పనిచేసే చోటుకు మీరు కొనబోయే ఇల్లు దగ్గరగా ఉండేలా చూసుకోండి. దూరం పెరిగిన కొద్దీ.. మీపై ప్రయాణ భారం పడుతుంది. గృహరుణం తీసుకున్న తర్వాత ఇది ఇబ్బంది కలిగిస్తుంది. వీటన్నింటినీ పరిశీలించాక.. ఇల్లు కొనేందుకు సిద్ధంకండి.


గత ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులలో దీర్ఘకాలిక మూలధన నష్టాన్ని నమోదు చేయడం మర్చిపోయాను. ఈ ఏడాది వాటిని చూపించుకోవచ్చా?  

- సురేశ్‌

అలా సాధ్యం కాదు. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మూలధన నష్టాన్ని ఆ ఏడాదికి సంబంధించిన రిటర్నులలోనే చూపించాలి. అప్పుడే భవిష్యత్తులో వచ్చిన మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునే వీలుంటుంది.
నేను ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. ఈ పాలసీలో మా తల్లిదండ్రులనూ చేర్పించే అవకాశం ఉందా? లేదా వారికోసం ప్రత్యేకంగా మరో పాలసీ తీసుకోవాలా?

- ప్రశాంత్‌

మీరు తీసుకునే పాలసీలో మీ తల్లిదండ్రులను కలపకండి. దీనికన్నా వారి కోసం ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్‌ ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోండి. అప్పుడు ప్రీమియం భారం తక్కువగా ఉంటుంది. వారిని ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీల్లో చేర్పిస్తే.. చాలా సందర్భాల్లో పాలసీ మొత్తం వారికే ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, వారికి ప్రత్యేకంగా మరో పాలసీని తీసుకోవడమే మేలు.


నా వయసు 56 ఏళ్లు. మరో నాలుగేళ్లలో పదవీ విరమణ చేస్తాను. గత కొన్నేళ్లుగా పసిడి మంచి లాభాలను ఇస్తోంది కదా..  పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం నిధిని ఏర్పాటు చేసుకునేందుకు బంగారం లేదా బంగారం బాండ్లలో మదుపు చేయడం మంచిదేనా?

- జగదీశ్వర్‌

పదవీ విరమణ కోసం మదుపు చేయడానికి ఒకే రకమైన పెట్టుబడి పథకాన్ని ఎంచుకోవడం సరికాదు. ఒక్కో పథకంలో 10-20 శాతానికి మించి పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. పదవీ విరమణకు దగ్గరలో ఉన్నారు కాబట్టి, సాధ్యమైనంత వరకూ సురక్షిత పథకాల్లో మదుపు చేయండి. 70-80శాతం వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లించండి. 20-30 శాతం బంగారం లేదా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టండి.


నా వయసు 45 ఏళ్లు. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. రిటైర్మెంట్‌ ప్రయోజనాల కోసం మనీ బ్యాక్‌ పాలసీని తీసుకోవాలని నా స్నేహితుడు సూచిస్తున్నాడు. ఇవి మంచివేనా? లేదా పూర్తి రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలా?

- సంతోశ్‌

ప్రస్తుతం మనీ బ్యాక్‌ పాలసీల ద్వారా వస్తున్న రాబడితో ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. దీనికి బదులుగా పూర్తి రక్షణ కోసం ఉపయోగపడే టర్మ్‌ పాలసీలను ఎంచుకొని, మిగతా మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో లేదా జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో మదుపు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

- సాయి కృష్ణ పత్రి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని