గృహిణులకూ.. టర్మ్‌ పాలసీ...
close

Updated : 09/07/2021 04:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహిణులకూ.. టర్మ్‌ పాలసీ...

నేను గృహిణిని. నెలకు రూ.3వేల వరకూ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నాను. కాస్త తక్కువ నష్టభయం ఉన్న పథకాలైతే మేలు. కనీసం 7-8 ఏళ్లపాటు మదుపు చేయగలను. నేను జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా?

- ప్రశాంతి

మీకు 7-8 ఏళ్ల సమయం ఉంది అంటున్నారు కాబట్టి, మంచి రాబడి కోసం ఈక్విటీ హైబ్రీడ్‌ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందులో కాస్త నష్టభయం ఉండే అవకాశం ఉంది. మీరు నెలకు రూ.3వేలను 8 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 10శాతం రాబడి అంచనాతో రూ.4,11,691 అయ్యేందుకు అవకాశం ఉంది. మీరు జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు వీలుంది. మీరు సరళ్‌ జీవన్‌ బీమా యోజన పాలసీని ప్రయత్నించవచ్చు. ఈ పాలసీని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ తీసుకునే వీలుంది.


నా వయసు 63 ఏళ్లు. నెలనెలా ఆదాయం వచ్చేలా రూ.10లక్షలను ఎక్కడైనా మదుపు చేద్దామనేది ఆలోచన. బీమా సంస్థలు అందించే ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలు మంచివేనా? డెట్‌ ఫండ్లలో మదుపు చేసి, నెలకు కొంత మొత్తం తీసుకుంటే నష్టపోతామా?

- సత్యనారాయణ

మీరు బీమా సంస్థలను ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలను పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెట్‌ ఫండ్లలో రాబడి తగ్గింది. కాస్త నష్టభయమూ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించండి. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాలకంటే ఇందులో అధిక రాబడి వస్తుంది. ప్రస్తుతం 7.4శాతం వడ్డీ ఇస్తున్నారు. దీన్ని ఐదేళ్ల వరకూ కొనసాగించవచ్చు. మరో మూడేళ్లపాటు వ్యవధిని పొడిగించుకునే వీలుంది.


మా అమ్మాయి వయసు 9 ఏళ్లు. తనకు 23 ఏళ్లు వచ్చే దాకా నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. వీలునుబట్టి ఈ పెట్టుబడిని పెంచగలను. మంచి పెట్టుబడి ప్రణాళిక సూచించండి.

-  పురుషోత్తం

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మీ పేరుమీద తగినంత జీవిత బీమా తీసుకోండి. మీకు 14 ఏళ్ల వ్యవధి ఉంది కాబట్టి, డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను పరిశీలించండి. వీటిల్లో దాదాపు 12శాతం రాబడి అంచనాతో నెలకు రూ.10వేలు మదుపు చేస్తే.. 14 ఏళ్ల తర్వాత రూ.38,87,112 వచ్చేందుకు వీలుంది.


నేను ఒక బ్యాంకు నుంచి 7.75 శాతానికి గృహరుణం తీసుకున్నాను. ఇప్పుడు మరో బ్యాంకుకు మారాలనుకుంటున్నాను. కొత్త బ్యాంకులో రుణం 6.9శాతానికి వస్తోంది. అయితే, కొంత ఖర్చవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా మారడం మంచిదేనా?

- మహేందర్

మీ గృహరుణాన్ని వేరే బ్యాంకుకు బదిలీ చేసుకుంటే.. మీ వడ్డీ భారం 0.85శాతం తగ్గుతుంది. దీనివల్ల మీకు దీర్ఘకాలంలో లాభమే. మీ రుణం కూడా తొందరగా తీరుతుంది. వేరే బ్యాంకుకు మారేటప్పుడు తప్పనిసరిగా మార్టిగేజ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. కాస్త ఖర్చయినప్పటికీ.. రుణగ్రహీతకు ఏదైనా జరిగితే.. ఆ బీమా ద్వారా వచ్చే మొత్తంతో గృహరుణం తీరిపోతుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని