పింఛను పాలసీ.. తీసుకుంటున్నారా?
close

Updated : 23/07/2021 04:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పింఛను పాలసీ.. తీసుకుంటున్నారా?

పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి వచ్చే సాధారణ సందేహం.. రిటైరయ్యాక.. క్రమం తప్పని ఆదాయం రావాలంటే ఏం చేయాలి? దీనికి సరైన సమాధానం యాన్యుటీ పాలసీలని చెప్పొచ్చు. బీమా సంస్థలు అందించే ఈ పథకాల నుంచి పదవీ విరమణ తర్వాత పింఛను రూపంలో హమీతో కూడిన ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ యాన్యుటీ పథకాల్లో వెంటనే పింఛను వచ్చేవి, ఇప్పటి నుంచి మదుపు చేస్తూ వెళ్తే.. తర్వాత పింఛను ఇచ్చేవి.. ఫ్యామిలీ పింఛను ప్లాన్లు.. ఇలా అనేక రకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్‌లైన్‌లోనూ తీసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో యాన్యుటీ పాలసీలను తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటనేది తెలుసుకుందాం..

సాధారణంగా యాన్యుటీ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలనే ఆలోచన రాగానే.. బీమా సంస్థ నుంచి నేరుగా తీసుకోవాలా... ఎక్కడ నుంచి కొనాలి అనే ఆలోచన వస్తుంది. బీమా సంస్థను ఇప్పటికే ఎంపిక చేసుకుంటే.. నేరుగా ఆ సంస్థ వెబ్‌సైటు నుంచే ప్లాన్‌ను తీసుకోవచ్చు. ఇప్పుడు బీమా సంస్థలు అనేక రకాలైన డిజిటల్‌ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్‌, ఆన్‌లైన్‌ చాట్‌బోట్స్‌లాంటివీ అందుబాటులోకి వచ్చాయి. బీమా సంస్థ నుంచి యాన్యుటీని తీసుకోవడం సులభం కూడా. ఇన్సూరెన్స్‌ సంస్థ పోర్టల్‌లోకి లాగిన్‌ కావడం ద్వారా సులభంగా దీన్ని తీసుకోవచ్చు. ఒక దరఖాస్తు పత్రాన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. ప్రీమియం చెల్లించిన తర్వాత యాన్యుటీ ప్లాన్‌ అమల్లోకి వస్తుంది.

పోల్చి చూడండి..

ఏ యాన్యుటీ పాలసీని కొనాలనే విషయంలో స్పష్టత లేనప్పుడు బీమా అగ్రిగేటర్ల వెబ్‌సైట్లను సంప్రదించే అవకాశం ఉంది. ఈ వెబ్‌సైట్లు అన్ని బీమా సంస్థల నుంచి సమాచారం సేకరించి, ఒకే చోట అందిస్తాయి. అపుడు ఆయా పాలసీలను పోల్చుకునేందుకు సులభం అవుతుంది. వాటి మధ్య తేడాలనూ ఒకేచోట తెలుసుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్లలో ఉన్న ప్రయోజనాలనూ చూడొచ్చు. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుంది.

సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

ప్రస్తుతం అంతటా డిజిటల్‌ కీలకంగా మారింది. మీరు ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలోనైనా మీ పాలసీకి సంబంధించిన అన్ని సేవలూ క్షణాల్లో అందుకునే వీలుంది. పాలసీని డిజిటల్‌లోనే కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లింపు,  సమస్యలకు పరిష్కారం, వీడియో కాల్‌, చాట్‌బోట్‌ సేవలు ప్రతిక్షణం అందుబాటులో ఉంటాయి. లైఫ్‌ సర్టిఫికెట్‌నూ ఆన్‌లైన్‌లోనే  సమర్పించవచ్చు. సీనియర్‌ సిటిజన్లకు దీనివల్ల ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ప్రతిసారీ బీమా సంస్థ కార్యాలయానికి రావాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. క్లెయిం చేసుకునే సందర్భం వచ్చినప్పుడు.. ఆన్‌లైన్‌లోనే ఆ పనినీ పూర్తి చేయొచ్చు.

బ్యాంకును సంప్రదిస్తే..

ఇప్పుడు బ్యాంకులు.. బీమా సంస్థలు కలిసి బ్యాంకస్యూరెన్స్‌ పేరుతో పాలసీలను అందిస్తున్నాయి. మీ బ్యాంకును సంప్రదించడం ద్వారా మీ బీమా అవసరాలను తీర్చుకునే వీలుంది. బ్యాంకుల ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానూ వాటితో ఒప్పందం ఉన్న బీమా సంస్థల పాలసీలను కొనుగోలు చేయొచ్చు.

- ధీరజ్‌ సెహగల్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలయాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని