ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లతో 12 వేల ఉద్యోగాలు! - 12k Jobs in Ev Charging station in the next 3 mnts
close

Published : 03/04/2021 11:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లతో 12 వేల ఉద్యోగాలు!

రానున్న మూడు నెలల్లో నియామకాలు: టీంలీజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది. అందుకనుగుణంగా దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ కేంద్రాలను కూడా నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తర్వాత ఈ రంగంలో దాదాపు 10,000-12,000 ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చని ‘టీంలీజ్‌ సర్వీసెస్’‌ అనే మ్యాన్‌పవర్‌ కన్సల్టింగ్‌ సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు రాబోయే మూడు నెలల్లో విద్యుత్తు వాహన సంస్థలు నియామకాలు ప్రారంభించవచ్చని పేర్కొంది. మొత్తం నాలుగు మెట్రో నగరాలు, నాలుగు కాస్మోపాలిటన్‌ సిటీల్లో 60 వరకు ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

సొసైటీ ఆఫ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ గణాంకాల ప్రకారం 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 1,29,600 యూనిట్లు, 2019-20లో 1,55,400 యూనిట్ల విద్యుత్తు వాహనాలు అమ్ముడయ్యాయి. 2020-21లో కొవిడ్‌ ప్రభావం దృష్ట్యా అవి 1,40,000 యూనిట్లకు పరిమితమై ఉంటాయని అంచనా వేశారు. విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. తక్కువ జీఎస్టీ రేటుతో పాటు ఫేమ్‌-2(ఫాస్టర్‌ ఆడాప్షన్‌ అండ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ అండ్‌ హైబ్రిడ్‌ వెహికల్స్‌) పథకం వల్ల అనేక ప్రధాన వాహన తయారీ సంస్థలు విద్యుత్తు వాహనాల ఉత్పత్తివైపు మళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. 2030 నాటికి దేశంలో వ్యక్తిగత విద్యుత్తు కార్లు 20-30 శాతం, ద్విచక్ర వాహనాలు 25-35 శాతం, త్రిచక్ర వాహనాలు 65-75 శాతానికి పెరిగే అవకాశం ఉందని కేపీఎంజీ అంచనా వేసింది.

ఇప్పటికే విద్యుత్తు వాహన తయారీ రంగంలో ఉన్న సంస్థలతో పాటు తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌, టెస్లా మోటార్స్‌ ఈ విభాగంలోకి ప్రవేశించాయి. దీంతో ఈ రంగంలో రానున్న మూడు నెలల్లో ఉద్యోగ నియామకాలు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ‘కండక్టెడ్‌, రేడియేటెడ్‌ ఎమిషనన్స్‌’ విభాగంలో నైపుణ్యం ఉన్నవారిని ఉన్నతస్థాయి ఉద్యోగాలకు తీసుకునే అవకాశం ఉందని టీంలీజ్‌ తెలిపింది. అలాగే డిప్లోమా, ఐటీఐ సర్టిఫికెట్‌తో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్నవారికి కిందిస్థాయి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని