2118 బ్యాంకు శాఖలు విలీనం లేదా మూసివేత - 2118 Merger or closure of bank branches
close

Published : 10/05/2021 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2118 బ్యాంకు శాఖలు విలీనం లేదా మూసివేత

ఇండోర్‌: గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2,118 శాఖలు మూసివేయడం లేదా ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం జరిగింది. ఇందులో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు చెందిన 1,283 శాఖలు ఉన్నట్లు చంద్రశేఖర్‌ గౌడ్‌ వెల్లడించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు సేకరించానని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌లకు చెందిన ఏ శాఖను మూసివేయలేదు. గత ఆర్థిక సంవత్సరంలో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా హేతుబద్ధీకరించిన తర్వాత జాతీయ బ్యాంకుల సంఖ్య 12కు పరిమితమైంది.


విలీనాలు, కొనుగోళ్లు 8% పెరిగాయ్‌

ముంబయి: ఒకపక్క కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి ఉన్నప్పటికీ.. పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణ 133 శాతం పెరిగిందని, ఈ ఏడాదిలో ఏప్రిల్‌ చివరకు 437 లావాదేవీల పరంగా విలీనాలు, కొనుగోళ్ల విలువ 8 శాతం పెరిగి 32.3 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఒక నివేదిక పేర్కొంది. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ అనుబంధ సంస్థ, ఆర్థిక మార్కెట్ల దిగ్గజం రెఫినిటివ్‌ గణాంకప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ ఆఖరుకు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 28 కంపెనీలు 2.7 బిలియన్‌ డాలర్లు సమీకరించాయి. ప్రైవేట్‌ ఈక్విటీ మద్దతుతో జరిగిన లావాదేవీలు ఏకంగా 110 శాతం పెరిగాయి. ఈ సమయంలో జరిగిన 93 లావాదేవీల విలువ 5.9 బిలియన్‌ డాలర్లని రెఫినిటివ్‌ పేర్కొంది. సీమాంతర లావాదేవీలు 4 శాతం పెరిగి 14.3 బిలియన్‌ డాలర్ల (124 లావాదేవీల)కు చేరాయి. వ్యూహాత్మక ఒప్పందాలు 3 శాతం తగ్గి 26.4 బిలియన్‌ డాలర్ల (338 లావాదేవీల)కు తగ్గాయి.


రెండో నెలా ఫండ్‌ల జోరు

ఏప్రిల్‌లో ఈక్విటీల్లోకి రూ.5,526 కోట్లు

దిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్ల కొనుగోళ్ల పరంపర వరుసగా రెండో నెలా కొనసాగింది. ఏప్రిల్‌లో షేర్లలో రూ.5,526 కోట్ల పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల మార్కెట్‌లో కొంత స్థిరీకరణ తర్వాత మళ్లీ అవకాశాలను ఫండ్‌ మేనేజర్లు ఒడిసిపట్టుకుంటున్నారు. ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడులు రాబోయే నెలల్లో కొనసాగొచ్చని, ఈ విభాగంలో పలు కొత్త ఫిన్‌టెక్‌ సంస్థలు అడుగుపెట్టడంతో వినియోగదారులు పెరగనున్నారని ఇన్వెస్ట్‌19 వ్యవస్థాపక సీఈఓ కౌశలేంద్ర సింగ్‌ సెంగార్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ ఒడుదొడుకులు పెరగడంతో, మదుపర్లు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లకు మొగ్గుచూపడం ద్వారా నష్టభయాన్ని తగ్గించుకున్నారని, దీంతో గత నెలలో పెట్టుబడులు 15.8 శాతం పెరిగాయని అన్నారు.
* సెబీ గణాంకాల ప్రకారం.. మార్చిలో మ్యూచువల్‌ ఫండ్‌లు రూ.4,773 కోట్లు పెట్టుబడులు పెట్టగా, గత నెలలో రూ.5,526 కోట్లు చొప్పించాయి. గత 10 నెలల్లో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
* అంతకు ముందు 2020 జూన్‌ నుంచి ఈక్విటీల్లో నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది మార్చిలో మళ్లీ పెట్టుబడుల రావడం ప్రారంభమైంది.
* మార్చిలో సిప్‌ పెట్టుబడులు రూ.9,182 కోట్లకు పెరిగాయి. అంతకు ముందు నెలలో ఇవి రూ.7,528 కోట్లుగా మాత్రమే.
* నెలవారీగా చూస్తే 2021 ఫిబ్రవరిలో రూ.16,306 కోట్లు, జనవరిలో రూ.13,032 కోట్లు, 2020 డిసెంబరులో రూ.26,428 కోట్లు, నవంబరులో రూ.30,760 కోట్లు, అక్టోబరులో రూ.14,492 కోట్లు, సెప్టెంబరులో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జులైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్ల చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
* 2020 జనవరి- మేలో మ్యూచువల్‌ ఫండ్లు రూ.40200 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఇందులో మార్చిలోనే రూ.30,285 కోట్లు చొప్పించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని