5G పూర్తి సురక్షితం: COAI - 5G tech safe concerns around health consequences misplaced says COAI
close

Published : 06/06/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5G పూర్తి సురక్షితం: COAI

దిల్లీ: దేశంలో త్వరలో 5జీ టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పలువురి నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణి కోటిపై 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 5జీ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని, తప్పుడు ప్రచారం జరుగుతోందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (COAI) తెలిపింది. 5జీ టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని కాయ్‌ వివరించింది. రాబోయే కాలంలో 5జీ గేమ్‌ ఛేంజర్‌గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంది.

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి అతి పెద్ద టెలికాం సంస్థలు 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్‌తోనే ఈ సేవలను తీసుకురానున్నాయి. ‘5జీ విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ ప్రమాణాలతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఉండేలా భారత్‌ నిబంధనలు విధించింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్న ప్రతిసారీ ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి’ అని కాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ అభిప్రాయపడ్డారు.

తాజాగా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా దిల్లీ కోర్టు తీర్పును ఎస్పీ కొచ్చర్‌ స్వాగతించారు. సామాజిక మాధ్యమాల వేదికగా 5జీ విషయంలో వచ్చే అసత్య సందేశాలను నమ్మొద్దని కొచ్చర్‌ పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని