ఆగస్టులో 67 లక్షల విమాన ప్రయాణికులు - 67 lakh air passengers in August
close

Published : 17/09/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టులో 67 లక్షల విమాన ప్రయాణికులు

జులైతో పోలిస్తే  33.83 శాతం వృద్ధి
పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌

దిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో సుమారు 67.01 లక్షల మంది దేశీయ విమానాల్లో  ప్రయాణించారని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. జులై ప్రయాణికులు 50.07 లక్షల మందితో  పోలిస్తే ఇది 33.83 శాతం అధికం. ఈ ఏడాది జూన్‌లో 31.13 లక్షలు, మేలో 21.15 లక్షలు, ఏప్రిల్‌లో 57.25 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారని వెల్లడించింది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మేలో దేశీయ విమాన ప్రయాణాలు బాగా తగ్గాయని తెలిపింది. ఆగస్టులో ఇండిగో అత్యధికంగా 38.16 లక్షల మంది ప్రయాణికులను (57 శాతం వాటా) గమ్యస్థానాలకు చేర్చింది. స్పైస్‌జెట్‌లో 5.84 లక్షల మంది (8.7 శాతం), ఎయిరిండియాలో 8.86 లక్షల మంది, గోఫస్ట్‌లో (గతంలో గోఎయిర్‌) 4.58 లక్షల మంది, విస్తారాలో 5.58 లక్షల మంది, ఎయిరేషియా ఇండియాలో 3.49 లక్షల మంది గత నెలలో ప్రయాణించారు. 6 ప్రధాన విమానయాన సంస్థల్లో సీట్ల భర్తీ 60.3-79.6 శాతంగా నమోదైంది. స్పైస్‌జెట్‌లో అత్యధికంగా సీట్లు భర్తీ కాగా, ఎయిరేషియా ఇండియాలో అత్యల్పంగా సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుతం 72.5 శాతం గరిష్ఠ సామర్థ్యంతో విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతులున్నాయి.


ప్రమోటర్లకు మారటోరియం వర్తించదు
అది అప్పు తీసుకున్న కంపెనీకి మాత్రమే: సుప్రీం

దిల్లీ: దివాలా స్మృతి(ఐబీసీ) నిబంధనల కింద ఒత్తిడిలో ఉన్న కంపెనీకి మాత్రమే మారటోరియం వర్తిస్తుంది మినహా సదరు కంపెనీ ప్రమోటర్లను రక్షించడానికి దానిని ఉపయోగించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బిల్డరుకు, గృహ కొనుగోలుదార్లకు మధ్య వచ్చిన వివాదానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యానించింది. ఐబీసీ సెక్షన్‌-14 కింద ‘టుడే హోమ్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రా’కు మారటోరియాన్ని ప్రకటించినప్పటికీ.. ఆ కంపెనీ ప్రమోటర్లపై కేసు వేయడానికి గృహ కొనుగోలుదార్లను అనుమతించడానికి న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మొదట్లో వెలువడ్డ తీర్పును ఉటంకిస్తూ ‘దివాలా చట్టంలోని సెక్షన్‌ 14 కింద మారటోరియంలో ఉన్న కార్పొరేట్‌ రుణస్వీకర్తపై నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద విచారణ చేపట్టడాన్ని తాము సమర్థిస్తున్న’ట్లు తెలిపింది. గతంలో ఇచ్చిన తీర్పుపై స్పష్టతనిస్తూ మారటోరియం అనేది కేవలం కార్పొరేట్‌ రుణ స్వీకర్తకే వర్తిస్తుంది మినహా డైరెక్టర్లు, యాజమాన్యానికి కాదు కాబట్టి విచారణను కొనసాగించొచ్చ’ని తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని