ఈ ఏడాది 7.2% వృద్ధి - 7.2 percent growth this year
close

Published : 17/09/2021 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది 7.2% వృద్ధి

వచ్చే ఏడాది 6.7 శాతానికి పరిమితం
భారత్‌పై ఐక్యరాజ్యసమితి అంచనాలు

ఐక్యరాజ్యసమితి: భారత్‌ ఈ ఏడాది 7.2 శాతంవృద్ధి రేటును నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) నివేదిక అంచనా వేసింది. వచ్చే ఏడాది మాత్రం వృద్ధిరేటు తగ్గే అవకాశం ఉందంటోంది. కరోనా మహమ్మారి వల్ల మనుషులతో పాటు ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుండడంతో, రికవరీకి ఇబ్బందులు ఎదురుకావొచ్చని పేర్కొంది. ప్రైవేటు వినియోగంపై ఆహార ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చని అంచనా వేసింది. యూఎన్‌సీటీఏడీ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ 2021 పేరిట విడుదలైన నివేదిక ప్రకారం..

* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2021లో బలమైన రికవరీని సాధించనుంది. అయితే ద్వితీయార్థంలో ప్రాంతీయ, దేశాల స్థాయిలో అనిశ్చిత మేఘాలు ఆవరించే అవకాశం ఉంది.

* గతేడాది 3.5 శాతం క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.3 శాతం వృద్ధి చెందొచ్చు. అదే జరిగితే గత 50 ఏళ్లలో ఇదే అత్యధిక వృద్ధి అవుతుంది.  2021 చివరి నాటికి 2019 స్థాయి ఉత్పత్తికి ఇంకా కొన్ని దేశాలు చేరుకునే యత్నంలో ఉండగా.. కొన్ని అధిగమించే అవకాశం ఉంది. 2021 తర్వాత అంతర్జాతీయ ముఖచిత్రం అనిశ్చితిగానే ఉండొచ్చు.

* అమెరికా ఈ ఏడాది 5.7 శాతం వృద్ధిని, వచ్చే ఏడాది 3% వృద్ధిని నమోదు చేయవచ్చు. చైనా విషయానికొస్తే 2021, 2022లలో వరుసగా 8.3%, 5.7% చొప్పున రాణించవచ్చు.

* 2020లో 7% క్షీణించిన భారత్‌ ఈ ఏడాది 7.2 శాతం; వచ్చే ఏడాది 6.7 శాతం మేర వృద్ధి చెందొచ్చు. 2022లో 6.7 శాతం నమోదైనా కూడా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసే దేశమవుతుంది.

* ప్రైవేటు రంగ కార్యకలాపాలు మందగమించడంతో ఉద్యోగాల నియామకాలు స్తబ్దుగా ఉండడం; ద్రవ్యపరంగా లోటు ఉండడంతో వాణిజ్య సమతౌల్యంపై ఒత్తిడి పెరిగి వచ్చే ఏడాది భారత వృద్ధి 6.7 శాతానికే పరిమితం కావొచ్చు.


సిట్రాన్‌ సి3 ఆవిష్కరణ 2022 ప్రథమార్ధంలో విడుదల

దిల్లీ: సరికొత్త మోడల్‌ సి3ని సిట్రాన్‌ గురువారం ఆవిష్కరించింది. స్టెల్లాంటిస్‌ గ్రూప్‌నకు చెందిన సిట్రాన్‌.. అంతర్జాతీయ వాహన సంస్థలు ఎఫ్‌సీఏ, గ్రూప్‌ పీఎస్‌ఏల విలీనంతో ఏర్పాటైంది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవుండే హ్యాచ్‌బ్యాక్‌ ఎస్‌యూవీనే సి3. భారత్‌తో పాటు దక్షిణ అమెరికాలో అభివృద్ధి-ఉత్పత్తి చేసి అంతర్జాతీయ విపణిలో ప్రవేశపెట్టాలని సిట్రాన్‌ భావిస్తున్న 3 వాహనాల్లో సి3 తొలి మోడల్‌. 2022 ప్రథమార్ధంలో చెన్నై తయారీ ప్లాంట్‌ నుంచి ఈ కొత్త మోడల్‌ను దేశీయ విపణిలోకి తీసుకొస్తామని సిట్రాన్‌ సీఈఓ విన్సెంట్‌ కోబీ వెల్లడించారు. దేశీయంగా సిట్రాన్‌ ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని