కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌ - 700 tons of oxygen per day to the covid‌ affected states
close

Published : 21/04/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌

 సరఫరా పెంచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస

దిల్లీ: కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తున్న మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ పరిమాణాన్ని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెంచింది. కంపెనీకి చెందిన జామ్‌నగర్‌ చమురు రిఫైనరీ నుంచి రోజుకు 700 టన్నులకు పైగా మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసి, ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలుత ఈ రిఫైనరీల నుంచి రోజుకు 100 టన్నుల మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగా.. ప్రస్తుతం 700 టన్నులకు పైగా   చేస్తున్నారు. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. రోజుకు 70,000 పైగా రోగులకు ఇది ఉపశమనం కల్పించనుంది. త్వరలోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 1000 టన్నులకు పెంచడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు రిలయన్స్‌ వర్గాలు తెలిపాయి.


ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థల రుణ పునర్‌వ్యవస్థీకరణ
ప్రణాళికకు రుణదాతల ఆమోదం

దిల్లీ: ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థలైన ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ల రుణదాతలు ఆ సంస్థల రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చాయి. గత వారం 28 బ్యాంకుల రుణదాతల కన్సార్షియం ఫ్యూచర్‌ రిటైల్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్‌ కంపెనీల బోర్డులు కూడా రుణదాతల ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం కంపెనీలకు ఉన్న సెక్యూర్డ్‌ ఆర్థిక రుణాల్ని పునర్‌వ్యవస్థీకరించే ప్రణాళికను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నియమించిన కేవీ కామత్‌ నిపుణుల కమిటీకి పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర 19 సంస్థలు రుణదాతలుగా ఉన్నాయి. కంపెనీ ఎంత మొత్తంలో రుణ పునర్‌వ్యవస్థీకరణ చేయనుందో వెల్లడించలేదు. కేర్‌ రేటింగ్స్‌ ప్రకారం, 2020 డిసెంబరు నాటికి ఈ సంస్థకు రూ.1,777 కోట్ల రుణాలున్నాయి. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తుంది. ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ లాజిస్టిక్స్‌ కంపెనీ. ఇది గిడ్డంగులు, పంపిణీ, ఇతర లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌ను అందిస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని