వేడి కబురు.. పెరగనున్న ఏసీల ధరలు! - AC makers set to hike prices to offset rising input costs
close

Updated : 14/03/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేడి కబురు.. పెరగనున్న ఏసీల ధరలు!

దిల్లీ: అసలే రానున్నది ఎండాకాలం.. పైగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. చక్కగా ఓ ఏసీ కొనుక్కుందాం అనుకునేవారికి వేడి కబురు. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏసీ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ధరలు పెంచనున్నాయి. అదే సమయంలో ఈ సారి రెండంకెల వృద్ధి ఉంటుందని కంపెనీలు ఆశావహ దృక్పథంతో ఉన్నాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ విధానం ఉన్న నేపథ్యంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని వోల్టాస్‌, డైకిన్‌, ఎల్జీ, పానాసోనిక్‌, హైయర్‌, బ్లూస్టార్‌, శాంసంగ్‌ వంటి కంపెనీలు అశాభావం వ్యక్తం చేస్తున్నాయి. నో కాస్ట్‌ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్‌ వంటి సదుపాయలు కల్పిస్తూ సేల్స్‌ను పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

ఏసీ తయారీకి వినియోగించే మెటల్‌, కంప్రెసర్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్‌ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, డిమాండ్‌ ఏమాత్రం తగ్గదని డైకిన్‌ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్‌ జీత్‌ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్‌ వెల్లడించింది. రిఫ్రిజిరేటర్ల ధరలు సైతం 3-4 శాతం పెంచనున్నట్లు ఆ కంపెనీ దక్షిణాసియా ప్రెసిడెంట్‌, సీఈవో మనీశ్‌ శర్మ తెలిపారు.

టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్‌ ఇప్పటికే ఏసీల ధరలు పెంచింది. ముడి సరకులు ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బ్లూస్టార్‌ సైతం ఇప్పటికే వివిధ శ్రేణి ఏసీలపై 5 నుంచి 8 శాతం ధరలను పెంచింది. ఏప్రిల్‌లో మరో 3 శాతం మేర ధరలు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. 2019తో పోలిస్తే అమ్మకాల్లో 30 శాతం  మేర వృద్ధి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆ కంపెనీ ఎండీ త్యాగరాజన్‌ తెలిపారు. హైయర్‌ కంపెనీ సైతం 8 శాతం మేర ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు నుంచే పెంపు ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ వేసవిలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో 40 నుంచి 45 శాతం మేర అమ్మకాల్లో వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నామని ఎల్జీ తెలిపింది.

ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం 10 నుంచి 12 శాతం పెరిగిందని కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ అప్లయెన్సెస్‌ మానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఈఏఎంఏ) తెలిపింది. ప్రస్తుతం ఐదారు శాతం మేర మాత్రమే ధరల పెరుగుదల ఉందని, మిగిలిన ఐదారు శాతం ఏప్రిల్‌ నెలలో ఉంటుందని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నాంది తెలిపారు. ఏటా దేశంలో 70 నుంచి 75 లక్షల ఏసీలు అమ్ముడవుతుండగా.. 15 కంపెనీలు ఈ విభాగంలో పోటీ పడుతున్నాయి.

ఇవీ చదవండి..
చిన్న కార్లకు మళ్లీ గిరాకీ!
కొత్తగా 66 విమాన సర్వీసులు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని