ఇండియాగోల్డ్‌కు రూ.89 కోట్ల పెట్టుబడి - An investment of Rs 89 crore in IndiaGold
close

Published : 28/08/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండియాగోల్డ్‌కు రూ.89 కోట్ల పెట్టుబడి

దిల్లీ: ఇంటి వద్దకు వచ్చి, బంగారంపై రుణాలనిచ్చే డిజిటల్‌ గోల్డ్‌లోన్‌, లాకర్లను అందించే ఇండియాగోల్డ్‌ రూ.89 కోట్ల (12 మిలియన్‌ డాలర్ల) పెట్టుబడిని సమీకరించింది. పేయూ, ఆల్ఫా వేవ్‌ ఇంక్యుబేషన్‌ ఆధ్వర్యంలో ఈ పెట్టుబడులు సమకూరాయి. ఇందులో బెటర్‌ టుమారో వెంచర్స్‌, 3వన్‌4 క్యాపిటల్‌, రైన్‌మ్యాటర్‌ క్యాపిటల్‌ తదితరాలతో పాటు, ఇప్పటికే పెట్టుబడి పెట్టిన దీపక్‌ అబాట్‌, నితిన్‌ మిశ్రాలూ ఉన్నారు. ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా ఖాతాదారులు ఈ సంస్థకు ఉన్నారు. కొవిడ్‌-19 తర్వాత స్వల్పకాలిక, తక్కువ వడ్డీ ఉండే రుణాలకు గిరాకీ పెరిగిందని, ఈ నేపథ్యంలో ఈ పెట్టుబడి సమీకరణ ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలవుతుందని ఇండియాగోల్డ్‌ వెల్లడించింది. దేశంలో 650 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.49 లక్షల కోట్ల) బంగారు రుణాలకు అవకాశం ఉందని, ఇందులో ఎక్కువగా అసంఘటిత రంగంలోనే ఉన్నాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్‌ మిశ్రా పేర్కొన్నారు. ఈ రుణాలను డిజిటల్‌ విధానంలో అందించడం ద్వారా ఎక్కువ మందికి చేరుకునే వీలుంటుందన్నారు.


అమి ఆర్గానిక్స్‌ ఐపీఓ 1 నుంచి

ధరల శ్రేణి రూ.603-610

దిల్లీ: స్పెషాలిటీ రసాయనాల తయారీ సంస్థ అమి ఆర్గానిక్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. రూ.570 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.603-610గా నిర్ణయించారు. రూ.200 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ప్రస్తుత వాటాదార్లకు చెందిన 60.59 లక్షల షేర్లనూ విక్రయించనున్నారు. ఐపీఓ ముందస్తు కేటాయింపుల కింద ఇప్పటికే రూ.100 కోట్లు సమీకరించినందున, తాజాగా జారీ చేసే షేర్ల పరిమితిని రూ.300 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించారు. సమీకరించే నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలతో పాటు రుణాలు తీర్చేందుకు వినియోగిస్తారు. రిటైల్‌ మదుపర్లకు 35 శాతం షేర్లు కేటాయిస్తారు. యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇంగ్రేడియెంట్స్‌, కొత్త రసాయన సంస్థలకు అవసరమైన ఫార్మా ఇంటర్‌మీడియెట్స్‌ను అభివృద్ధి చేసి, తయారు చేసే సంస్థ ఇది. 2018లో కూడా ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీ వద్ద ముసాయిదా ప్రతిపాదనలు దాఖలు చేసి, అనుమతి పొందినా, విపణిలోకి రాలేదు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని