నేడు 50 నగరాల్లో అపోలో హాస్పిటల్స్‌ టీకా కార్యక్రమం - Apollo Hospitals‌ vaccination program in 50 cities today
close

Updated : 30/06/2021 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేడు 50 నగరాల్లో అపోలో హాస్పిటల్స్‌ టీకా కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ ఈ నెల 30న దేశవ్యాప్తంగా 50 నగరాల్లో కొవిడ్‌-19 టీకా కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీని కోసం 200 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అపోలో హాస్పిటల్స్‌  వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కేంద్రాల్లో టీకా తీసుకోవచ్చు. దీనికోసం అపోలో 24/7 యాప్‌లో తమకు దగ్గరగా ఉన్న టీకా కేంద్రాన్ని ఎంచుకుని  స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని వివరించారు. ఇప్పటి వరకు అపోలో హాస్పిటల్స్‌ ద్వారా 21 లక్షల డోసుల టీకా ఇచ్చినట్లు తెలిపారు. తద్వారా టీకాల జారీలో ప్రైవేటు రంగంలో అతిపెద్ద సంస్థగా నిలిచినట్లు పేర్కొన్నారు.

డాక్టర్‌ రెడ్డీస్‌కు బి మెడికల్‌ సిస్టమ్స్‌ కోల్డ్‌ చైన్‌ సేవలు

ఈనాడు, హైదరాబాద్‌:  దేశవ్యాప్తంగా ‘స్పుత్నిక్‌ వి’ టీకా పంపిణీకి అనువైన కోల్డ్‌ చైన్‌ సేవలు అందించటానికి లగ్జెంబర్గ్‌కు చెందిన మెడికల్‌ రిఫ్రిజిరేషన్‌ ఉత్పత్తుల కంపెనీ- బి మెడికల్‌ సిస్టమ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో మెడికల్‌ ఫ్రీజర్లను బి మెడికల్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేస్తుంది. స్పుత్నిక్‌ వి టీకాను మైనస్‌ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. అ మైనస్‌ 25 డిగ్రీల ఉష్ణోగ్రత సామర్థ్యం ఉన్న ఫ్రీజర్లను లగ్జెంబర్గ్‌ నుంచి భారత దేశానికి పంపుతున్నట్లు ఈ కంపెనీ వెల్లడించింది.

టీకా పంపిణీలో జాప్యం!: వాణిజ్యపరంగా స్పుత్నిక్‌ వి టీకా పంపిణీలో కొంత జాప్యం చోటుచేసుకోనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే టీకా పంపిణీ ప్రారంభం కావాలి. కానీ తగినంత టీకా నిల్వ లేకపోవడం, నాణ్యతా పరీక్షలు పూర్తికాకపోవడం.. వంటి కారణాల వల్ల వాణిజ్యపరంగా టీకా పంపిణీని డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రారంభించలేకపోయినట్లు సమాచారం. ప్రస్తుతం పైలెట్‌ పద్ధతిలోనే స్పుత్నిక్‌ వి టీకా పంపిణీ జరుగుతోంది. రష్యా నుంచి మరికొన్ని డోసుల టీకా వచ్చాక వాణిజ్య పద్ధతిలో చేపడతారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని