close

Updated : 02/03/2021 05:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంక్షిప్త వార్తలు

జీఎస్‌టీ వసూళ్లు రూ.1,13,143 కోట్లు

ఈటీవీభారత్‌: వరుసగా ఐదో నెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మైలురాయిని అధిగమించాయి. 2021 ఫిబ్రవరిలో ఇవి రూ.1,13,143 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఫిబ్రవరి నాటి రూ.1,05,366 కోట్ల కంటే ఇవి 7 శాతం అధికం. జీఎస్‌టీ వసూళ్లు రూ.1.1 లక్షల కోట్లను మించడం వరుసగా ఇది మూడో నెల. 2020 డిసెంబరులో రూ.1,15,174 కోట్లు, 2021 జనవరిలో రూ.1,19,847 కోట్లుగా నమోదవ్వడం విదితమే.


టీజీబీ, ఏపీజీవీబీల్లో వీడియో కేవైసీ
ప్రాంతీయ బ్యాంకుల్లో దేశంలోనే తొలిసారి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ), ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (ఏపీజీవీబీ)లలో డిజిటల్‌ పొదుపు ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. వీడియో కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) ద్వారా ఈ ఖాతాలను ప్రారంభించేందుకు వీలుంది. సోమవారం దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా ఈ సేవలను ప్రారంభించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) వీడియో కేవైసీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కీలక పరిణామమని తెలిపారు. దేశంలో తొలిసారిగా ఈ రెండు ఆర్‌ఆర్‌బీలు వీడియో కేవైసీ సేవలను తీసుకొచ్చాయి. 18 ఏళ్లు నిండి, ఈ బ్యాంకుల్లో తొలిసారి ఖాతాను ప్రారంభించేవారు, ఆధార్‌, పాన్‌ కార్డులు ఉన్నవారు ఈ సేవలను పొందవచ్చు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ సీజీఎం దేవేంద్ర కుమార్‌, టీజీబీ ఛైర్మన్‌ అర్వింద్‌ కుమార్‌, ఏపీజీవీబీ ఛైర్మన్‌ కె.ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.


సెంట్రల్‌ బ్యాంక్‌ ఎండీగా వెంకటరావు బాధ్యతల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)- ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) బాధ్యతలను తెలుగువారైన మాతం వెంకట రావు సోమవారం చేపట్టారు. ఇప్పటివరకు ఆయన కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. పదోన్నతిపై  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ- సీఈఓ అయ్యారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వెంకట రావు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుంచి ఏజీ-బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా 1988లో అలహాబాద్‌ బ్యాంకులో చేరారు. ఆ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేశారు. కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కెనరా బ్యాంకు- సిండికేట్‌ బ్యాంకు విలీన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.


క్లియర్‌ట్రిప్‌ కొనుగోలు యత్నాల్లో ఫ్లిప్‌కార్ట్‌ !

దిల్లీ: ఇ-కామర్స్‌ రంగ దిగ్గజ సంస్థలన్నీ ‘అన్ని సేవలు ఒకేచోట అందించే’ సూపర్‌ యాప్‌ దిశగా సాగుతున్నాయి. అన్ని రకాల ఉత్పత్తుల అమ్మకాలతో పాటు ఆహార సరఫరా, బిల్లుల చెల్లింపు, రోడ్డు-రైలు-విమాన టికెట్ల అమ్మకాలు కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌ కూడా ట్రావెల్‌ అగ్రిగేటర్‌ అయిన క్లియర్‌ట్రిప్‌లో నియంత్రణ పరమైన వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తోందని సమాచారం. మెజారిటీ వాటా కొనుగోలుకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు మనీకంట్రోల్‌ వెల్లడించింది.


* గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజీ, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు నిమిత్తం మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా, ఇండియా ఐఎన్‌ఎక్స్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజీ, నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ తెలిపింది.
* షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో 63.75% ప్రభుత్వ వాటా కొనుగోలుకు పలు బిడ్‌లు వచ్చాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. బిడ్‌ వేసిన సంస్థలో ఫోర్‌సైట్‌ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది.  
* ముంబయిలో గృహ సముదాయ ప్రాజెక్టు నిమిత్తం 1.5 ఎకరాల స్థలాన్ని రూ.166 కోట్లకు గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ కొనుగోలు చేసింది.  
* ఇ- లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశాన్ని తమ ఉద్యోగులకు కల్పించే నిమిత్తం బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)- పిలానీతో ఒప్పందం కుదుర్చుకున్నామని అర్సెలర్‌మిత్తల్‌ నిప్పోన్‌ స్టీల్‌ ఇండియా తెలిపింది.
* సీ అండ్‌ ఎస్‌ ఎలక్ట్రిక్‌ లిమిటెడ్‌లో 99.22% వాటాను రూ.2,100 కోట్లకు ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తిచేసినట్లు సీమెన్స్‌ తెలిపింది.
* మధ్యప్రాచ్య, ఆఫ్రికాలోని టెలికాం సంస్థలతో రూ.700 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది.  
* అస్సోమ్‌లోని నుమాలిగఢ్‌ రిఫైనరీలో తనకున్న 61.65 శాతం వాటా విక్రయించనున్నట్లు భారత్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) తెలిపింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఆయిల్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, అస్సోమ్‌ ప్రభుత్వ కన్షార్షియమ్‌ రూ.9,876 కోట్లకు ఈ వాటా కొనుగోలు చేయనుందని పేర్కొంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 (40 శాతం) డివిడెండు చెల్లించేందుకు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
* దాదాపు 19 లక్షల టయోటా ఆర్‌ఏవీ4 చిన్న ఎస్‌యూవీల్లో ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌ లోపాలపై అమెరికా ప్రభుత్వం విచారణ జరుపుతోంది.  
* కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వంతు సాయంగా రూ.11 కోట్లను పీఎం-కేర్స్‌ నిధికి విరాళం అందించింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని