close

Published : 05/03/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవాగ్జిన్‌పైఫ్రాన్స్‌ ఆసక్తి

 యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ అనుమతి అవసరం
 బ్రెజిల్‌కు 6-7 నెలల్లో ఎగుమతులు ప్రారంభం

భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకా కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే దేశాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ టీకా కోసం భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పుడు ఫ్రాన్స్‌ వంతు వచ్చింది. ఫ్రాన్స్‌లో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. ప్రజలందరికీ టీకా ఇచ్చి ఈ మహమ్మారి ముప్పు నుంచి కాపాడాలనే ఒత్తిడి అక్కడి ప్రభుత్వంపై వస్తోంది. ఇందుకోసమే ‘కొవాగ్జిన్‌’ టీకా కొనుగోలు చేయాలనే ఆలోచన అక్కడి ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మనదేశంలోని ఫ్రాన్స్‌ రాయబారి ఎమ్మాన్యుయేల్‌ లేనేయిన్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చి భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లను కలిశారు. సమీప భవిష్యత్తులో టీకా సరఫరా చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిసింది.
ఐరోపా సమాఖ్యలో భాగస్వామి కావడంతో
ఫ్రాన్స్‌ ఐరోపా సమాఖ్య (ఈయూ)లో భాగస్వామిగా ఉంది. కొవాగ్జిన్‌ టీకాను ఐరోపా దేశాలు కొనుగోలు చేయాలంటే, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ (ఈఎంయూ) అనుమతి కావాలి. ఈ టీకా సామర్థ్యం 81 శాతంగా మనదేశంలో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు అత్యవసర వినియోగ అనుమతి కింద ఈ టీకాను ప్రజలకు ఇస్తున్నారు. ఇక పూర్తిస్థాయి అనుమతి కోసం కోసం భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేయొచ్చు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఫైజర్‌-బయాన్‌టెక్‌, మొడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలు సరఫరా అవుతున్నాయి. కానీ ఆ దేశ అవసరాలకు తగినంతగా ఈ టీకాలు అందడం లేదు. అందువల్ల ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఇతర టీకా తయారీ సంస్థల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.  
బ్రెజిల్‌ బాటలోనే: ఇప్పటికే బ్రెజిల్‌కు 2 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా సరఫరా చేసేందుకు భారత్‌ బయోటెక్‌ ఒప్పందం చేసుకుంది. ఈ సరఫరాలు ఆరేడు నెలల్లో ప్రారంభం కావచ్చు. అన్నీ కుదిరితే త్వరలో ఫ్రాన్స్‌తోనూ ఇటువంటి ఒప్పందం కుదురుతుందని తెలుస్తోంది. దాదాపు 40 దేశాలు టీకా కోసం తమను సంప్రదిస్తున్నట్లు పలు సందర్భాల్లో భారత్‌ బయోటెక్‌ వెల్లడించడం గమనార్హం. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టీకా తయారీ పెంచడానికి భారత్‌ బయోటెక్‌ సన్నాహాలు చేస్తోంది. నెలకు 4 కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి వీలుగా బీఎస్‌ఎల్‌-3 ప్రమాణాలతో కూడిన మూడో ప్లాంటును ఈ కంపెనీ నిర్మిస్తోంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుందని తెలిసింది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని