సంక్షిప్తవార్తలు - BUSINESS
close

Updated : 30/07/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్తవార్తలు

* ఫ్యూచర్‌ రిటైల్‌- రిలయన్స్‌ లావాదేవీకి వ్యతిరేకంగా అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును న్యాయమూర్తులు జస్టిస్‌ నారిమన్‌, జస్టిస్‌ గవాయ్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్‌ రిజర్వు చేసింది. సింగపూర్‌ మధ్యవర్తిత్వ కోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందిగా అమెజాన్‌ కోరుతుంది.

* అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద దాదాపు 1.09 కోట్ల ఎంఎంస్‌ఎంఈ రుణగ్రహీతలకు రూ.1.65 లక్షల కోట్ల సాయం అందినట్లు పార్లమెంట్‌కు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌ రాణే తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి చిన్న, మధ్య తరహా సంస్థలు కోలుకోవడానికి ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ 2020లో భాగంగా ఈసీఎల్‌జీఎస్‌ పథకాన్ని ప్రకటించారు.

* దేశంలోనే మొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఫ్యూలింగ్‌ స్టేషన్‌ను లద్దాఖ్‌లోని లేహ్‌లో నెలకొల్పడానికి దేశీయ టెండర్‌లను అనుబంధ సంస్థ ఎన్‌టీపీసీ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఆహ్వానించినట్లు ఎన్‌టీపీసీ వెల్లడించింది.

* ఇంటర్నెట్‌ సేవల లైసెన్సు నిబంధనలను భారతీ ఎయిర్‌టెల్‌, టాటా కమ్యూనికేషన్స్‌, రైల్‌టెల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, స్విస్‌ఫోన్‌ ఇండియా, సిఫీ టెక్నాలజీస్‌ సహా 34 కంపెనీలు ఉల్లంఘించాయని గుర్తించినట్లు కేంద్ర టెలికాం సహాయ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌ పార్లమెంట్‌ వెల్లడించారు. ఈ జాబితాలో సి-డాక్‌ నోయిడా, ఐస్‌నెట్‌ డాట్‌ నెట్‌, కప్పా ఇంటర్నెట్‌ సర్వీసెస్‌, నోయిడా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌, వరల్డ్‌ గేట్‌ నెట్‌వర్క్‌ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.

* కొత్త ఐటీ ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌పై 25.82 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని, 7.90 లక్షల ఇ-పాన్‌లను కేటాయించినట్లు తాజా అధికార గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఏడాది జూన్‌ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను తీసుకురాగా.. పలు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి.

* ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల ప్రైవేటీకరణను సులభతరం చేయడానికి ‘జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) యాక్ట్‌ (జీఐబీఎన్‌ఏ)’కు చేసిన సవరణలను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌ ఆమోదం కోసం వస్తుందని వెల్లడించాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని