విద్యుత్‌ వాహనాలకు బజాజ్‌ అనుబంధ సంస్థ - Bajaj subsidiary for electric vehicles posted a net profit of Rs 1170 crore in June
close

Published : 23/07/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యుత్‌ వాహనాలకు బజాజ్‌ అనుబంధ సంస్థ

జూన్‌లో రూ.1,170 కోట్ల లాభం

దిల్లీ: విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాల తయారీ కోసం పూర్తి స్థాయి అనుబంధ సంస్థను బజాజ్‌ ఆటో ఏర్పాటు చేయనుంది. ఇందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ద్వి చక్ర, త్రిచక్ర, తేలికపాటి నాలుగు చక్రాల వాహనాల విభాగాల్లో విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాలు తయారు చేసేందుకు,  మరిన్ని వృద్ధి అవకాశాలు అన్వేషించేందుకు ఈ అనుబంధ సంస్థ ఉపయోగపడుతుందని బజాజ్‌ ఆటో తెలిపింది.

* ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి బజాజ్‌ ఆటో ఏకీకృత ప్రాతిపదికన రూ.1,170 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.395.51 కోట్లుగా నమోదైంది. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాలు దేశీయంగా గిరాకీపై ప్రభావం చూపినప్పటికీ.. వాహనాల ఎగుమతులు పెరగడం లాభంలో వృద్ధికి దోహదం చేసింది. 2020 ఏప్రిల్‌- జూన్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా అమ్మకాలపై తీవ్రంగా ప్రభావం పడినందున.. ఆ సమయంతో ప్రస్తుత గణాంకాలను పోల్చకూడదని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.3,079 కోట్ల నుంచి రూ.7,386 కోట్లకు పెరిగింది. ‘2021-22 తొలి త్రైమాసికం సవాళ్లతోనే గడిచింది. అంతకుముందు మూడు త్రైమాసికాల్లో కార్యకలాపాలు పుంజుకున్నప్పటికీ.. కొవిడ్‌-19 రెండో దశతో ఏప్రిల్‌-జూన్‌లో మళ్లీ నెమ్మదించాయి. అయితే అంతర్జాతీయమ విపణులకు ఎగుమతులు గణనీయంగా పెరగడంతో, దేశీయ ప్రభావం కొంత మేర తగ్గింద’ని బజాజ్‌ ఆటో వెల్లడించింది. ఏప్రిల్‌- జూన్‌లో దేశీయంగా 3,57,137 వాహనాలను కంపెనీ విక్రయించింది. 2020-21 ఏప్రిల్‌- జూన్‌ అమ్మకాలు 1,91,263 వాహనాలుగా నమోదయ్యాయి. ఏడాదిక్రితం 2,51,840 వాహనాలు ఎగుమతి చేయగా.. ఈసారి 6,48,877 వాహనాలను ఎగుమతి చేసింది. 2021 జూన్‌ 30 నాటికి నగదు, నగదు సమాన నిల్వలు రూ.19,097 కోట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.  


హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,100 కోట్లు

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.2,100 కోట్ల ఏకీకృత లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.1,897 కోట్లతో పోలిస్తే ఇది 10.7 శాతం అధికం. నికర విక్రయాలు రూ.10,570 కోట్ల నుంచి 13.49 శాతం పెరిగి రూ.11,996 కోట్లకు చేరాయి. మొత్తం వ్యయాలు రూ.8,324 కోట్ల నుంచి 14.68 శాతం పెరిగి రూ.9,546 కోట్లకు చేరాయి. ‘మా వ్యాపార మూలాలు చాలా బలంగా ఉన్నాయి. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి సవాళ్లున్నా దేశీయంగా వినియోగదారులు 12 శాతం వృద్ధి చెందడంతో సమీక్షా త్రైమాసికంలో బలమైన పని తీరు కనబరిచాం. పరిమాణ వృద్ధి 9 శాతం, లాభంలో 10 శాతం వృద్ధి నమోదైంద’ని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా వెల్లడించారు.

విభాగాల వారీగా ఆదాయం

గృహ సంరక్షణ, సౌందర్య-వ్యక్తిగత సంరక్షణ, ఆహార-ఉపాహార విభాగాలు రెండంకెల వృద్ధి సాధించాయని కంపెనీ వెల్లడించింది. గృహ సంరక్షణ విభాగ ఆదాయం రూ.3,392 కోట్ల నుంచి 11.94 శాతం పెరిగి రూ.3,797 కోట్లకు చేరింది. సౌందర్య-వ్యక్తిగత సంరక్షణ విభాగాదాయం రూ.4,043 కోట్ల నుంచి 13.41 శాతం పెరిగి రూ.4,585 కోట్లకు ఎగబాకింది. కేశ, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు గిరాకీ బాగా పెరగడంతోనే ఇది సాధ్యమైంది. ఆహార-ఉపాహార విభాగాదాయం కూడా రూ.2,958 కోట్ల నుంచి 12.2 శాతం పెరిగి రూ.3,319 కోట్లకు చేరింది. టీ బ్రాండ్లకు గిరాకీ వల్ల ఈ విభాగాదాయం బాగా పెరిగింది. ఇతర విభాగాల ఆదాయం కూడా రూ.338 కోట్ల నుంచి 45.86 శాతం పెరిగి రూ.493 కోట్లకు చేరింది. భవిష్యత్తులోనూ అధిక పరిమాణంలో విక్రయాలు, లాభదాయక కాపాడుకోవడంపైనే దృష్టి సారిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
* 2022 మార్చి 31న లీగల్‌, కార్పొరేట్‌ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, కంపెనీ సెక్రెటరీ దేవ్‌ బాజ్‌పాయ్‌ పదవీ విరమణ చేయనున్నారని కంపెనీ వెల్లడించింది.
* బీఎస్‌ఈలో షేరు 2.28 శాతం తగ్గి రూ.2,378.50 వద్ద ముగిసింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని