బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8.34 లక్షల కోట్లకు తగ్గాయ్‌ - Banks NPAs fell to Rs 8.34 lakh crore
close

Published : 27/07/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8.34 లక్షల కోట్లకు తగ్గాయ్‌

కేంద్ర మంత్రి భగవత్‌ కరాడ్‌

దిల్లీ: ఈ ఏడాది మార్చికి బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) లేదా మొండిబకాయిలు రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయని, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఇందుకు దోహదపడినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్‌ కరాడ్‌ పేర్కొన్నారు. 2020 మార్చికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఒత్తిడిలో ఉన్న రుణాలను పారదర్శకంగా గుర్తించడం వల్ల 2015 మార్చికి రూ.3,23,464 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2018 మార్చికి రూ.10,36,187 కోట్లకు చేరాయని మంత్రి వివరించారు. తదుపరి ప్రభుత్వం చేపట్టిన గుర్తింపు, పరిష్కారం, మూలధనసాయం, సంస్కరణల వ్యూహం ఫలితంగా ఎన్‌పీఏలు 2019 మార్చికి రూ.9.33 లక్షల కోట్లకు, 2020 మార్చికి రూ.8.96 లక్షల కోట్లకు, 2021 మార్చికి రూ.8.34 లక్షల కోట్లు (తాత్కాలిక గణాంకాలు)కు చేరాయని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కరాడ్‌ వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 2018 మార్చిలో అత్యధికంగా రూ.8.95 లక్షల కోట్లకు చేరాయని అన్నారు. అనంతరం 2019 మార్చికి రూ.7.39 లక్షల కోట్లు, 2020 మార్చికి రూ.6.78 లక్షల కోట్లకు, 2021 మార్చికి రూ.6.16 లక్షల కోట్లకు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు.
* నికర ఎన్‌పీఏలు 2014 మార్చికి రూ.1.24 లక్షల కోట్లుగా ఉండగా.. 2015 మార్చికి రూ.2.14 లక్షల కోట్లకు, 2016 మార్చికి రూ.3.24 లక్షల కోట్లకు, 2017 మార్చికి రూ.3.82 లక్షల కోట్లకు, 2018 మార్చికి రూ.4.54 లక్షల కోట్లకు పెరుగుతూ వచ్చాయి. తదుపరి 2019లో రూ.2.84 లక్షల కోట్లకు, 2020లో రూ.2.31 లక్షల కోట్లకు, 2021 మార్చికి రూ.1.97 లక్షల కోట్లకు తగ్గాయి.
* 2015-16లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభం రూ.1,37,151 కోట్లుగా నమోదైంది. 2016-17లో రూ.1,58,994 కోట్లు, 2017-18లో రూ.1,55,603 కోట్లు, 2018-19లో రూ.1,49,819 కోట్లు, 2019-20లో రూ.1,74,640 కోట్లుగా లాభం ఉంది. కేటాయింపులు సైతం వరుసగా రూ.1.55 లక్షల కోట్లు, రూ.1.70 లక్షల కోట్లు, రూ.2.40 లక్షల కోట్లు, రూ.2.17 లక్షల కోట్లు, రూ.2 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
* 2020-21లో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల మొత్తం రుణాల వృద్ధి రూ.113.99 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ మొత్తం రూ.109.19 లక్షల కోట్లుగా ఉంది.


టాటా మోటార్స్‌ నష్టం రూ.4,450 కోట్లు

దిల్లీ: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో టాటా మోటార్స్‌ నికర నష్టం ఏకీకృత ప్రాతిపదికన సగానికి పైగా తగ్గి రూ.4,450.12 కోట్లకు పరిమితమైంది. 2020-21 ఇదే కాలంలో నికర నష్టం రూ.8,443.98 కోట్లు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.31,983.06 కోట్ల నుంచి పెరిగి రూ.66,406.05 కోట్లకు చేరింది. టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటన్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఆదాయం సమీక్షా త్రైమాసికంలో 5 బిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. ఏడాదిక్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 73.7 శాతం పెరిగినా, నష్టం 100 మిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. ఏప్రిల్‌- జూన్‌లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 68.1 శాతం పెరిగి 1,24,537 వాహనాలకు చేరాయి. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం నుంచి కోలుకుంటున్నప్పటికీ, సెమీకండకర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది.

స్టాండలోన్‌ పద్ధతిలో: జూన్‌ త్రైమాసికానికి టాటా మోటార్స్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.1,320.74 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కిందటేడాది ఇదే సమయంలో నికర నష్టం రూ.2,190.64 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,686.87 కోట్ల నుంచి పెరిగి రూ.11,904.19 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో ఎగుమతులు సహా మొత్తం అమ్మకాలు 351.40 శాతం పెరిగి 1,14,170 వాహనాలుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో చూస్తే ఈసారి అమ్మకాలు తగ్గాయని, కొవిడ్‌-19 రెండోదశ నియంత్రణకు చేపట్టిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇందుకు కారణమయ్యాయని వివరించింది. లాక్‌డౌన్‌ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టిన ప్రత్యేక వ్యాపార ప్రణాళిక విజయవంతమైందని, కార్యకలాపాలు మొదలయ్యాయక వృద్ధిని నమోదుచేసేందుకు  ఉపయోగపడిందని టాటా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీశ్‌ వాఘ్‌ అన్నారు.  


94% పెరిగిన యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.2,160.15 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన లాభం రూ.1,112.17 కోట్లతో పోలిస్తే ఇది 94 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.19,032.15 కోట్ల నుంచి రూ.19,591.63 కోట్లకు చేరింది. అయితే మార్చి త్రైమాసిక ఆదాయం రూ.20,162.76 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఏడాది వ్యవధిలో బ్యాంక్‌ వడ్డీ ఆదాయం రూ.16,445.47 కోట్ల నుంచి రూ.16,003.46 కోట్లకు పరిమితమైంది. పెట్టుబడులపై ఆదాయం రూ.2,973 కోట్ల నుంచి రూ.3,428.20 కోట్లకు చేరింది. రుణ పుస్తకం రిటైల్‌, కార్పొరేట్‌, ఎస్‌ఎంఈ విభాగాలన్నింటిలోనూ వృద్ధి సాధించి 12 శాతం పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 4.72 శాతం నుంచి 3.85 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.23 శాతం నుంచి 1.20 శాతానికి పరిమితమయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.4,416.42 కోట్ల నుంచి 3,532.01 కోట్లకు తగ్గాయి.


కోటక్‌ బ్యాంక్‌ లాభంలో 32% వృద్ధి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మొదటి త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.1,641.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ.1,244.45 కోట్ల లాభంతో పోలిస్తే ఇది దాదాపు 32 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.7,685.40 కోట్ల నుంచి రూ.8,062.81 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం మాత్రం రూ.6,911.86 కోట్ల నుంచి రూ.6,479.78 కోట్లకు పరిమితమైంది.  స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.70 శాతం నుంచి 3.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 0.87 శాతం నుంచి 1.28 శాతానికి చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.962.01 కోట్ల నుంచి రూ.934.77 కోట్లకు తగ్గాయి.


ఎల్‌ అండ్‌ టీ లాభం రెండింతలు

దిల్లీ: జూన్‌ త్రైమాసికంలో మౌలిక రంగ దిగ్గజం ఎల్‌ అండ్‌ టీ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,531.66 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.543.93 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా అధికం కావడం విశేషం. మొత్తం ఆదాయం రూ.22,037.37 కోట్ల నుంచి రూ.29,982.70 కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం వ్యయాలు సైతం రూ.21,367.63 కోట్ల నుంచి రూ.27,708.08 కోట్లకు చేరాయి. కంపెనీ ఏకీకృత ఆదాయాలు 38 శాతం వృద్ధితో రూ.29,335 కోట్లుగా నమోదయ్యాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో కార్యకలాపాలపై కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం పడినప్పటికీ.. ప్రాజెక్టులను మెరుగ్గా పూర్తిచేయడం కలిసొచ్చిందని తెలిపింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో అంతర్జాతీయ ఆదాయాలు రూ.11,186 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయంలో ఇది 38 శాతానికి సమానం. మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ.26,557 కోట్ల ఆర్డర్లు దక్కించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 13 శాతం వృద్ధి సాధించింది. మొత్తం ఆర్డర్లలో అంతర్జాతీయ ఆర్డర్లు రూ.9,045 కోట్లు (34 శాతం)గా ఉన్నాయి. జూన్‌కు గ్రూప్‌ ఏకీకృత ఆర్డరు పుస్తకం విలువ రూ.3,23,721 కోట్లుగా నమోదైంది.


డీఎల్‌ఎఫ్‌ లాభం రూ.337 కోట్లు
ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌

దిల్లీ: స్థిరాస్తి దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.337.17 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ రూ.71.52 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.646.98 కోట్ల నుంచి రూ.1,242.27 కోట్లకు చేరింది. ‘కొవిడ్‌ నేపథ్యంలో గృహ నిర్మాణ వ్యాపారానికి గిరాకీ బాగా పెరిగింది. ఎక్కువ కుటుంబాలకు సొంత గృహాలే సురక్షిత ప్రదేశాలుగా, పెట్టుబడికి అనువైనవిగా కనిపిస్తున్నాయ’ని డీఎల్‌ఎఫ్‌ పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌లో సేల్స్‌ బుకింగ్‌లు రూ.1,014 కోట్లకు చేరాయని తెలిపింది. కఠిన వ్యయ నియంత్రణ చర్యలతో సమీక్షా త్రైమాసికంలో రూ.141 కోట్లు మిగులు కనిపించినా, జూన్‌ ఆఖరుకు కంపెనీ నికర రుణం రూ.4,745 కోట్లుగా ఉందని పేర్కొంది. డీఎల్‌ఎఫ్‌ సంయుక్త సంస్థ సైబర్‌ సిటీ డెవలపర్స్‌ (డీసీసీడీఎల్‌) కార్యాలయ అద్దెల విభాగ ఆదాయం 12 శాతం పెరిగినా, రిటైల్‌ వ్యాపారంపై మరోసారి ప్రభావం పడిందని తెలిపింది. డీసీసీడీఎల్‌ ఏకీకృత ఆదాయం రూ.929 కోట్ల నుంచి రూ.1,041 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.160 కోట్ల నుంచి రూ.202 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కార్యాలయ స్థలాలకు గిరాకీ పుంజుకుంటుందని, దీర్ఘకాలంలో ఈ వ్యాపారానికి బలమైన మూలాలున్నాయని నమ్ముతున్నామని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 (100 శాతం) చొప్పున డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.


అక్టోబరు కల్లా పేటీఎం మెగా ఐపీఓ!

దిల్లీ: పేటీఎం తన మెగా పబ్లిక్‌ ఇష్యూను అక్టోబరు కల్లా నిర్వహించే ఉద్దేశంలో ఉంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.16,600 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూకు అనుమతుల కోసం సంబంధిత పత్రాలను జులై 15న సెబీకి పేటీఎం సమర్పించింది. దీనిపై సెప్టెంబరు మధ్య కల్లా సెబీ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. సెబీ నుంచి అనుమతుల రాగానే సాధ్యమైనంత త్వరగా పబ్లిక్‌ ఇష్యూ ప్రక్రియ పూర్తి చేయాలన్నది పేటీఎం ఆకాంక్షగా చెబుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని