డబ్బులు తిరిగి రావడానికి ఆలస్యమవుతోంది - Becoming late to get money back
close

Published : 25/04/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్బులు తిరిగి రావడానికి ఆలస్యమవుతోంది

కరోనా మహమ్మారే కారణం: ఈవై 

ముంబయి: కరోనా కారణంగా కంపెనీల మూలధన నిర్వహణపై ప్రభావం పడుతోంది. అగ్రగామి-500 నమోదిత కంపెనీల నగదు చక్రం ఆరు రోజుల పాటు పెరిగిందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంటోంది. ‘ఒక కంపెనీ ముడి పదార్థాలు, ఇతర వనరులపై పెట్టిన పెట్టుబడులు.. విక్రయాల అనంతరం నగదు రూపంలో తిరిగి కంపెనీకి వచ్చే కాలాన్ని’ నగదు చక్రం (క్యాష్‌-టు-క్యాష్‌ )గా పరిగణిస్తారు. ఈవై నిర్వహించిన సర్వే ప్రకారం.. 

సెప్టెంబరు 30, 2020తో ముగిసిన 12 నెలల్లో భారత్‌లోని కంపెనీలకు నగదు చక్రం వ్యవధి 6 రోజుల పాటు పెరిగింది. 
భారత్‌లోని సంస్థలకు మూలధనంలో చిక్కుకుపోయిన రూ.5.2 లక్షల కోట్ల వరకు నిధులను బయటకు తీయడానికి అవకాశం కలిగింది. సంక్షోభం నుంచి వేగంగా బయటకు రావడానికి ఇది ఉపయోగపడుతుంది.
మూలధనంపై కరోనా ప్రభావం పడకుండా 69 శాతం కంపెనీలు తమ చెల్లింపులను పొడిగించాయి. లాక్‌డౌన్‌ల కారణంగా నిల్వలు పెరిగి.. వసూళ్లు తగ్గడం ఇందుకు నేపథ్యం. నగదును కాపాడుకోడానికి, నిర్వహణపై ప్రభావం పడకుండా కంపెనీలు చెల్లింపుల పొడిగింపు అనే వ్యూహాన్ని ఎంచుకున్నాయి. 
పెద్ద, మధ్య స్థాయి కంపెనీలు తమ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలను నిర్వహించుకోవడంలో ఎక్కువ సమర్థత చూపాయి. బేరాలాడే సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో పాటు సమర్థ వ్యాపార ప్రక్రియల కారణంగా చిన్న కంపెనీలతో పోలిస్తే పెద్ద కంపెనీలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ చక్రం (మొత్తం మూలధనం తిరిగి నగదుగా మారి కంపెనీకి చేరే సమయం) 29 రోజులు తక్కువగా ఉంటోంది. 
లోహ, గనులు, చమురు, గ్యాస్, ఫార్మా వంటి 12 రంగాల్లో తొమ్మిది రంగాల నిల్వల రోజులు పెరిగాయి. 
విద్యుత్‌ రంగానికి నగదు చక్రం 34 రోజుల పాటు, చమురు గ్యాస్‌ రంగానికి 10 రోజుల పాటు; ఇంజినీరింగ్, ఈపీసీకి 17 రోజుల చొప్పున తగ్గింది. వాహన(13 రోజులు), రసాయనాలు(12 రోజులు), సిమెంటు, నిర్మాణ ఉత్పత్తులు(7 రోజులు) వంటి ఇతర రంగాలూ తమ నగదు చక్రాన్ని తగ్గించుకోగలిగాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని