కరోనా భయాల్లోనూ రంకేసిన బుల్‌! - Benchmark indices rallied even in concerns of coronavirus
close

Updated : 30/03/2021 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా భయాల్లోనూ రంకేసిన బుల్‌!

భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఆద్యంతం లాభాల్లో కొనసాగాయి. ప్రారంభం నుంచీ బుల్‌ రంకె కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలకు దేశీయంగా కీలక రంగాల షేర్లు రాణించడం కలిసొచ్చింది. మొత్తంగా నేడు మార్కెట్లు రెండు శాతానికి పైగా ఎగిశాయి. సెన్సెక్స్‌ కీలక 50 వేల మైలురాయిని, నిఫ్టీ 14,800 మార్క్‌ను చేరుకున్నాయి.  

సెన్సెక్స్‌ ఉదయం 49,331 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. 50,268 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1128 పాయింట్ల లాభంతో 50,136 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇదే ట్రెండ్‌ను కొనసాగించింది. ఉదయం 14,628 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ 14,876 వద్ద గరిష్ఠానికి చేరింది. ఆఖరికి 322 పాయింట్లు ఎగబాకి 14,829 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.36 వద్ద నిలిచింది. 

బీఎస్‌ఈ 30 సూచీలో మూడు తప్ప మిగతా కంపెనీలన్నీ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఇన్ఫీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్, ఎన్‌టీపీసీ షేర్లు మూడు శాతానికి పైగా ఎగిశాయి. ఇక నిఫ్టీలో ఒక్క స్థిరాస్తి మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. 

కారణాలివే...

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తుండడం, ఐరోపా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా వెళుతుండడంతో ఈవారం మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు. కానీ, వాటన్నింటికీ భిన్నంగా నేడు మార్కెట్లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడుల(ఎఫ్‌ఐఐ) ఉపసంహరణ భారీగా పడిపోవడం, దేశీయ సంస్థాగత మదుపర్ల(డీఐఐ) పెట్టుబడులు పెరగడం మార్కెట్లను ముందుకు నడిపించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే నాలుగో త్రైమాసిక ఫలితాలపైనా మదుపర్లు సానుకూల దృక్పథంతో ఉన్న సూచనలు కనిపించాయి. క్రితంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడమే అందుకు కారణం. అలాగే వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా కొనసాగుతుండడం.. టీకాల కోసం దేశాల మధ్య ఆశించిన మేర సహకారం ఉండడం కూడా మదుపర్ల సెంటిమెంటును పెంచాయి. మరోవైపు వచ్చే ఏడాదీ ఐపీఓల జోరు కొనసాగుతుందన్న అంచనాలు, ఈ ఏడాది రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగిందన్న గణాంకాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. వీటికి తోడు అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ల సానుకూల పవనాలు సూచీలను మరింత పైకి తీసుకెళ్లాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని