సెబీ నిర్ణయంతో ఏఐఎఫ్‌లకు ప్రయోజనం - Benefit to AIFs with SEBI decision
close

Updated : 01/07/2021 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెబీ నిర్ణయంతో ఏఐఎఫ్‌లకు ప్రయోజనం

విశ్లేషకుల అంచనా

దిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల ‘అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్స్‌’ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులను (ఏఐఎఫ్‌) ఎక్కువగా ఆకర్షించేందుకు తోడ్పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారికి పెట్టుబడులకు సంబంధించిన సలహాలూ అధికంగా అందుతాయి. అందుకే ఏఐఎఫ్‌లు వీరిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటాయి. భారతీయ సెక్యూరిటీల మార్కెట్లలో అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్ల కోసం నిబంధనావళిని పరిచయం చేస్తూ సెబీ బోర్డు మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరిలో చర్చా పత్రం విడుదల చేసిన సెబీ తాజాగా ఆ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, కుటుంబ ట్రస్టులు, ఏక యజమాన్యాలు, భాగస్వామ్య సంసలు, ట్రస్టులు, బాడీ కార్పొరేట్‌లు తమ అర్థిక పరిస్థితి ఆధారంగా అక్రిడేషన్‌ పొందే అవకాశం ఉంది. డిపాజిటరీల అర్హత కలిగిన అనుబంధ సంస్థలు, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు అలాంటి ఇన్వెస్టర్లకు అక్రెడిటేషన్‌ సర్టిఫికెట్‌ను జారీ చేస్తాయి. ప్రత్యామ్నాయ పెట్టుబడి వర్గాలకు సెబీ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని క్రిస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్‌, సీఓఓ, ఐవీసీఏ రెగ్యులేటరీ వ్యవహారాల కమిటీ కో-హెడ్‌ అష్లే మెనెంజెస్‌ వెల్లడించారు.

నిబంధనలు పాటించేందుకు సమయం: కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో తాము సూచించిన కొన్ని నియంత్రణ నిబంధనలు పాటించడానికి సెబీ స్టాక్‌ బ్రోకర్లు, క్లియరింగ్‌ మెంబర్లు, కేవైసీ రిజిస్ట్రేషన్‌ ఏజెన్సీలకు గడువును పెంచింది. క్లయింట్లు ఆర్డర్ల కోసం చేసే కాల్‌ రికార్డింగ్‌ల డేటాను దాచిపెట్టేందుకు జులై 31 వరకు గడువు ఇచ్చింది. అధీకృత ప్రత్యామ్నాయ ప్రదేశాల నుంచి బ్రోకర్లు ట్రేడింగ్‌ టెర్మినల్స్‌ నిర్వహించేందుకు కూడా ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. క్లయింట్‌ ఫండింగ్‌ నివేదిక సమర్పించడానికి, క్లయింట్లకు వార్షిక గ్లోబల్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి కూడా నెల రోజుల గడువు పొడిగించింది. గతంలో వీటికి జూన్‌ 30 చివరి తేదీగా ఉంది.

సెప్టెంబరు త్రైమాసికంలో విద్యుత్‌ చేతక్‌ డెలివరీలు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) జులై- సెప్టెంబరు త్రైమాసికంలో విద్యుత్‌ స్కూటర్‌ ‘చేతక్‌’ డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉందని బజాజ్‌ ఆటో వార్షిక నివేదికలో పేర్కొంది. కొవిడ్‌ కారణంగా తలెత్తిన సరఫరా సమస్యలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్‌ చేతక్‌ బుకింగ్‌లను కంపెనీ నిలిపివేసిన విషయం తెలిసిందే. కంపెనీ ప్రముఖ స్కూటర్‌ బ్రాండ్‌ చేతక్‌ను విద్యుత్‌ అవతారంలో తీసుకొస్తోంది. ఇప్పటికే రెండు వేరియంట్లు చేతక్‌ ప్రీమియం, చేతక్‌ అర్బేన్‌లకు బుకింగ్‌లను తీసుకుంది. పుణెలోని బజాజ్‌ ఆటో చకన్‌ ప్లాంట్‌లో ఈ చేతక్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

తమిళనాడు ప్లాంట్‌ నుంచి హ్యుందాయ్‌ కోటి కార్లు

చెన్నై: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌ తయారీ ప్లాంట్‌ నుంచి కోటి కారును హ్యుందాయ్‌ మోటార్‌ విడుదల చేసింది. కంపెనీ ప్రీమియం ఎస్‌యూవీ మోడల్‌ ఆల్కజార్‌ను కంపెనీ ఉత్పత్తి చేసింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హాజరయ్యారు. ఈ చరిత్రాత్మక మైలురాయితో భారత్‌లో తయారీ కార్యక్రమానికి కంపెనీ కట్టుబడి ఉందని స్పష్టమైందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. 1998లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంస్థ.. 4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇప్పటి వరకు 2.50 లక్షల ఉద్యోగాలను సృష్టించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని