దిల్లీ, ముంబై కన్నా హైదరాబాద్‌, బెంగళూరులే టాప్‌ - Bengaluru Hyderabad Chennai dominate office market
close

Published : 13/09/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ, ముంబై కన్నా హైదరాబాద్‌, బెంగళూరులే టాప్‌

న్యూదిల్లీ: కరోనా కారుమేఘాలు తొలుగుతూ, ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో మళ్లీ ఆఫీసు కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దాంతో గతేడాదితో పోలిస్తే 2020-21 సంవత్సరంలో ఆఫీసు స్పేస్‌కి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది అంటోంది ‘అనరాక్‌’ నివేదిక. ఈ డిమాండ్‌ని అందిపుచ్చుకొని కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయడంలో దేశంలోని ఉత్తర, పశ్చిమ నగరాలకన్నా దక్షిణ భారత దేశ నగరాలదే పైచేయిగా ఉందని ఈ నివేదిక తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డిమాండ్‌లో గతేడాది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లే 66శాతం కార్యాలయాల స్థలాలను లీజుకి ఇచ్చాయి. 2018-2019లో ఈ నగరాల వాటా 47శాతం మాత్రమే. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ చెబుతున్న వివరాల ప్రకారం ఆఫీస్‌ స్పేస్‌ విషయంలో ఉత్తర, పశ్చిమ భారత దేశ నగరాలతో పోలిస్తే దక్షిణ భారత నగరాలు అనూహ్యమైన అభివృద్ధి కనబరుస్తున్నాయి.

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగాలు ముందు నుంచీ వీటికి ఊతంగా నిలవగా.. అద్దెలు అందుబాటులో ఉండటం, కొన్నాళ్లుగా అంకుర సంస్థలకు అనువైన పరిస్థితులు నెలకొనడంతో కొత్త కార్యాలయాలు ఇటువైపు మొగ్గు చూపుతున్నాయంటున్నారు అనరాక్‌ ఛైర్మన్‌ అనూజ్‌ పురి. వీటితోపాటు ఈ మధ్యకాలంలో ఉత్పత్తి, పారిశ్రామిక రంగాలు సైతం ఇటువైపు చూస్తున్నాయి అంటూ సర్వేలోని కీలక అంశాలు వెల్లడించారాయన. మూడేళ్లలో ఈ నగరాల్లో అద్దెలు సైతం గణనీయంగా పెరిగాయి. 2018-21 మధ్యకాలంలో కార్యాలయ అద్దెల్లో రెండంకెల వృద్ధిరేటు కనిపించదని నివేదిక పేర్కొంది. బెంగళూరులో 15శాతం, హైదరాబాద్‌లో 12శాతం, చెన్నైలో 11శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), పుణెలు సంయుక్తంగా 4.56 మిలియన్‌ చదరపు అడుగుల వైశాల్యంలో, దేశ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) 2.53 చదరపు అడుగుల వైశాల్యంలో కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.

వరుసగా ఆ నగరాలు 21శాతం, 11 శాతం చొప్పున లీజుకిచ్చాయి. ముంబయి, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతంలో అద్దెల పెరుగదలలో ఎలాంటి మార్పులేదు. పుణెలో 8శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది సాధారణ ఇళ్ల కొనుగోళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన దిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లో 30 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొన్నారు. 2020-2021లో మొత్తం 1.8లక్షల గృహాలు అమ్ముడయ్యాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని