రోదసియాత్ర అనంతరం బెజోస్‌ కీలక ప్రకటన! - Bezos announces A Big award after his successful
close

Updated : 21/07/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోదసియాత్ర అనంతరం బెజోస్‌ కీలక ప్రకటన!

‘కరేజ్ అండ్‌ సివిలిటీ’ అవార్డు స్థాపన

వాషింగ్టన్‌: దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌.. మరో కీలక ప్రకటన చేశారు. తమ సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్‌’ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సందర్భంగా.. ‘కరేజ్‌ అండ్‌ సివిలిటీ’ అనే అవార్డుని ప్రకటించారు. తొలి అవార్డును ప్రముఖ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌, సామాజిక కార్యకర్త వ్యాన్‌ జోన్స్‌ అనే ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో 100 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 746.02 కోట్లు) ఇవ్వనున్నారు. సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు బెజోస్ తెలిపారు. ఈ అవార్డు ద్వారా వస్తున్న సొమ్మును వారు కావాలంటే ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వొచ్చని బెజోస్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు.


ఎవరీ జోస్‌ ఆండ్రెస్‌?

జోస్‌ ఆండ్రెస్‌ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ చెఫ్‌. 2010లో ఈయన ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌-డబ్ల్యూసీకే’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రాంతాల్లో భోజనం అందజేస్తున్నారు. కరోనా సంక్షోభంలో అనేక మందికి అండగా నిలిచారు. భారత్‌లో సంజీవ్‌ కపూర్‌ అనే ప్రముఖ చెఫ్‌తో కలిసి 15 ప్రముఖ నగరాల్లో 30 ప్రాంతాల నుంచి ప్రజలకు భోజనం అందజేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆసుపత్రుల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్యారోగ్య సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. రెండు వారాల క్రితం భారత్‌కు వచ్చిన ఆండ్రెస్‌ ఇప్పటివరకు మన దేశంలో 4 లక్షల మీల్స్‌ అందజేసినట్లు వెల్లడించారు.


వ్యాన్‌ జోన్స్‌

ఈయన ప్రముఖ టీవీ హోస్ట్‌. రచయిత. న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ రచయితగా మూడుసార్లు ఎంపికయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. అందుకోసం వినూత్న పరిష్కారాలు సూచించే ‘డ్రీమ్ కార్ప్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. క్రిమినల్‌ జస్టిస్‌ రిఫార్మర్‌గా పేరొందిన ఈయన మరికొన్ని సంస్థలను కూడా నెలకొల్పి సామాజిక రుగ్మతలను రూపుమాపడం కోసం కృషి చేస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని