Latest Telugu News, Headlines, Breaking News, Articles
close

Published : 15/06/2021 05:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covaxin: త్వరలో కెనడాలో కొవాగ్జిన్‌

దిల్లీ: దేశంలో విరివిగా వినియోగిస్తున్న కొవాగ్జిన్‌ టీకాను విదేశాల్లోనూ మార్కెటింగ్‌కు మరో ముందడుగు పడింది. కొవాగ్జిన్‌ టీకాను అమెరికాతో కలిసి అభివృద్ధి చేయడంతోపాటు సరఫరా, విక్రయాల కోసం దాని తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌కు ఆక్యుజన్‌ సంస్థ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా కొవాగ్జిన్‌  కెనడా హక్కుల కోసం భారత్‌ బయోటెక్‌కు 15 మిలియన్‌ డాలర్లు ముందస్తుగా చెల్లించినట్లు ఆక్యుజన్‌ ప్రకటించింది.  కెనడాలో కొవాగ్జిన్‌ టీకా వాణిజ్య విక్రయాలు ప్రారంభమైన నెల రోజుల్లోపు మరో 10 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు  అంగీకరించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 

అమెరికాలో కొవాగ్జిన్‌ టీకాల వాణిజ్య విక్రయానికి ఆక్యుజన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కెనడాకు విస్తరిస్తున్నట్లు జూన్‌ 3న భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కొవాగ్జిన్‌ టీకాను అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి కోరే ప్రక్రియలో ఉన్న తాము.. అదే సమయంలో కెనడాలోనూ అలాంటి అనుమతి కోసం దరఖాస్తు చేస్తామని ఆక్యుజన్‌ సహ వ్యవస్థాపకుడు శంకర్‌ ముసునూరి పేర్కొన్నారు. లాభాలు పంచుకోవడంపై అమెరికాకు సంబంధించి కుదిరిన ఒప్పందం తరహాలోనే కెనడాలో జరిగే కొవాగ్జిన్‌ టీకా విక్రయ లాభాల్లోనూ ఆక్యుజన్‌ 45 శాతం అట్టిపెట్టుకుందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

భారత్‌లో జరిపిన ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ సురక్షితమని తేలడంతో పాటు సమర్థత కలిగినట్లు వెల్లడైందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. అమెరికాతో పాటు కెనడా మార్కెట్‌లోకి కొవాగ్జిన్‌ తీసుకువచ్చేందుకు ఆక్యుజెన్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కొత్తగా వెలుగుచూస్తున్న కరోనా రకాలను ఎదుర్కొవడంలో కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలడంతో.. రానున్న రోజుల్లో ఈ టీకా ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైందిగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని