డాక్టర్‌ కృష్ణ ఎల్లకు ఫోర్బ్స్‌ అరుదైన గౌరవం - Bharat Biotechs Krishna Ella In forbes cover page
close

Updated : 23/04/2021 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ కృష్ణ ఎల్లకు ఫోర్బ్స్‌ అరుదైన గౌరవం

‘లీడర్స్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌’ జాబితాలో స్థానం
ఆయనపై కవర్‌ పేజీ కథనం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 మహమ్మారి ముప్పును ఎదుర్కోవడంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైద్య, ఆర్యోగ రంగాలకు చెందిన నిపుణులతో ఫోర్బ్స్‌ ఇండియా ప్రత్యేకంగా రూపొందించిన ‘లీడర్స్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌’ జాబితాలో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల స్థానం సంపాదించారు. ఆయనపై కవర్‌ పేజీ కథనాన్ని ఫోర్బ్స్‌ ఇండియా తాజాగా ప్రచురించింది. డాక్టర్‌ కృష్ణ ఎల్ల అమెరికా నుంచి వెనక్కి వచ్చి, టీకాల తయారీ కంపెనీని స్థాపించారు. గత 20 ఏళ్లలో 400 కోట్ల డోసులకు పైగా వివిధ రకాల టీకాలను ప్రపంచ దేశాలకు అందించారని ఫోర్బ్స్‌ కొనియాడింది. ‘145 అంతర్జాతీయ పేటెంట్లు, 16 టీకాలు, 4 బయో-థెరప్యూటిక్స్‌, 123 దేశాల్లో రిజిస్ట్రేషన్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్‌ఓ) ప్రీ-క్వాలిఫికేషన్లు’.. ఇదీ భారత్‌ బయోటెక్‌ ఘనతగా పేర్కొంది. ఇన్‌ఫ్లుయంజా హెచ్‌1ఎన్‌1, రోటావైరస్‌, జపనీస్‌ ఎన్‌సెఫలైటిస్‌, రేబిస్‌, చికున్‌గున్యా, జికా, టైఫాయిడ్‌ టీకాలను ఈ సంస్థ అందిస్తున్నట్లు వివరించింది. ప్రపంచాన్ని కొవిడ్‌-19 అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ సత్వరం స్పందించి ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ- పుణెతో కలిసి ‘కొవాగ్జిన్‌’ టీకా ఆవిష్కరించినట్లు, తద్వారా టీకాల అభివృద్ధి-తయారీలో తన సత్తా ప్రదర్శించినట్లు అయిందని అభిప్రాయపడింది.  భారత్‌ బయోటెక్‌ నుంచి త్వరలో ముక్కు ద్వారా తీసుకునే (ఇంట్రా-నాసల్‌) కొవిడ్‌-19 టీకా రాబోతోందని ఫోర్బ్స్‌ వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని