Stock market: సూచీల పయనం.. ఆద్యంతం ఒడుదొడుకులమయం! - Broader markets rally up to 3pc ahead of Fed outcome
close

Published : 22/09/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీల పయనం.. ఆద్యంతం ఒడుదొడుకులమయం!

31.86% ఎగబాకిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఆద్యంతం ఊగిసలాటలో పయనించాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు తొలి గంటలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కాసేపు లాభాల్లో పయనించినా.. బుల్‌ ఆధిపత్యం మాత్రం కనబడలేదు. దీంతో సూచీల పయనం రోజంతా ఒడుదొడుకులమయంగా సాగింది. చైనా కంపెనీ ఎవర్‌గ్రాండే సంక్షోభంపై చైనా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపై చూపింది. ఐరోపా మార్కెట్లు సైతం మందకొడిగానే ఉండడంతో సూచీలకు ఎలాంటి దన్ను లభించలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.85 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్‌ ఉదయం 59,166.15 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,178.44 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 77.94 పాయింట్ల నష్టంతో 58,927.33 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.35 పాయింట్లు కోల్పోయి 17,546.65 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో 17,610.45 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది.సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌, టాటా స్టీల్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా, మారుతీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ షేర్లు మెరిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫినాన్స్‌ డీలాపడ్డాయి.

* ప్రముఖ మీడియా సంస్థ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జెడ్‌ఈఈఎల్‌)’, ‘సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా(ఎస్‌పీఎన్‌ఐ)’ మధ్య విలీన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దీంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఒక్కరోజే కంపెనీ షేరు విలువ 31.86 శాతం పెరిగి రూ.337.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు రూ.355.40 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అలాగే ఈరోజు నిఫ్టీ మీడియా సూచీ 13 శాతం ఎగబాకడం విశేషం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని