Auto Industry: ఆటో రంగానికి ₹ 26వేల కోట్లతో ప్రోత్సాహకాలు.. కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌! - Cabinet clears rs 25000 PLI scheme for auto sector
close

Updated : 15/09/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Auto Industry: ఆటో రంగానికి ₹ 26వేల కోట్లతో ప్రోత్సాహకాలు.. కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌!

దిల్లీ: అనేక సమస్యలతో సతమతమవుతున్న దేశీయ వాహన రంగానికి ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఉత్పత్తిని పెంచేందుకు గానూ ఈ రంగానికి రూ.26,058 కోట్లతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం ద్వారా ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలను సృష్టించొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. ఆటో, ఆటో విడిభాగాలు, డ్రోన్‌ పరిశ్రమకు ఈ ప్రోత్సాహక పథకం ప్రకటించింది. ఇందులో రూ.25,938కోట్లు ఆటో రంగానికి కాగా.. రూ.120కోట్లు డ్రోన్‌ పరిశ్రమకు కేటాయించినట్లు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ వెల్లడించారు. 

అయితే ఈ పథకం కేవలం స్వచ్ఛ ఇంధన ఆధారిత వాహన తయారీ సంస్థలకు మాత్రమే. పెట్రోల్‌, డీజిల్‌ ఆధారిత వాహన తయారీ సంస్థలకు ఇది వర్తించదని తెలుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల వ్యవధితో ఈ పథకాన్ని ప్రకటించింది. 10 వాహన తయారీ సంస్థలు, 50 ఆటో విడిభాగాల ఉత్పత్తి సంస్థలు దీని నుంచి లబ్ధి పొందుతాయని కేంద్రం చెబుతోంది. మొత్తం 22 విడిభాగాల తయారీకి ఈ ప్రోత్సాహకాలు అందిస్తోంది.

వాతావరణ మార్పులు, పారిస్‌ ఒప్పందం నేపథ్యంలో భారత్‌ స్వచ్ఛ ఇంధనం వైపు మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు చమురు అవసరాలు పెరిగిపోతుండంతో దిగుమతుల కోసం విదేశాలపై భారీగా ఆధారపడాల్సి వస్తోంది. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండడంతో దేశీయంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది నిత్యావసర ధరలపైనా ప్రభావం చూపుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే విద్యుత్తు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది.

అయితే, ఇప్పటి వరకు దేశీయంగా ఇంకా అనేక వాహన సంస్థలు విద్యుత్‌ వాహనాల తయారీ వైపు మళ్లాల్సి ఉంది. టాటా మోటార్స్ మాత్రమే గణనీయ స్థాయిలో విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్‌, హీరోమోటో కార్ప్‌ ఇప్పుడిప్పుడే ఈవీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని