అమ్మకాల లెక్క.. దాచలేరిక - Cannot hide the Business anymore
close

Updated : 04/04/2021 10:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మకాల లెక్క.. దాచలేరిక

నకిలీ రశీదులు, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట
ఇ-రశీదు విధానంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం
రిటర్న్‌ల దాఖలులో పొరపాట్లకు చెల్లు
ఐటీసీ క్లెయిమ్‌ల సమర్పణ సులువు

జీఎస్‌టీ విధానంలో పన్నుల ఎగవేతలను, మోసాలను నియంత్రించడంలో భాగంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇ-రశీదుల విధానం.. ఇందులో ఒకటి. ఏప్రిల్‌ 1 నుంచి రూ.50 కోట్ల టర్నోవరు మించిన వ్యాపారులందరికీ ఇ-రశీదు విధానాన్ని ప్రభుత్వం వర్తింపచేసింది. త్వరలో చిన్న వ్యాపారులందరిని కూడా ఈ విధానం కిందకు ప్రభుత్వం తీసుకొచ్చే  అవకాశం ఉంది. మరి ఇ-రశీదు విధానం వల్ల ప్రభుత్వానికి, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలేమిటి? వ్యాపారులు ఏమైనా  ఇబ్బందులు ఎదుర్కొనే  అవకాశం ఉంది? పన్నుల ఎగవేతను నియంత్రించాలన్న ప్రభుత్వ ఉద్దేశం సాకారమయ్యే అవకాశం ఉందా..?

ఏదైనా విక్రయ కేంద్రానికి వెళ్లినప్పుడు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం కానీ.. రశీదు కచ్చితంగా అడిగి తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం చాలా మంది పట్టించుకోరు. ఈ ఉదాసీనతను ఆసరా చేసుకొని కొందరు వ్యాపారులు రశీదులు ఇవ్వకుండా లేదా నకిలీ రశీదులు ఇచ్చి అమ్మకాల వివరాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. తద్వారా ఆ మేరకు జరిపిన అమ్మకాలపై పన్నులు ఎగ్గొడుతుంటారు. ఇంకొందరేమో అసలు అమ్మకాలే జరపకుండా.. అమ్మకాలు చేసినట్లుగా నకిలీ బిల్లులను సృష్టించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు క్లెయిమ్‌ చేసుకుంటున్నారు. అయితే ఇకపై ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట పడనుంది. ఇ-రశీదు విధానమే ఇందుకు కారణం. ఈ విధానంలో ఒక వ్యాపారికి మరో వ్యాపారికి మధ్య జరిగిన ప్రతి లావాదేవీ వివరాలు నేరుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పోర్టల్‌లో నమోదవుతాయి. టోకు (హోల్‌సేల్‌) కొనుగోళ్ల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండటంతో.. చిల్లర (రిటైల్‌) అమ్మకాలను దాచిపెట్టడం మోసపూరిత వ్యాపారులకు దుర్లభమే. ఇ-రశీదులు ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్‌ లేదా సరఫరాదారు నుంచి ఎవరెవరు ఏయే వస్తువు కొనుగోలు చేశారో ఆ వివరాలు ప్రభుత్వ అధికారుల వద్ద ఉంటాయి. ఆ వస్తువులను కొనుగోలు చేసిన కొనుగోలుదారు వాటిని అమ్మిన విక్రయాలను దాచిపెడితే, నిల్వల వివరాలను చూపించమని అధికారులు అడిగినప్పుడు వాళ్లు చేసిన మోసం బయటపడటం ఖాయం. అందువల్ల తక్కువ అమ్మకాలు చూపించి పన్నులు ఎగ్గొట్టడం ఇకపై కుదరకపోవచ్చు. 

ప్రయోజనం ఏమిటి.. 

ఇ-రశీదు విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఆర్థిక వ్యవస్థలో అనధికారిక లావాదేవీలు తగ్గి.. అధికారిక లావాదేవీలు పెరుగుతాయి. జీఎస్‌టీ విధానంలోనే కాదు.. ఆదాయపు పన్నుల విధానంలోనూ పన్నుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్న స్పృహ ప్రజల్లో కలుగుతుంది. పన్ను చెల్లింపుదార్ల సంఖ్య పెరిగేందుకూ దోహదం చేస్తుంది. నకిలీ రశీదుల ద్వారా పన్నుల మోసాలకు పాల్పడటాన్ని గుర్తించడం కూడా ఇ-రశీదులతో వీలవుతుంది. పన్నుల ఎగవేత తగ్గుతుండటంతో ప్రభుత్వానికి ఆదాయమూ పెరుగుతుంది. అటు ఆర్థిక వ్యవస్థకే కాదు వ్యాపారులకు కూడా ఇ-రశీదు విధానంతో ప్రయోజనం ఉంది. రిటర్న్‌ల దాఖలులో ఎలాంటి తప్పులు లేకుండా కచ్చితమైన వివరాలతో సులభంగా, వేగంగా చేసేందుకు వీలవుతుంది. లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదవుతుండటమే ఇందుకు కారణం. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ సమయంలో వివరాలను సరిపోల్చడం సులువు అవుతుంది. తద్వారా క్లెయిమ్‌ల రిఫండ్‌ల జాప్యమూ తగ్గుతుంది.

ఇబ్బందులు ఉన్నాయా.. 

ఇ-రశీదులు జారీ చేయాలంటే ముందుగా ఇన్‌వాయిస్‌ నమోదు పోర్టల్‌(ఐఆర్‌పీ)లో నమోదుకావాలి. వ్యాపారులు జారీ చేసిన రశీదు ఐఆర్‌పీలో నమోదుకాలేదని తేలితే దానిని పన్ను రశీదుగా గుర్తించకపోగా.. నిబంధనలను పాటించలేదన్న కారణంతో జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. సరకు రవాణా సమయంలోను, ఐటీసీ క్లెయిమ్‌ల విషయంలోనూ ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ తరహా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఐఆర్‌పీలో నమోదుకావాలి. దీంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఇ-రశీదు విధానాన్ని తప్పనిసరి చేయడానికి ముందు వాటిని దీనికి తగ్గట్లుగా సంసిద్ధం చేయడం సవాలుతో కూడుకున్నదేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దశల వారీగా దీనిని అమలు చేయడం వల్ల పెద్ద సంస్థలతో పోలిస్తే చిన్న సంస్థలకు ఈ విధానానికి అలవాటు పడే విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జీఎస్‌టీ విధానం అమలుతో ఇప్పటికే పన్నుల ఎగవేత చాలా వరకు అదుపులోకి వచ్చింది. అయితే ఔషధాలు లాంటి అధిక మార్జిన్లు ఉండే రంగాల్లోనే పన్నుల ఎగవేత ఎక్కువగా ఉంటోంది. ఇ-రశీదులతో ఈ తరహా రంగాల్లోనూ పన్నుల ఎగవేత తగ్గుముఖం పట్టొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇ-రశీదు విధానం పూర్తిగా అమల్లోకి రావడం, ఆచరించడం విజయవంతమైతే.. ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికత ఆధారిత పరోక్ష పన్ను విధానంగా భారత జీఎస్‌టీ విధానం నిలుస్తుందడనంలో ఎలాంటి సందేహమూ ఉండదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని