CarTrade IPO: 9 నుంచి కార్‌ట్రేడ్‌ పబ్లిక్‌ ఇష్యూ! - CarTrade IPO from 9th
close

Published : 04/08/2021 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CarTrade IPO: 9 నుంచి కార్‌ట్రేడ్‌ పబ్లిక్‌ ఇష్యూ!

ధరల శ్రేణి రూ.1,585- 1,618

దిల్లీ: వాహన విక్రయ ప్రకటనలకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం కార్‌ట్రేడ్‌ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూ వచ్చే సోమవారం (9న) ప్రారంభమై, 11న ముగియనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో విక్రయించే షేర్లకు ధరల శ్రేణిగా రూ.1,585- 1,618ను నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ.2,999 కోట్లు సమీకరించవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ ఆగస్టు 6న మొదలవుతుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో జరగనున్న ఈ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లో 1,85,32,216 షేర్లను విక్రయించనున్నారు. అందువల్ల ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధులు ఆయా వాటాదార్లకే వెళ్తాయే మినహా కంపెనీకి రావు. ఇష్యూలో సగం షేర్లను అర్హులైన సంస్థాగత కొనుగోలుదార్లకు, 35 శాతాన్ని చిన్న మదుపర్లకు, 15 శాతాన్ని సంస్థాగతేతర మదుపర్లకు కేటాయించారు.


 పబ్లిక్‌ ఇష్యూ కోసం సెబీకి నైకా దరఖాస్తు

సౌందర్య, ఫ్యాషన్‌ ఉత్పత్తుల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ‘నైకా’ను నిర్వహించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లనుంది. ఇందుకోసం దరఖాస్తు పత్రాలను సెబీకి కంపెనీ సమర్పించింది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లో భాగంగా రూ.525 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 4,31,11,670 షేర్లను కంపెనీ విక్రయించాలని అనుకుంటోంది. మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాల అంచనా ప్రకారం.. ప్రతిపాదిత ఐపీఓ ద్వారా కంపెనీకి రూ.3,500- 4,000 కోట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కార్యకలాపాల విస్తరణ, విక్రయ కేంద్రాలు, గిడ్డంగుల ఏర్పాటుకు కంపెనీ వినియోగించాలని అనుకుంటోంది. ఈ నిధులతో కొంత అప్పు తీర్చుకోవాలనీ భావిస్తోంది. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటోంది.

* వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.727.64 కోట్ల నికర లాభాన్ని, రూ.37,195 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపింది. 2019-20 ఆదాయంతో పోలిస్తే 25 శాతం, నికర లాభంతో పోలిస్తే 58 శాతం అధికంగా 2020-21లో ఆర్జించింది.  రూ.4,500 కోట్ల నిధుల సమీకరణ కోసం అదానీ విల్మర్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇందులో 2020-21, 2019-20 ఆర్థిక సంవత్సరాల ఫలితాలను వెల్లడించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని