China: తప్పుకోవాలి.. చైనా డిజిటల్‌ యువాన్‌ వస్తోంది..! - China is cracking down on crypto again
close

Updated : 27/09/2021 13:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

China: తప్పుకోవాలి.. చైనా డిజిటల్‌ యువాన్‌ వస్తోంది..!

* క్రిప్టో కరెన్సీలపై కఠిన ఆంక్షలు
 * తరలిపోతున్న బిట్‌కాయిన్‌ మైనర్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా సొంత డిజిటల్‌ కరెన్సీ వినియోగాన్ని వేగవంతం చేయడానికి చర్యలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా దేశంలో క్రిప్టో కరెన్సీ చెల్లింపులు, సేవలను ‘పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా’ పూర్తిగా నిషేధించింది. డాలర్‌కు పోటీగా యువాన్‌ను ప్రపంచ స్థాయి కరెన్సీగా చేయాలని కలలుగంటున్న చైనా ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లు కుదేలయ్యాయి. బిట్‌కాయిన్‌ మైనింగ్‌ సెంటర్లు మూతపడ్డాయి.

ఏం జరిగింది..?

వర్చువల్‌ కరెన్సీలకు ఎటువంటి చట్టబద్ధత లేదని గత శుక్రవారం ‘పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా’ అధికారికంగా ప్రకటించింది. వీటిని మానిటరీ అథారిటీలు జారీ చేయవని పేర్కొంది. అంతేకాదు వీటికి చట్టబద్ధత లేదని.. వీటి పంపిణీ, వినియోగం చేయడం చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఆసాంఘిక ఆర్థిక కార్యకలాపాలను నిరోధిస్తామని పేర్కొంది. ఈ ప్రకటనపై పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, సైబర్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ ఆఫ్‌ చైనా, సుప్రీం పీపుల్స్‌ కోర్టు సంతకాలు చేశాయి. దీంతో బిట్‌కాయిన్‌ దాదాపు 9శాతం వరకు విలువ కోల్పోయింది.

క్రిప్టో మైనింగ్‌పై ఉక్కుపాదం..

చైనా కేంద్ర బ్యాంకు విడుదల చేయనున్న డిజిటల్‌ కరెన్సీ తప్ప మిగిలిన వాటిని నిషేధించేందుకు జూన్‌ నుంచే పావులు కదుపుతోంది. ఆ నెలలో ఇండస్ట్రీయల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, అగ్రికల్చర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా, అలీపే సంస్థలను క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లను ఆపేయాలని పేర్కొంది. వర్చువల్‌ కరెన్సీ మైనింగ్‌పై సమగ్ర నిషేధం విధించింది.  ఒకప్పుడు ప్రపంచంలో వినియోగించే క్రిప్టో కరెన్సీలో 80శాతం చైనాలోనే మైనింగ్‌ అయ్యేవి. దీంతో సిచువాన్‌ ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలోని పలు కంపెనీలు మైనింగ్‌ ప్రాజెక్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.  ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీల తయారీ రెండో స్థానంలో ఉన్న పూలిన్‌ చైనాను వీడాలని నిర్ణయించుకొంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హాంకాంగ్‌లో ఉంది.

విద్యుత్తు.. ఆర్థిక సాయంలో కోత..

తాజాగా శుక్రవారం చేసిన ప్రకటనలో కూడా క్రిప్టోకరెన్సీ మైనర్స్‌పై కఠిన ఆంక్షలను విధించింది. కొత్తగా క్రిప్టో కార్యకలాపాలు చేపట్టకూడదని పేర్కొంది. ప్రస్తుత ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చే ప్రణాళికను వేగంగా అమలు చేయాలని పేర్కొంది. క్రిప్టో మైనింగ్‌ చేసేవారికి విద్యుత్తు సరఫరాపై నిషేధం విధించింది. ఈ సంస్థలకు ఆర్థిక, పన్ను రూపంలో సాయం చేయకూడదని ఆదేశించింది.

బిట్‌కాయిన్‌ శరణార్థులు..

బిట్‌కాయిన్‌ తయారీకి కంప్యూటర్ల సాయంతో క్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించి కరెన్సీని సంపాదించే ప్రక్రియను మైనింగ్‌ అంటారు. దీనికి చాలా విద్యుత్తు అవసరం. చైనాలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో ఏప్రిల్‌ మూడోవారంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో సమస్యలు వచ్చాయి.  విద్యుత్తును నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ విలువ 14శాతం వరకు పడిపోయింది. దీనిని బట్టే బిట్‌కాయిన్లపై చైనా పట్టు అర్థమవుతుంది. తాజాగా చైనా దెబ్బకు బిట్‌కాయిన్‌ తయారీ సంస్థలు ఆగమేఘాల మీద ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కజకిస్థాన్‌, రష్యా, ఉత్తర అమెరికాలోని దేశాలకు వెళ్లిపోతున్నాయి. ఎందుకంటే వీరికి సమయం డబ్బుతో సమానం. తాము కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాలను గుర్తించినట్లు పూలిన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అల్జెండ్రో డె లా టోరెస్‌ తెలిపారు. ఈ సంస్థ ఇప్పటికే అమెరికాలోని టెక్సాస్‌ ప్రాంతంలోని ఆస్టిన్‌కు వెళ్లిపోయింది. ఒక్క పూలినే కాదు చాలా సంస్థలు టెక్సాస్‌కు వెళుతున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్‌ జార్జ్‌ అబాట్‌ క్రిప్టో కరెన్సీలకు బలమైన మద్దతుదారు. ఆయన జూన్‌లో క్రిప్టో వ్యాపారానికి గుర్తింపు ఇస్తూ రాష్ట్రంలోకి స్వాగతం పలికారు. షెన్‌జెన్‌కు చెందిన ఓ సంస్థ 26 మిలియన్‌ డాలర్లు వెచ్చించి బిట్‌మైన్‌ కోసం అక్కడ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. బీజింగ్‌కు చెందిన మరో సంస్థ టెక్సాస్‌లోని రాక్‌డేల్‌లో ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోంది.

2022లో చైనా సొంత డిజిటల్‌ కరెన్సీ

చైనా సొంతంగా డిజిటల్‌ కరెన్సీని విడుదల చేయనుంది. దీనికోసం ఇప్పుడు పోటీగా ఉన్న వాటిని.. పోటీ అవుతాయని భావించిన వాటిని దేశం నుంచి బయటకు పంపించడం మొదలుపెట్టింది. 2014లోనే దీనిపై పనిచేయడం మొదలుపెట్టింది.  2016లో డిజిటల్‌ కరెన్సీ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఏర్పాటు చేసింది. 2020 నుంచి ప్రయోగాత్మక వినియోగం మొదలుపెట్టింది. దీనిని ఈసీఎన్‌వైగా వ్యవహరిస్తోంది. అంటే ఎలక్ట్రానిక్‌ చైనీస్‌ యువాన్‌ అని అర్థం.

చైనా కొన్ని నెలల క్రితం సొంతంగా ఎలక్ట్రానిక్‌ కరెన్సీ వినియోగాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.  వీటిని చెంగ్డూ, షెన్‌జెన్‌, షిన్జియాంగ్‌, బీజింగ్‌లో పరీక్షించింది. 2022 నాటికి డిజిటల్‌ యువాన్‌ విడుదల చేసి.. వింటర్‌ ఒలింపిక్స్‌లో పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం చైనా డిజిటల్‌ యువాన్‌కు అధికారిక గుర్తింపు తెచ్చేలా చట్టాల్లో మార్పులకు ప్రాణాళిక సిద్ధం చేసుకొంది.

అంతేకాదు దేశం నుంచి మూలధన నిధులు బయటకు తరలిపోవడానికి క్రిప్టో కరెన్సీలు కారణమవుతున్నాయని బీజింగ్‌ అనుమానిస్తోంది. ఈ నిధులు బీజింగ్‌ నియంత్రణను తప్పించుకొని క్రిప్టో రూపంలో వెళ్లిపోతున్నాయి. చైనా నియంత్రణ సంస్థలు లోపాన్ని సరిదిద్దాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని