close
Array ( ) 1

తాజా వార్తలు

వైరస్‌ దెబ్బకు బండి బోల్తా..

 చైనాలో భారీగా పతనమైన కార్ల విక్రయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్(కోవిడ్‌-19) దెబ్బకు పారిశ్రామిక రంగం విలవిల్లాడుతోంది. ప్రపంచ వృద్ధిరేటే 1శాతం కుంగవచ్చని నివేదికలు ఘోషిస్తున్నాయి. ఆ ప్రభావం ఆటోమొబైల్‌ రంగంపై కూడా పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌ అయిన చైనాలో కార్ల విక్రయాలు భారీగా పతనమయ్యాయి. కేవలం నామమాత్రంగానే విక్రయాలు జరుగుతున్నాయి. తాజాగా చైనా ప్యాసింజర్‌ కార్స్‌ అసోసియేషన్‌(సీపీసీఏ) ఫిబ్రవరి తొలి 16 రోజుల్లో జరిగిన విక్రయాలపై నివేదిక ఇచ్చింది. ఇది చూస్తే ఎవరికైనా ఆదేశం ఎంత కష్టాల్లో ఉందో అర్థమవుతుంది. 
ఫిబ్రవరి 16వ తేదీ వరకు అక్కడ ప్యాసింజర్‌ కార్ల విక్రయాలు 92శాతం  పతనమయ్యాయి. గతేడాది ఇదే సీజన్‌లో 59,930 కార్లు అమ్ముడుపోతే ఇప్పుడు 4,909 కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అతి తక్కువ డీలర్లు మాత్రమే షోరూమ్‌లను తెరిచినట్లు ఈ నివేదికలో వెల్లడించారు. వారి వద్ద కూడా కస్టమర్లు తక్కువగానే ఉన్నారని పేర్కొంది. 
 ఈ ప్రభావంతో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దాదాపు 10శాతం మేరకు విక్రయాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. ఏడాది మొత్తంగా చూస్తే దాదాపు 5శాతం మేరకు విక్రయాలు తగ్గొచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌ లోపు ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేస్తారనే అంచనాలతో ఈ లెక్కలు వేశారు. చైనా మార్కెట్లో ఏటా 25 మిలియన్ల వాహనాలను విక్రయిస్తారు.  

భారత్‌పై ప్రభావం..

కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి చైనాలో వాహనా తయారీ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి. వాహనాల విడిభాగాల తయారీ, సరఫరా చేస్తున్న ప్రధాన దేశాల్లో చైనా ఒకటని.. ఈ వైరస్‌ నేపథ్యంలో చైనాలో నెలకొన్న మందగమనంతో భారత్‌పై పెను ప్రభావం పడనుందని ఫిచ్‌ ఇటీవల పేర్కొంది. దీంతో తయారీ దారులు సైతం వాహనాల ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి నెలకొంటుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కారణాలతో 2020లో 8.3 శాతం మేర వాహనాల ఉత్పత్తి తగ్గేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ తగ్గుదల 2019లో 13.2 శాతంగా ఉండడం గమనార్హం. మరోపక్క టాటా మోటార్స్‌కు చెందిన జేఎల్‌ఆర్‌కు చైనా ప్రధాన మార్కెట్‌. ఇప్పుడు కరోనా ప్రభావం ఆ సంస్థపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
HITS2020
VITEEE 2020
dr madhu
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన