China GDP: మందగించిన చైనా వృద్ధిరేటు.. కారణాలివే! - Chinas economy weakens as GDP in Q3 declines
close

Published : 18/10/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

China GDP: మందగించిన చైనా వృద్ధిరేటు.. కారణాలివే!

బీజింగ్‌: మూడో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు మందగించింది. రెండో త్రైమాసికంలో 7.9 శాతంగా నమోదైన జీడీపీ రెండో త్రైమాసికానికి 4.9 శాతానికి పడిపోయింది. తొలి త్రైమాసికంలో ఇది 18.3 శాతంగా నమోదు కావడం గమనార్హం. తొలి మూడు త్రైమాసికాల జీడీపీలో 64.8 శాతం వాటా వివియోగానిదేనని అక్కడి ‘నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్’ వెల్లడించింది. 

కరోనా సంక్షోభం నుంచి అత్యంత వేగంగా కోలుకున్న చైనా ఆర్థిక వ్యవస్థకు క్రమంగా అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వినిమయం ఊపందుకోవడంతో ఉత్పత్తి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ముడిసరకులకు గిరాకీ పెరిగి ధరలు ఎగబాకాయి. దీంతో పాటు ఎవర్‌గ్రాండ్‌ రూపంలో స్థిరాస్తి రంగంలో నెలకొన్న సంక్షోభం, బొగ్గు కొరతతో నెలకొన్న విద్యుత్తు సమస్యలు కూడా చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు వెలుగుచూడడం కూడా వృద్ధిరేటు మందగమనానికి కారణమైందని నిపుణులు అభిప్రాయపడ్డారు. నాలుగో త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందన్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం గణాంకాలపై సైతం ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.

అధికారిక గణాంకాల ప్రకారం..చైనాలో కన్జ్యూమర్‌ గూడ్స్‌ రిటైల్‌ విక్రయాలు 16.4 శాతం పెరిగి 4.9 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. తొలి మూడు త్రైమాసికాల్లో విలువ ఆధారిత పారిశ్రామికోత్పత్తి 11.8 శాతానికి పెరిగింది. అలాగే ఈ సమయంలో పెట్టుబడులు 7.3 శాతం ఎగబాకాయి. ఇక సెప్టెంబరు నెలలో పట్టణ ప్రాంత నిరుద్యోగం 4.9 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 0.5 శాతం తగ్గింది. జనవరి-సెప్టెంబరు సమయంలో పట్టణ ప్రాంతంలో కొత్తగా 10.45 మిలియన్ల ఉద్యోగాల కల్పన జరిగింది. దీంతో ఈ ఏడాది ఉద్యోగ కల్పన లక్ష్యంలో 95 శాతం చేరుకున్నట్లైంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని