చిన్న పొర‌పాట్లే .. భ‌విష్య‌త్తులో అవ‌రోధాలు కాగ‌ల‌వు! - Common-Mistakes-by-investors
close

Published : 05/03/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న పొర‌పాట్లే .. భ‌విష్య‌త్తులో అవ‌రోధాలు కాగ‌ల‌వు!

మ‌దుప‌రులు త‌మ పెట్టుబ‌డుల విష‌యంలో సాధార‌ణంగా కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. ఈ సాధార‌ణ పొర‌పాట్లేమిటో అందుకు నిపుణులు సూచిస్తున్న‌దేమిటో తెలుసుకుందాం. మ్యూచువ‌ల్ ఫండ్లతో జ‌రిగే పొర‌పాట్ల‌తో పాటు మ్యూచువ‌ల్ ఫండేత‌ర అంశాల్లోనూ జ‌రిగే త‌ప్పిదాలను గుర్తించి అందుకు నిపుణులు చేసే సూచ‌న‌ల‌ను తెలుసుకొని పాటించే ప్ర‌య‌త్నం చేద్దాం…

పెట్టుబ‌డుల‌ కేటాయింపుల్లో పొర‌పాట్లు:
ఈక్విటీల‌తో అనుబంధాన్ని పెంచుకున్నారా? స‌్థిరాస్తిలోని పెట్టుబ‌డుల‌నే సుర‌క్షితంగా భావించేవారిలో మీరు ఉన్నారా? పెట్టుబ‌డుల‌పై ఇలాంటి ధోర‌ణి క‌న‌బ‌రిచే వారు స‌మ‌స్య‌ల్లో ఇరుక్కునే ప్ర‌మాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఒక మ‌దుప‌రి డెట్ ప‌థ‌కాల‌నే సూచించ‌మ‌ని అడుగుతాడు. ఇది ఎలా ఉంటుందంటే… డాక్ట‌ర్ ద‌గ్గ‌రికి వెళ్లి త‌న మ‌న‌సులో ఏమ‌నుకుంటున్నాడో అవే మందులు ఇప్పించాల‌ని వైద్యుడ్ని కోరుకోవ‌డం లాగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మ‌రో ఇన్వెస్ట‌ర్ కు స్థిరాస్తిలో బాగానే పెట్టుబ‌డులు ఉన్నాయి. అయితే త‌న పిల్ల‌ల చ‌దువుల‌కు డ‌బ్బు స‌రిపోక‌, స్థిరాస్తిని అమ్ముకొని సొమ్ము చేసుకోలేక చివ‌రికి బ్యాంకు నుంచి రుణం పొందాల్సి వ‌చ్చింది. ఇలా మ‌దుప‌రులు ఒకే ర‌క‌మైన పెట్టుబ‌డుల‌కు అలవాటు ప‌డితే వారికే క‌ష్ట‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో తప్పిదాలు:
పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త శ్రుతిమించడం:
పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త అవ‌స‌ర‌మే. అయితే ఎంత వ‌ర‌కు? కొంద‌రు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోని అన్ని ప‌థ‌కాల్లో పెట్టుబడుల‌ను ట్రై చేద్దామనుకుంటారు. నిర్ణీత ల‌క్ష్యాలు, అవ‌స‌రాలు, న‌ష్ట‌భ‌యాన్ని త‌ట్ట‌కునే సామ‌ర్థ్యం, కాల‌వ్య‌వ‌ధి, లిక్విడిటీ అవ‌స‌రాల‌ను బ‌ట్టి పెట్టుబ‌డుల కేటాయింపులు ఉండాలే త‌ప్ప అందుబాటులో ఉన్న ప్ర‌తీ మ్యూచువ‌ల్ ఫండ్‌లో మ‌దుపు చేయాల‌నుకోవ‌డం స‌బ‌బు కాద‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

పాస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్‌పై అతి విశ్వాసం:
కొంద‌రు మ‌దుప‌రులు పాస్ట్ ప‌ర్‌ఫార్మెన్స్‌ను బ‌ట్టి ఫండ్ల‌ను ఎంచుకుంటారు. అవి స్థిరాస్తి, ఈక్విటీ, బంగారంల‌లో పెట్టుబ‌డులు పెట్టేవై ఉంటాయి. ఒక ర‌కానికి చెందిన పెట్టుబ‌డుల నుంచి పూర్తిగా మారిపోయి వేరే పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లించాల‌ని కొంద‌రు అనుకుంటారు. ఒక నిర్ణీత పెట్టుబ‌డిలో పెట్టాక దాంట్లోనే కొన‌సాగించ‌డాన్ని మ‌దుపురులు పున‌రాలోచించాల‌ని వారి న‌ష్ట‌భ‌య సామ‌ర్థ్యం, కాల‌వ్య‌వ‌ధి, లిక్విడిటీ అంశాలను బ‌ట్టి పెట్టుబ‌డుల్లో కేటాయింపుల‌ను స‌వ‌రించుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువ‌ల్ ఫండేత‌ర పొర‌పాట్లు:
ఎలా మొద‌లు పెట్టాలో తెలియ‌క‌పోవ‌డం:
పెట్టుబ‌డులు ఎక్క‌డ మొద‌లుపెట్టాలో, ఎక్క‌డికి మ‌ళ్లించాలో స‌రైన అవ‌గాహ‌న లేక‌పోతే భ‌విష్య‌త్తులో క‌ష్ట‌మ‌వుతుంద‌ని ఆర్థిక ప్ర‌ణాళిక‌దారులు అంటున్నారు. ఖ‌ర్చుల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక మిగిలి ఉన్న డ‌బ్బును అలాగే బ్యాంకు ఖాతాలో ఉంచ‌డ‌మూ ఏమంత లాభసాటిఅయిన ప‌ని కాద‌ని నిపుణులు సూచిస్తున్నారు. కొంద‌రికి రూ.80వేల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటుంది అయినా రూ.20వేల‌తోనే సరిపెట్టుకుంటారు. ఊరికే ఖాతాలో ఉన్న డ‌బ్బు తొంద‌ర‌గా ఖ‌ర్చు అయ్యేందుకు ఆస్కారం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అంద‌రూ ఇచ్చే స‌ల‌హాల‌ను విని మ‌న‌కు త‌గిన‌దో కాదో తెలుసుకోకుండానే ఐపీవోలు, బంగారం లాంటివాటిలో పెట్టుబడులు పెట్ట‌డమూ అంత మంచిది కాదు.

అవ‌స‌రాల‌కు త‌గని బీమా కొనుగోలు:
బీమా హామీ సొమ్ముపై ఎంత మాత్ర‌మూ దృష్టి పెట్ట‌కుండా పాల‌సీదారులు కొన్ని ఏళ్ల‌పాటు ప్రీమియంలు క‌డుతూనే ఉంటారు. కొంద‌రు 15 పాల‌సీల‌తో త‌మ వ‌ద్ద‌కు వ‌స్తారు. అన్నీ క‌లిపినా వారి జీవ‌న ప్ర‌మాణానికి స‌రిపడా క‌వ‌రేజీ ఉండ‌దు. బంధువులో, స్నేహితుల్లో ఎవ‌రో ఒక‌రు బీమా ఏజెంట్‌గా ఉంటారు. వారి స‌ల‌హా మేర‌కు ఏదో ఒక పాల‌సీ కొనుగోలు చేస్తారు. అది త‌మ‌కు అవ‌స‌ర‌మా కాదా? అని ఆలోచించ‌రు అని ఆర్థిక నిపుణులు బీమా కొనుగోలుపై పాల‌సీదారులు అవ‌లంబించే వైఖ‌రిని తెలియ‌జేస్తున్నారు. ఎంత మొత్తానికి బీమా అవ‌స‌రామో పాల‌సీదారులే నిర్ణ‌యించుకొని త‌గిన పాల‌సీ ఎంచుకోవాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. అదీ కాకుండా బీమాను, పెట్టుబడుల‌ను వేర్వేరుగా తీసుకునేందుకే ఎక్కువ‌గా మొగ్గు చూపాల‌ని చెబుతున్నారు.

ఆదాయం స‌రిపోక‌పోతే అప్పులేనా!
ఇవాళ రేపు కొంద‌రు ఎలా ఉంటారంటే ఆదాయం స‌రిపోక‌పోతే ఇక అప్పులు తీసుకోవ‌డం మొద‌లుపెడ‌తారు. అన‌వ‌స‌ర‌మైన వాటికి కూడా వ్య‌క్తిగ‌త రుణాలు పొందేవారు ఉంటారు. సెల‌వుల‌ను ఎంజాయ్ చేసేందుకు, బ‌ర్త్‌డే పార్టీల కోసం అప్పు చేసి మ‌రీ ఖ‌ర్చు చేస్తుంటారు. ఇది తాత్కాలికంగా బాగానే ఉన్నా దీర్ఘ‌కాలంలో తీవ్ర ప్ర‌భావం చూపించ‌గ‌ల‌ద‌ని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఇలా ఖ‌ర్చు పెట్ట‌డం అల‌వాటైతే ఎప్పుడైనా అనుకోకుండా ఉపాధి కోల్పోతే చాలా క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు అంటున్నారు.

ఇలాంటి చిన్న చిన్న పొర‌పాట్లు, అవ‌గాహ‌నా రాహిత్య‌మే దీర్ఘ‌కాలంలో ఆర్థిక ల‌క్ష్యాల‌ను దెబ్బ‌తీయ‌గ‌ల‌వు. మ‌దుప‌రులు వీటిని గుర్తించి త‌మ‌ను తాము స‌రిదిద్దుకుంటార‌ని ఆశిస్తున్నాం. దీనికోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌ర‌మూ లేదు. కేవ‌లం మ‌దుపును అల‌వాటుగా మార్చుకుంటే చాలు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని