భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌ - Cost of houses are down in india
close

Updated : 19/03/2021 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌

2020 డిసెంబరు త్రైమాసికంపై నైట్‌ఫ్రాంక్‌ నివేదిక
అంతర్జాతీయంగా 56వ స్థానం

ముంబయి: కరోనా మహమ్మారి ప్రభావం వల్ల, అంతర్జాతీయంగా 56 కీలక దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. 2020 డిసెంబరు త్రైమాసికంలో దేశీయంగా ఇళ్ల ధరలు సగటున 3.6 శాతం మేర తగ్గాయని పేర్కొంది. 2019ఇదే సయమంలో అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో 43వ స్థానంలో ఉన్న భారత్‌ స్థానం ఈసారి 56కు పడిపోయిందని నైట్‌ఫ్రాంక్‌ గ్లోబల్‌ హౌస్‌ ప్రైస్‌ సూచీ తెలిపింది. ప్రపంచంలోని ముఖ్యమైన 56 దేశాలు, భూభాగాల్లోని ప్రధాన నివాస స్థలాల్లో ధరల్ని అధికారిక గణాంకాల ఆధారంగా పరిశీలిస్తుంటుంది. ఈ నివేదికలోని అంశాలివీ..
సమీక్షా త్రైమాసికంలో టర్కీలో ఇళ్ల ధరలు 30.6 శాతం మేర పెరిగాయి. అందువల్ల వార్షిక ర్యాంకింగ్స్‌లో ఈ దేశం తొలి స్థానంలో నిలిచింది. 18.6 శాతం మేర ఇళ్ల ధరలు పెరగడంతో రెండో స్థానంలో న్యూజిలాండ్, 16 శాతం ధరల పెరుగుదలతో స్లొవేకియా మూడో స్థానంలో నిలిచాయి.
కరోనా మహమ్మారితో అధికంగా ప్రభావితమైన అమెరికాలోనూ ఇళ్ల ధరలు 10.4 శాతం మేర పెరగడం గమనార్హం.
2020 డిసెంబరు త్రైమాసికంలో 89 శాతం దేశాలు, భూభాగాల్లో ధరలు పెరిగాయని నివేదిక తేల్చింది. భారత్‌లో 3.6 శాతం మేర ఇళ్ల ధరలు తగ్గాయని, మొరాకోలో 3.3 శాతం ధరలు తగ్గాయని  పేర్కొంది.
రష్యాలో 14 శాతం, కెనడా, బ్రిటన్‌లో 9 శాతం చొప్పున, జపాన్‌లో 5 శాతం, సింగపూర్‌లో 2.5 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి.
2020 జనవరి-మార్చిలో భారత్‌ ర్యాంకింగ్‌ 43 కాగా, జూన్‌ త్రైమాసికంలో 54వ స్థానానికి చేరింది. సెప్టెంబరు త్రైమాసికంలోనూ ఇదే స్థానం కొనసాగగా, డిసెంబరు త్రైమాసికంలో 56వ స్థానానికి పడిపోయింది. ఇదే చివరి ర్యాంక్‌ కావడం గమనార్హం. హాంకాంగ్, మలేషియాల్లోనూ ఇళ్ల ధరలు తగ్గాయి.
కరోనా మహమ్మారి ప్రభావంతో ధరలు తగ్గడంతో, గృహాలకు గిరాకీ పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. గృహ రుణ రేట్లు దశాబ్దాల కనిష్ఠానికి చేరాయి. స్టాంప్‌ డ్యూటీ, ఇతర పన్నులు కూడా కొన్ని రాష్ట్రాల్లో బాగా తగ్గించారు.
‘కరోనా మహమ్మారి ప్రభావంతో గృహ యాజమాన్యంపై వినియోగదార్ల దృక్పథం మారింది. కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకున్నారు. టీకాల కార్యక్రమం ఊపందుకోవడంతో, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటే, ప్రస్తుత విక్రయాల వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంద’ని నైట్‌ఫ్రాంక్‌ ఛైర్మన్‌ శిశిర్‌ బైజాల్‌ వెల్లడించారు. 

ఇవీ చదవండి...
ఐపీఓల్లో మదుపు.. ఇవన్నీ చూశాకే..

తుక్కు చేయండి.. లబ్ధి పొందండి

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని