అనారోగ్యంలో ..అండా దండా! - Critical-illness-policy
close

Published : 27/12/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనారోగ్యంలో ..అండా దండా!

ఆరోగ్య బీమా పాలసీ అనారోగ్యంలో అండగా ఉండి, వైద్య ఖర్చుల్ని మన జేబు నుంచి భరించాల్సిన అవసరాన్ని తప్పిస్తుంది. కానీ, క్యాన్సర్‌, హార్ట్‌ స్ట్రోక్‌ లాంటి తీవ్రమైన వ్యాధుల బారినపడ్డప్పుడు ఏమిటి పరిస్థితి? నాకేం కాదులే అని నిశ్చింతగా జీవించడం సాధ్యంకాని రోజులివి. మారుతున్న జీవన విధానంలో ఎప్పుడు ఏ అనారోగ్యం కాటేస్తుందో వూహించడమే భయం కల్గిస్తుంది. వైద్య ఖర్చులను ఆరోగ్య బీమా పాలసీ చెల్లించినా… తర్వాత ఉద్యోగం, వ్యాపారం చేయలేక ఆర్థికంగా కలిగే నష్టాన్ని ఎలా పూడ్చుకోవడం? సరిగ్గా ఇలాంటప్పుడే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అక్కరకొస్తుంది. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలు చాలా భిన్నమైనవి. తీవ్రమైన వ్యాధుల కోసం ఆరోగ్య బీమా కంపెనీల నుంచి ప్రత్యేక పాలసీగా తీసుకునే వెసులుబాటు ఉంది.

ఎలా పనిచేస్తుంది?
పాలసీదారుడు క్యాన్సర్‌, బైపాస్‌ సర్జరీ, అవయవ మార్పిడి, పక్షవాతం తదితర తీవ్రమైన వ్యాధుల బారిన పడ్డప్పుడు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కొంత మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తం మనం పాలసీ తీసుకున్నప్పుడు ఎంచుకున్న హామీ మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు వైద్య చికిత్సల కోసం ఎంత ఖర్చు చేశారన్న దానితో ఎలాంటి సంబంధం ఉండదు.

ఉదాహరణకు మీరు క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీని రూ. 5లక్షల మొత్తానికి తీసుకున్నారనుకుందాం. బీమా కంపెనీ నిర్దేశించిన వ్యాధి బారిన పడ్డప్పుడు ఆ మొత్తం చెల్లిస్తారన్నమాట. ఒకసారి ఈ మొత్తం చెల్లించాక , పాలసీ రద్దు అవుతుంది. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత 30 రోజుల్లోగా బీమా సంస్థకు అన్ని వివరాలు తెలియజేస్తూ పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఆరేళ్ల వారి నుంచి 75ఏళ్ల వ‌య‌సు ఉన్నవారికి ఈ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

మినహాయింపులున్నాయా?
సాధారణంగా 9 నుంచి 35 రకాల వ్యాధులను తీవ్రమైన వ్యాధులుగా పరిగణిస్తారు. బీమా సంస్థలను బట్టి ఈ జాబితాలో మార్పులుంటాయి. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత కనీసం 30-60 రోజులు జీవించి ఉంటేనే పరిహారం ఇస్తారు. ముందస్తు వ్యాధులకు పరిహారం ఇవ్వరు. పాలసీ తీసుకున్న తర్వాత 60 నుంచి 90 రోజుల వరకూ వేచి ఉండే కాలంగా లెక్కిస్తారు.

  • మీ ఆరోగ్య బీమా పాలసీకి మరొక అదనపు సౌకర్యంగా మాత్రమే దీనిని ఎంచుకోవాలి. పాలసీ లో తెలిపిన తీవ్ర అనారోగ్యాలకు మాత్రమే ఈ పాలసీ పనిచేస్తుంది, సాధారణ ఆసుపత్రి ఖర్చులకు ఈ పాలసీ వర్తించదు. కాబట్టి పూర్తిగా దీనిమీదే ఆధారపడితే మాత్రం ఇబ్బందే.

ఆరోగ్య పాలసీ ఉందిగా?
ఇది ఒక రకంగా ఆరోగ్య బీమా పాలసీనే. అయినప్పటికీ రెండింటి పనితీరులో ఎంతో వ్యత్యాసం ఉంది. ఆరోగ్య బీమా పాలసీ వైద్య చికిత్స కోసం చేరినప్పుడు వాస్తవంగా అయిన ఖర్చును ఆసుపత్రికే నేరుగా చెల్లిస్తుంది. లేదా మనం బిల్లు చెల్లించిన తర్వాత దానిని బట్టి, మనకు పరిహారం ఇస్తుంది.
క్రిటికల్‌ ఇల్‌నెస్‌లో వైద్య ఖర్చులతో ఏ మాత్రం సంబంధం ఉండదు. నిర్ణీత మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు. అనారోగ్యం పాలై ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేనప్పుడు ఇది ప్రయోజనం కల్గిస్తుంది.

సాధారణ ఆరోగ్య బీమా పాలసీ అన్ని రకాల అనారోగ్యాలకు బీమా కల్పిస్తుంది . కాబట్టి , ముందుగా ఒక సాధారణ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుని, దానికి అదనంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ని తీసుకోవచ్చు .

సాధారణంగా జీవిత బీమా కంపెనీలు టర్మ్ పాలసీ తోపాటు క్రిటికల్ ఇల్నెస్ బీమాని రైడర్ గా అందిస్తారు. ఆరోగ్య బీమా లో లభించే క్రిటికల్ ఇల్నెస్ బీమాతో ఈ రైడర్ ప్రీమియంని పోల్చి చూద్దాం. రమేష్ వయసు 30 ఏళ్ళు. తాను రూ. 10 లక్షల బీమా హామీతో క్రిటికల్ ఇల్నెస్ బీమాని తీసుకోదల్చాడు. ఒకవేళ ప్రత్యేక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఎంచుకుంటే దాని వార్షిక ప్రీమియం సుమారుగా రూ. 4000- 4200 ఉంటుంది. అదే రైడర్ గా ఎంచుకుంటే, దాని వార్షిక ప్రీమియం రూ 3000-3200 వరకు ఉంటుంది. ఈ రెండు రకాల పాలసీలలో పెద్దగా తేడా ఉండదు కాబట్టి , రైడర్ ఎంచుకోవచ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని