సౌదీ చమురులో మూడో వంతు కోత - Cut in Oil Imports from saudi
close

Published : 07/04/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌదీ చమురులో మూడో వంతు కోత

మే నెలకు చమురు కంపెనీల వ్యూహమిదీ
మధ్య ప్రాచ్యం వెలుపలపై దృష్టి
గిరాకీ తగ్గడమూ ఒక కారణం

దిల్లీ : సౌదీ అరేబియా నుంచి కొనుగోలు చేసే చమురులో మే నెలకు సంబంధించి మూడో వంతు మేర తగ్గించి, భారత రిఫైనరీలు దిగుమతి చేసుకోనున్నాయి. మధ్యప్రాచ్యం వెలుపల నుంచి దిగుమతులు పెంచుకోవడంపై భారత్‌ దృష్టి సారించడం ఇందుకు నేపథ్యం. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా చమురుకు గిరాకీ తగ్గుతున్నందున ఇప్పుడే ప్రత్యామ్నాయాలు బలోపేతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నందున, మే నెలలో చమురుకు గిరాకీ తగ్గుతుందన్న అంచనాలున్నాయి.

ఐఓసీతో పాటు ఇతర రిఫైనరీలు సౌదీ నుంచి నెలవారీగా చేసుకునే చమురు దిగుమతుల్లో సగటున 65 శాతం మాత్రమే మే నెలకు ఆర్డరు ఇవ్వనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న ముగ్గురు సమాచారం అందించారు. ముడిచమురు ఉత్పత్తి పెంచి, ధరలు తగ్గేలా చూడమని భారత్‌ కోరినా, సౌదీ అరేబియా పెడచెవిన పెట్టడమూ ప్రస్తుత పరిణామాలకు కారణం. ఉత్పత్తి కోతలపై ఆంక్షలు ఎత్తివేయడంపై సౌదీ అరేబియా నిర్లక్ష్యం వహిస్తుండడంతో, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నించాలని గత నెలలో ప్రభుత్వ రిఫైనరీలకు కేంద్రం సూచించిన విషయం విదితమే.

స్పాట్‌ మార్కెట్‌పైనే..

సౌదీ అరేబియా ఇతర ఓపెక్‌ దేశాలతో టర్మ్‌ లేదా స్థిర పరిమాణ కాంట్రాక్టులు కుదుర్చుకోడానికి బదులు స్పాట్‌ లేదా కరెంట్‌ మార్కెట్‌ నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేయాలని ఐఓసీ, ఇతర కంపెనీలు భావిస్తున్నట్లు సమాచారం. స్పాట్‌ మార్కట్లో ధరలు పతనమైతే ఆ ప్రయోజనాలను పొందడానికి వీలుంటుంది. దశాబ్దం కిందటితో పోలిస్తే మన చమురు సంస్థలు తమ స్పాట్‌ కొనుగోళ్లను 20 శాతం నుంచి 30-35 శాతం వరకు పెంచుకున్నాయి. ఇటీవలి వారాల్లో గయనా నుంచి నార్వే వరకు.. కొత్తగా కొనుగోళ్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, కెనడా, పశ్చిమాఫ్రికా నుంచీ కొనుగోళ్లు పెంచారు.

తగ్గిన ఒపెక్‌ వాటా..

ఏప్రిల్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు ఒపెక్‌ నుంచి భారత్‌లోకి దిగుమతులు 74.4 శాతానికి తగ్గాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి 79.6 శాతంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిల్‌ ధరలు భారీగా పెరిగి.. కరోనాతో దెబ్బతిన్న ఆర్థికంపై మరింత భారాన్ని మోపిన సంగతి గుర్తుండే ఉంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని