ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీకి, ప్రీమియం తిరిగి వ‌చ్చే పాల‌సీకి మధ్య‌ వ్య‌త్యాసం ఏంటి? - Difference-between-pure-term-insurance-and-return-of-premium-policy
close

Published : 23/04/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీకి, ప్రీమియం తిరిగి వ‌చ్చే పాల‌సీకి మధ్య‌ వ్య‌త్యాసం ఏంటి?

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ సాధారణంగా రెండు వేరియంట్లలో వస్తాయి - 1. ప్యూర్ టర్మ్ పాల‌సీ, 2. ప్రీమియం తిరిగే వ‌చ్చే ట‌ర్మ్ పాల‌సీ(టీఆర్ఓపీ). పాల‌సీ కొనుగోలు చేసేప్పుడు వినియోగదారుల మనస్సులో వ‌చ్చే సాధారణ ప్రశ్న ఏమిటంటే, 'టర్మ్ బీమా పాల‌సీ కొనుగోలు చేస్తే నేను ఎంత రాబడిని పొందుతాను?’ సాధారణంగా ఏదైనా ఫైనాన్షియ‌ల్ ప్రొడెక్ట్‌లో పెట్టుబ‌డి పెడితే రాబ‌డి వ‌స్తుంది. అయితే టర్మ్ బీమా ఇందుకు భిన్నంగా ఉంటుంది. ట‌ర్మ్ ఇన్సురెన్స్‌లో కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి దురదృష్ట‌వ‌శాత్తు అనుకోని ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణం సంభ‌విస్తే ఆవ్య‌క్తి మీద ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల‌కు జీవిత బీమా ఆర్థికంగా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ప్ర‌స్తుతం అనేక ర‌కాల ట‌ర్మ్ పాల‌సీలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అందువ‌ల్ల పాల‌సీ తీసుకునే ముందు ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీకి, ప్రీమియం తిరిగి వ‌చ్చే ట‌ర్మ్ పాల‌సీల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం తెలుసుకోవాలి. 

ప్యూర్ ట‌ర్మ్ బీమా..
ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ సాధార‌ణ బీమా ప‌థ‌కం. బీమా సంస్థలు అందించే పలు ప్రణాళికల్లో దీనికి అధిక ప్రాముఖ్య‌త ఉంది. ఇందులో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే నామినీకి మొత్తం హామీని చెల్లిస్తారు. దీనికి ఎలాంటి మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అంటే పాల‌సీ కాల‌ప‌రిమితి పూర్త‌య్యే స‌మ‌యానికి పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి జీవించివుంటే ఈ పాల‌సీ కింద ఏ విధ‌మైన ప్ర‌యోజ‌నాలు ల‌భించ‌వు. ఇత‌ర పాల‌సీల‌తో పోలిస్తే ప్రీమియం కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.

ఉదాహ‌ర‌ణ‌కి: కిషోర్‌కి 35 సంవ‌త్స‌రాలు. అత‌ను ఒక సాప్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌, ధూమ‌పానం అల‌వాటు లేదు. అత‌ను 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో రూ. 1 కోటికి ప్యూర్ ట‌ర్మ్ బీమా ప‌థ‌కాన్ని కొనుగోలు చేశాడు. ప్రీమియం రూ. 10,526. అత‌ను పాల‌సీ తీసుకున్న 20 సంవ‌త్స‌రాల‌లో దురదృష్ట‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే, హ‌మీ మొత్తం రూ.1 కోటి బీమా సంస్థ, నామినీకి అందిస్తుంది. కాల‌ప‌రిమితి ముగిసే స‌మ‌యానికి జీవించివుంటే ఎటువంటి చెల్లింపులు చేయ‌రు.  

ప్రీమియం తిరిగి వ‌చ్చే టర్మ్ ఇన్సూరెన్స్(టీఆర్ఓపీ)..
పాల‌సీ కాల‌ప‌రిమితి పూర్తయ్యే నాటికి పాల‌సీ దారుడు జీవించి ఉంటే అత‌ను చెల్లించిన ప్రీమియంల మొత్తాన్ని(ప‌న్నుల‌ను మిన‌హాయించి) పాల‌సీదారునికి తిరిగి చెల్లిస్తారు. ఒక‌వేళ కాల‌ప‌రిమితి పూర్త‌య్యే నాటికి మ‌ర‌ణిస్తే బీమా సంస్థ‌ హామీ మొత్తం నామీనికి అందిస్తారు. ప్యూర్ టర్మ్ పాల‌సీతో పోలిస్తే, వీటి ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. 

ఉదాహ‌ర‌ణ‌కి: రోహ‌న్ అనే 35 సంవ‌త్స‌రాల ధూమ‌పానం అల‌వాటు లేని వ్య‌క్తి 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితో రూ.1 కోటికి, ప్రీమియం తిరిగి వ‌చ్చే ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేస్తే అత‌ను చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియం రూ. 39,036. ఒకవేళ రోహ‌న్‌ పాల‌సీకాల‌ప‌రిమితి పూర్త‌య్యే వ‌ర‌కు జీవిస్తే అత‌ను చెల్లించిన ప్రీమియంల మొత్తాన్ని తిరిగి పొందుతాడు. ఒకవేళ 20 సంవ‌త్స‌రాల లోపు రోహ‌న్ మ‌ర‌ణిస్తే, హామీ మొత్తం రూ. 1 కోటిని బీమాసంస్థ నామినీకి చెల్లిస్తుంది.

కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సురేష్ అగర్వాల్ మాట్లాడుతూ, “రెండు పాల‌సీల అవ‌స‌రాలు వేరు వేరుగా ఉంటాయి. కుంటుంబానికి ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌న‌కునే వారికి, త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ నందిందే ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ అనుకూలంగా ఉంటుంది. సాధార‌ణంగా ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీలో హామీ విలువ ప్రీమియం కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది. 

ఏది తీసుకోవాలి?
ఈ రెండు పాల‌సీల‌లో దేని ప్రత్యేక‌త దానికి ఉంది. ఒక వ్య‌క్తి నిర్ధిష్ట అవ‌స‌రాల ఆధారంగా పాల‌సీని ఎంచుకోవ‌డం మంచిది. అయితే రెండింటిలోనూ చూస్తే, ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ ఎంచుకోవ‌డం మంచిద‌ని చెబుతున్నారు ఆర్ధిక నిపుణ‌లు. అయితే ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేసేప్పుడు కొన్ని విష‌యాలు గుర్తించుకోవాలి. మీరు లేని స‌మ‌యంలోనూ మీ కుంటుంబానికి ఆర్థిక అండంగా ఉంటుంది కాబ‌ట్టి ముందుగా కుటుంబ అవ‌స‌రాలకు అవ‌స‌ర‌మైన మొత్తాన్ని లెక్కించాలి. మీ కుటుంబ ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉంది, మీరు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన కుటుంబ స‌భ్యులు ఎంత‌మంది ఉన్నారు, వారి జీవిన‌శైలి, భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు, మొత్తం ఖ‌ర్చులు, అన్నింటిని స‌మ‌గ్రంగా లెక్కిస్తే, ఎంత మొత్తానికి పాల‌సీ తీసుకోవాలో తెలుస్తుంది.

వ్యక్తిగత రుణాలు, కారు, గృహ రుణాలు, వంటివి కూడా హామీ మొత్తంలో క‌వ‌ర‌య్యేలా చూసుకోవాలి. అప్పుడు రుణాలకు చెల్లించాల్సిన ఈఎమ్ఐ భారం కుటుంబంపై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌చ్చు. పిల్ల‌ల విద్య‌, భ‌విష్య‌త్తుకు ఆటంకాలు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీల‌తో పోలిస్తే, ప్రీమియం తిరిగి వ‌చ్చే పాల‌సీల‌లో హామీ మొత్తం(300 నుంచి 400 రెట్లు) త‌క్కువ ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప్రీమియం తిరిగిరావాల‌ని కోరుకునే వారు ఇవి తీసుకోవ‌చ్చు. 

చివ‌రిగా..
కొన్నిసార్లు, మ‌నం ఈ రోజు తీసుకునే అతి చిన్న ఎంపిక రేప‌టి జీవితానికి పెద్ద భ‌రోసాను అందిస్తాయి. ప్యూర్ ట‌ర్మ్ పాల‌సీ అనేది ప్ర‌తీ ఒక్క‌రి పోర్ట్‌ఫోలియోలో ఉండ‌వ‌ల‌సిన‌, సుల‌భంగా ఉండే ఒక సాదార‌ణ జీవిత బీమా ప‌థ‌కం. ఇది బీమా కొనుగోలు చేసే వ్య‌క్తి అవ‌స‌రాలు, జీవిత ద‌శ‌లపై ఆధార‌ప‌డి ఉంటుంది. మార్కెట్‌లో ల‌భ్య‌మయ్యే వివిధ ర‌కాల పాల‌సీల మేజిక్ నెంబ‌ర్ల‌ను చూసి మోస‌పోకుండా ఒక మంచి జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేయడం మంచిది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని