గృహ‌రుణాల‌పై వ‌ర్తించే ఛార్జీలేంటో తెలుసా? - Different-charges-on-Home-loans
close

Published : 28/01/2021 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ‌రుణాల‌పై వ‌ర్తించే ఛార్జీలేంటో తెలుసా?

గృహ రుణం తీసుకుని సొంతింటి నిర్మాణం చేసే వారికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ త‌గ్గుతున్న వ‌డ్డీ రేట్లు. దీనికి తోడు బ్యాంకులు కూడా గృహరుణాలిచ్చేందుకు ఆస‌క్తి చూపుతుంటాయి. దేశంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తుల ఆదాయాలు పెరుగుతున్ననేప‌థ్యంలో గృహ‌రుణాల‌కు మంచి గిరాకీ వ‌చ్చింది. అయితే రుణం తీసుకుని ఇళ్లు క‌ట్టుకోవాల‌నుకునే వారు వాటిపై ఉండే వివిధ ర‌కాల రుసుముల గురించి అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌టం మేలు. రుణం తీసుకునేముందు వ‌డ్డీరేటు ప్రాతిపాదిక‌నే కాకుండా రుసుములు, పెనాల్టీల గురించి అవ‌గాహ‌న‌ ఏర్ప‌రుచుకోవ‌డం ద్వారా మంచి నిర్ణ‌యాలు తీసుకునేందుకు తోడ్ప‌డుతుంది. గృహ‌రుణంపై వ‌ర్తించే రుసుములు, పెనాల్టీలు మొద‌లైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌ర‌ఖాస్తు రుసుము:

ఏ బ్యాంకు రుణానికైనా సాధార‌ణంగా రుణ ద‌ర‌ఖాస్తు రుసుముల‌ను విధిస్తారు. ఇందులో రుణ ద‌ర‌ఖాస్తు ప‌త్రాలు, రుణ ద‌ర‌ఖాస్తుదారుని గురించి తెలుసుకునేందుకు అయ్యే ఖ‌ర్చులు వంటివి ఉంటాయి. ఈ రుసుము రుణం ల‌భించినా లేకున్నా తిరిగి సంస్థ‌లు ద‌ర‌ఖాస్తుదారుల‌కు చెల్లించ‌వు.

ప్రాసెసింగ్ రుసుము:

గృహ‌రుణానికి సంబంధించి ప్ర‌క్రియ‌(ప్రాసెస్) చేసేందుకు బ్యాంకుల‌కు లేదా రుణ‌మిచ్చే సంస్థ‌ల‌కువివిధ ద‌శ‌ల్లో అయ్యే ఖ‌ర్చుల‌ను రుణ ప్రాసెసింగ్ రుసుములో భాగంగా ప‌రిగ‌ణిస్తారు. కొన్ని బ్యాంకులు నిర్ణీత రుసుముల‌ను వ‌సూలు చేస్తూండ‌గా, మ‌రికొన్ని బ్యాంకులు రుణంలో కొంత శాతాన్ని ప్రాసెసింగ్ రుసుముగా వ‌సూలు చేస్తున్నాయి.   ఇది మామూలుగా 0.25 నుంచి 1 వ‌ర‌కూ ఉండొచ్చు.

డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ రుసుము:

బ్యాంకులో రుణం తీసుకునే ముందు, తీసుకున్న త‌ర్వాత స‌మ‌ర్పించిన ద‌ర‌ఖాస్తుల‌ను క్రాస్ వెరిఫికేష‌న్ చేసేందుకు బ్యాంకుల‌కు అయ్యే ఖ‌ర్చుల‌ను డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ రుసుము అంటారు.

లీగ‌ల్ రుసుము:

ఏదైనా ఆస్తికి సంబంధించి ధ్రువీక‌ర‌ణ జ‌రిపేందుకు బ్యాంకులు లాయ‌ర్ల‌ను నియ‌మిస్తుంటాయి. దీనిక‌య్యే లీగ‌ల్ సంబంధిత ఖ‌ర్చుల‌ను బ్యాంకులు రుణం తీసుకునే వారి నుంచే వసూలు చేస్తాయి.

స్టాంపు డ్యూటీ:

ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీల కోసం స్టాంప్ డ్యూటీని విధిస్తుంది . స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రాష్ట్రాల‌ను బ‌ట్టి మారుతుంటాయి. సాధార‌ణంగా ఇది గృహ రుణ మొత్తంలో 0.1 నుంచి 0.2 శాతం వ‌ర‌కూ ఉండొచ్చు. సెంట్ర‌ల్ రిజిస్ట్ర‌రీ ఆప్ సెక్యురిటైజేష‌న్ అసెట్ రీక‌నెష్ట్ర‌క్ష‌న్ అండ్ సెక్యురిటీ ఇంట్రెస్ట్ ( సీఈఆర్ఎస్ఏఐ)రుసుము వంటివి ఉంటాయి.

రుణం మొత్తం చెల్లించిన త‌రువాత ఈ నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ ను తీసుకోవాలి.

నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ రుసుము:

రుణం చెల్లించ‌డం మొత్తం పూర్త‌యిన త‌ర్వాత ఇక‌పై బ్యాంకుకు ఎటువంటి బకాయిలు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని బ్యాంకు నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం బ్యాంకులు సాధార‌ణంగా ఎలాంటి రుసుమును వ‌సూలు చేయ‌క‌పోవ‌చ్చు.

బ‌దిలీ (స్విచ్చింగ్) రుసుము:

రుణ గ్ర‌హీత‌లు త‌మ రుణాన్ని ఒక‌ బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకు బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీనికోసం బ్యాంకులు విధించే రుసుమును స్విచ్చింగ్ రుసుము అంటారు. సాధారణంగా బ్యాంకులు రుణ మొత్తంపై 0.5శాతం వరకూ స్విచ్చింగ్ రుసుము విధిస్తాయి. కొన్ని బ్యాంకులు రూ.5,000-రూ.10,000 వరకూ వసూలు చేస్తున్నాయి.

పెనాల్టీలు:

కొంత మొత్తం డ‌బ్బు అందితే గృహ‌రుణం పూర్తిగా లేదా పాక్షికంగా తీర్చేద్దామ‌నుకునే ఆలోచ‌న ఉండేవారికి ముంద‌స్తు చెల్లింపు రుసుముగురించి అవ‌గాహ‌న ఉండాలి.

ముంద‌స్తు చెల్లింపు రుసుము (ప్రీపేమెంట్ పెనాల్టీ):

తీసుకున్న రుణాన్ని గ‌డువు కంటే ముందే చెల్లించాల్సి వ‌స్తే బ్యాంకులు ముంద‌స్తు చెల్లింపు రుసుమును వ‌సూలు చేస్తాయి. గృహ రుణాల‌పై ఫ్లోటింగ్ వ‌డ్డీ రేట్ల‌కు సంబంధించి ప్రీపేమెంట్ పెనాల్టీలు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని ఆర్‌బీఐ ఆదేశించింది. మిగిలిన గృహ రుణాల‌కు ముంద‌స్తుగా చెల్లిస్తున్న రుణంలో 2నుంచి 5శాతాన్ని పెనాల్టీగా వ‌సూలు చేస్తారు.రుణ వాయిదాల‌ను క్ర‌మంగా నిర్ణీత గ‌డువులోగా చెల్లించేస్తే స‌రే ఒక వేళ వాయిదా చెల్లించ‌డం ఆల‌స్యం అయితే రుసుము చెల్లించాలి.

ఆల‌స్య చెల్లింపు రుసుము:

గృహ రుణం తీసుకున్న వారు సాధార‌ణంగా ఈఎమ్ఐల రూపంలో చెల్లింపులు జ‌రుపుతూ ఉంటారు. బ్యాంకులు, ఎన్‌బీఎప్‌సీలు ఈఎమ్ఐలు ఆల‌స్య‌మైతే ఆల‌స్య చెల్లింపు రుసుమును వ‌సూలు చేస్తాయి. ఈ ఆల‌స్య చెల్లింపు రుసుములు  రూ. 200 నుంచి రూ. 500 వ‌ర‌కూ ఉంటాయి. దీంతో పాటు అద‌నంగా 2 శాతం వ‌డ్డీని వ‌సూలు చేస్తారు.

పైన పేర్కొన్న రుసుములు ఆయా బ్యాంకులు లేదా రుణ‌మిచ్చే సంస్థ‌ల‌కు సంబంధించిన నియ‌మాల‌ను బ‌ట్టి మారుతుంటాయి. కొంద‌రు ప్రాసెసింగ్ రుసుమును త‌గ్గించి తీసుకోవ‌చ్చు. కొంద‌రు ప్రీపేమెంటు ఛార్జీలు త‌క్కువ తీసుకోవ‌చ్చు. కాబ‌ట్టి గృహ‌రుణం తీసుకునే ముందు ఛార్జీలు పెనాల్టీల గురించి తెలుసుకోవాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని