వైవిధ్యమే..పెట్టుబడులకు రక్ష! - Diversification is protection to investments
close

Published : 23/04/2021 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైవిధ్యమే..పెట్టుబడులకు రక్ష!

కరోనా వైరస్‌ ప్రంపంచ ఆర్థిక వ్యవస్థలను ఇబ్బందులకు గురి చేస్తోంది. గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే.. మనమంతా ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామన్నది వాస్తవం. ఇందులో ఈక్విటీ మార్కెట్లు కూడా ఒక రోజు పెరగడం.. మరో రోజు తగ్గడం.. చూస్తూనే ఉన్నాం. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఇంకోవైపు ఉద్యోగాల్లో కోత పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడుల కోసం కేవలం ఒకే పథకాన్ని ఆశ్రయించడం ఏమంత శ్రేయస్కరం కాదు. విభిన్నమైన పథకాలను ఎంచుకొని, వాటిని క్రమం తప్పకుండా సమీక్షించుకున్నప్పుడే మన కష్టార్జితాన్ని రక్షించుకోగలం.

మహమ్మారి ప్రభావం ఉన్నా.. లేకపోయినా.. పెట్టుబడుల నిర్వహణ ఎప్పుడూ క్రమశిక్షణతో కొనసాగాలి. అప్పుడే మదుపరులు తాము ఆశించిన రాబడిని సాధించగలరు. మీ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి.. ఎంత మేరకు నష్టభయాన్ని తట్టుకోగలరు అనే అంశాలను ప్రతి మదుపరీ జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. మీ పెట్టుబడుల జాబితా భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఉండాలి. అదే సమయంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకునే శక్తిని ఇవ్వాలి. నష్టభయం తగ్గించుకుంటూ.. మంచి రాబడిని ఆర్జించే దిశగా మన పెట్టుబడులు కొనసాగాలి. ఇప్పటి వరకూ చూస్తే.. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల్లో క్రమానుగత పెట్టుబడి విధానం వల్ల నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టే వీలు లభిస్తుంది. వైవిధ్యంతో షేర్లను ఎంపిక చేసుకునే వీలు కలిగిస్తుంది. అందుకే, చాలామంది వీటిలో మదుపు చేసేందుకు ముందుకు వస్తుంటారు. కొన్నిసార్లు.. కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక, నష్టభయం భరించే సామర్థ్యం, పొదుపు మొత్తం, చేతిలో వ్యవధి ఉన్నప్పటికీ.. పెట్టుబడిదారులు నష్టపోయే ఆస్కారం ఉంది. ఇలాంటప్పుడే వైవిధ్యం కీలక పాత్ర పోషిస్తుంది.

నష్టభయం.. ఆర్థిక లక్ష్యాలు

ఒక పథకం ఎంపికలో ఈ రెండూ ప్రధానం. పెట్టుబడిదారుడి వయసు, ఆదాయం, వ్యవధి, ఎందుకోసం మదుపు చేస్తున్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకొని, పథకాలను ఎంచుకోవాలి. కొత్తగా ఉద్యోగంలో చేరి, ఇప్పుడిప్పుడే మదుపు చేస్తున్నవారు.. కుటుంబ బాధ్యతలు అంతగా లేని వారు.. పెట్టుబడిలో సింహ భాగాన్ని ఈక్విటీలకు మళ్లించవచ్చు. అవసరాలు పెరగడం, బాధ్యతలు మారడంలాంటివి జరిగినప్పుడు ఈక్విటీ, డెట్‌ ఫండ్ల మిశ్రమంగా ఉండే హైబ్రీడ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. వీటివల్ల నష్టభయం కాస్త పరిమితంగా ఉంటూ.. మంచి రాబడినే సాధించేందుకు వీలుంటుంది. తక్కువ నష్టభయం ఉండటంతోపాటు, స్థిరాదాయం అందాలని కోరుకునే వారు.. షార్ట్‌ టర్మ్‌ ఫండ్లు లేదా లిక్విడ్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు.

నప్పే పథకం..

మీ లక్ష్యం, నష్టభయాన్ని భరించే సామర్థ్యాలను గుర్తించిన తర్వాత.. చేయాల్సిన పని.. మదుపు చేయడానికి సరైన పథకాన్ని ఎంచుకోవడం. అనేక పెట్టుబడి పథకాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. వాటన్నింటిలోనూ మదుపు చేయడం కష్టమే. చరిత్రను పరిశీలిస్తే.. ఒక్కోసారి ఒక్కో పథకం మంచి పనితీరును చూపిస్తుంది. ఒక పథకం మంచి రాబడినిస్తే.. మరోటి అంత ప్రతిఫలం ఇవ్వకపోవడం చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు కొవిడ్‌-19 నేపథ్యంలో కొంతమంది ఈక్విటీలకు బదులుగా డెట్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం పథకాలవైపే మొగ్గు చూపించారు. ఒక ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలంటే.. ఈక్విటీ, డెట్‌ ఫథకాల మేళవింపు ఉండాలి. ఇలాంటప్పుడే.. మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి రక్షణ లభిస్తుంది. ఫలితంగా మార్కెట్‌ పతనంలోనూ ఆర్జించిన రాబడి అధికంగా కోల్పోకుండా ఉంటుంది.

సమీక్ష.. మార్పులు..

పెట్టుబడుల జాబితాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలనేది ప్రాథమిక సూత్రం. ఆర్థిక నిపుణులు ఈ విషయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కాలం గడుస్తున్న కొద్దీ.. ఒక విభాగంలో పెట్టుబడుల మొత్తం పెరిగిపోతుంటుంది.. లేదా.. ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయని మదుపు చేస్తున్న పథకాల పనితీరు దెబ్బతినవచ్చు. ఇలాంటప్పుడూ వాటిలో పెట్టుబడులు కొనసాగించడం వల్ల ఫలితం ఉండదు. ఈ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోతే మొత్తం రాబడిపై దాని ప్రభావం ఉంటుంది. మార్కెట్‌ దిశ మారినప్పుడల్లా.. పెట్టుబడుల జాబితానూ సమీక్షించుకోవాలి. అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలి. విభాగాల వారీగా పెట్టుబడులూ తగిన పాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఏదేని విభాగంలో ఉండాల్సిన మొత్తం కన్నా అధికంగా ఉంటే.. దాన్ని మరో మంచి పనితీరున్న విభాగంలోకి మళ్లించాలి. 

పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళిక ఒక్క రోజుతో ముగిసే ప్రక్రియ కాదు. మార్కెట్లో దీర్ఘకాలం కొనసాగుతూనే... ఎప్పటికప్పుడు మీ పథకాల జాబితాను సరిచేస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని ఏ చింతా లేకుండా సాధించగలం.- రాఘవ్‌ అయ్యంగార్, సీబీఓ, యాక్సిస్‌ ఏఎంసీ  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని