ఇ-కామర్స్‌ ఆఫర్లపై నిషేధం వద్దు - Do not want a ban on e-commerce‌ offers
close

Published : 22/07/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇ-కామర్స్‌ ఆఫర్లపై నిషేధం వద్దు

 వినియోగదార్లలో ఎక్కువ మంది అభిప్రాయమిదే: సర్వే

దిల్లీ: ఇ-కామర్స్‌ సంస్థలు ఇచ్చే భారీ రాయితీలపై నిషేధం విధించడం కానీ, జోక్యం చేసుకోవడం కానీ ప్రభుత్వం చేయకూడదనే తాము కోరుకుంటున్నామని ఓ సర్వేలో 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఆదరణ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. గత 12 నెలల్లో 49 శాతం మంది వినియోగదార్లు ఆన్‌లైన్‌ ద్వారానే కొనుగోళ్లు జరిపారని సామాజిక మాధ్యమ సంస్థ లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశంలోని 394 జిల్లాలకు చెందిన 82,000 మంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది. ఇందులో 62 శాతం మంది పురుషులు కాగా.. 38 శాతం మంది మహిళలు. కొనుగోళ్లకు సురక్షితం, సులభమైన మార్గం కావడంతో పాటు తక్కువ ధరకే ఉత్పత్తులు లభిస్తుండటం, వాటిని రిటర్న్‌ చేయడమూ సులువుగా ఉండటంతో ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు చేసే వారి సంఖ్య పెరుగుతోందని సర్వే వెల్లడించింది. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఆదాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల కొనుగోళ్లపై ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుండటం కూడా ఇందుకు మరో కారణమని పేర్కొంది. వినియోగదారు భద్రతా (ఇ-కామర్స్‌) నిబంధనలు- 2016లో ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు ఆన్‌లైన్‌ విక్రయాలపై ప్రభావం చూపించొచ్చన్న నేపథ్యంలో ఈ సర్వే జరగడం గమనార్హం. ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలపై ఫ్లాష్‌ సేల్‌లు, మిస్‌- సెల్లింగ్‌ లాంటి వాటిపై నిషేధం విధిస్తూ జూన్‌ 21న ఇ-కామర్స్‌ ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయడం తెలిసిందే. కొవిడ్‌-19 అనిశ్చితులు మరో 6 - 12 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని 47 శాతం మంది పేర్కొన్నారు. తమ ఇంటి బడ్జెట్‌ ప్రణాళికలపై ఇది ప్రభావం చూపించవచ్చని తెలిపారు. అందువల్ల తాము ఖర్చు పెట్టే ప్రతి పైసాపై అధిక ప్రయోజనం పొందాలనే అనుకుంటామని అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు ఫలానా వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయనే వివరాలను తెలుసుకుంటామని 43 శాతం మంది తెలిపారు. ఆ వివరాలు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై తెలిసేలా ఉంచాలనే విషయమై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సర్వే పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని