రూ.520 కోట్లకు దొడ్ల డెయిరీ ఐపీఓ - Dodla Dairy IPO for Rs 520 crore
close

Updated : 12/06/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.520 కోట్లకు దొడ్ల డెయిరీ ఐపీఓ

ఇష్యూ విలువ : రూ.520 కోట్లు
మొత్తం షేర్లు: 1,21,53,668
షేరు ముఖ విలువ: రూ.10
ధరల శ్రేణి: రూ.421-రూ.428
దరఖాస్తు: కనీసం 35 షేర్లు.. ఆపైన 35 గుణిజాల్లో ఇష్యూ తేదీలు: జూన్‌ 16-18

ఈనాడు, హైదరాబాద్‌: రోజుకు 13 లక్షల లీటర్ల పాల సేకరణ ద్వారా దేశంలో మూడో స్థానంలో కొనసాగుతున్న దొడ్ల డెయిరీ తొలి పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) సిద్ధమైంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా మొత్తం రూ.520 కోట్లు సమీకరించబోతోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలతో పాటు ఉగాండా, కెన్యాలోనూ ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇష్యూలో రూ.50 కోట్ల మేరకు కొత్తగా షేర్లను జారీ చేస్తుండగా.. మిగతా మొత్తం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ప్రమోటర్లు, ఇతర పెట్టుబడిదారులు తమ షేర్లను విక్రయిస్తున్నారు. ఇందులో టీపీజీ దొడ్ల డెయిరీ హోల్డింగ్స్‌ షేర్లు 92 లక్షలు, దొడ్ల సునీల్‌ రెడ్డి షేర్లు 4,16,604, దొడ్ల ఫ్యామిలీ ట్రస్ట్‌ షేర్లు 10,41,509, దొడ్ల దీపా రెడ్డి షేర్లు 3,27,331 ఉన్నాయి.
సమీకరించిన మొత్తంతో రూ.32.26 కోట్ల అప్పు తీర్చడంతో పాటు, ఇతర పెట్టుబడి అవసరాల కోసం వినియోగిస్తామని దొడ్ల డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ రెడ్డి శుక్రవారం వివరించారు. సంస్థకు రూ.87.37 కోట్ల రుణాలున్నట్లు వెల్లడించారు. మూడేళ్లుగా ఏటా 15శాతం వృద్ధి సాధిస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంలో కొవిడ్‌-19 వల్ల వృద్ధి రేటు తగ్గిందన్నారు. రానున్న రోజుల్లో 15-20శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31, 2020తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి మొత్తం రూ.1,413.51 కోట్ల ఆదాయాన్నీ, రూ.116.39 కోట్ల నికర లాభాన్నీ ఆర్జించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ ప్లాంటుపై రూ.110 కోట్ల పెట్టుబడి పెట్టామని, రాజమహేంద్రవరంలోనూ అధునాతన ప్లాంటు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.   రెండేళ్లలో దేశీయంగా మార్కెట్‌ వాటా పెంచుకునే ప్రయత్నం చేస్తామని, మంచి విలువకు దొరికే చిన్న డెయిరీలను స్వాధీనం చేసుకునే ఆలోచనలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 370 ఔట్‌లెట్లు ఉన్నాయని, ఈ ఏడాదిలో కొత్తగా మరో 100 ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 73 శాతం పాల సేకరణ నేరుగా రైతుల నుంచే జరుగుతోందని, దీన్ని 100 శాతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు.

పీఎల్‌ఐ పథకం కింద సౌర తయారీ
యూనిట్లకు ఐఆర్‌ఈడీఏ బిడ్‌ల ఆహ్వానం

దిల్లీ: కేంద్రం ప్రకటించిన రూ.4500 కోట్ల ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహాకాల (పీఎల్‌ఐ) పథకం కింద సౌర తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి సౌర మాడ్యుల్‌ తయారీదార్ల నుంచి ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) బిడ్‌లు ఆహ్వానించింది. ఈ పథకం అమలు చేసే సంస్థగా ఐఆర్‌ఈడీఏను కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ నియమించింది. సౌర ఫోటో వోల్టాయిక్‌ (పీవీ) మాడ్యుల్స్‌ దేశీయ తయారీకి ఊతమిచ్చే లక్ష్యంతో రూ.4500 కోట్ల పీఎల్‌ఐ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దరఖాస్తులను జూన్‌ 30లోగా సమర్పించాల్సి ఉంటుంది. బిడ్‌ల ఎంపిక ప్రక్రియ జులై 30 నాటికి పూర్తవుతుంది. పథకం కింద దరఖాస్తుదారులు కొత్తగా లేదా ప్రస్తుత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొత్త లేదా ప్రస్తుత యూనిట్లను దరఖాస్తుదారులు కలపడానికి లేదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని