సంపాదన దోసిటలో నీరు వంటిది.. ఎప్పుడు ఖాళీ అయిందో తెలియదు... - Early investments gives you better results
close

Published : 24/12/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపాదన దోసిటలో నీరు వంటిది.. ఎప్పుడు ఖాళీ అయిందో తెలియదు...

మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఒక ఇండెక్స్ ఫండ్ తో మొదలు పెట్టినట్లయితే అలవాటు, అవగాహన ఏర్పడతాయి

సాధారణంగా చాలా మంది 22-25 ఏళ్ల వయసులో సంపాదన మొదలుపెడతారు. ఆ వయసులో ఎక్కువ బాధ్యతలు ఉండ‌వు. తల్లిదండ్రులు కూడా వారిపై ఆర్ధిక ఆంక్షలు విధించరు . దీంతో చేతిలో మిగులు డబ్బు ఉంటుంది . ఆ వ‌య‌సులో వారికి జీవితం గురించి అవగాహన గానీ, అనుభవంగానీ వుండవు . చుట్టూరా ఎన్నో ఆకర్షించే వస్తువులు, మొబైల్ ఫోన్లు , బైకులు, ఫ్యాషన్ దుస్తులు , స్నేహితులతో బయట ఖరీదైన చిరుతిళ్ళు, ఇలా ఎన్నో క‌నిపిస్తాయి. కొంత వరకు ఇవి ఉండాలి. లేకపోతే ఆ వయసు, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు. అయితే ఇక్కడ నుంచే వారి భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంటుంది . సరైన నిర్ణయాలు తీసుకోవడం లో జాప్యం చేస్తారు.

ఇక్కడ నుంచి 30-35 ఏళ్లపాటు సంపాదించే వయసు, ఆ తరువాత హాయిగా, ఆనందంగా కుటుంబ సభ్యులతోపాటు జీవించడానికి కావలసిన డబ్బును జమ చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలైన పిల్లల చదువులు, వారి ఆరోగ్యం, ఇల్లు కొనుగోలు చేయడం, సామాజిక బాధ్యతలు వంటి ఖర్చులు వలన ఎక్కువ మొత్తం వీటికే సరిపోతుంది. మిగులు చాలా తక్కువగా ఉంటుంది . వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతుంటాయి . ఆధునిక వైద్య పరిజ్ఞానం వలన చికిత్స ఖర్చుతో కూడుకున్నప్పటికీ , ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుంది.
అందుకోసం జీవించిఉన్నంత వరకు సరిపడా సొమ్మును దాచుకోవాలి . అయితే ఇది ఎంత మొత్తం అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అప్పటి వారి ఆరోగ్య పరిస్థితి, జీవన విధానం, జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి పొదుపు / మదుపు ఒక నిరంతర ప్రక్రియలా కొన‌సాగాలి.

మన ఆర్ధిక జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం:;

  1. మన ఆదాయంలో 30-40 శాతం నెలవారీ ఖర్చులకు కేటాయించాలి. మరొక 30 శాతం స్వల్పకాలిక (అంటే రాబోయే 3 ఏళ్లకు) అవసరాలకోసం పొదుపు చేయాలి. మిగిలిన 30-40 శాతాన్ని దీర్ఘకాలిక ( 3 ఏళ్లకు పైబడిన) అవసరాలకోసం మదుపు చేయాలి.

  2. టర్మ్ జీవిత బీమా : తనపై ఆధారపడిన కుటుంబ సభ్యుల ఆర్ధిక భరోసా కోసం ’ టర్మ్ జీవిత బీమా ’ తీసుకోవాలి. తన వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండేటట్లు, అలాగే 60ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగించాలి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సమీక్షించి, అవసరమైన అదనపు బీమాను తీసుకోవాలి.

  3. పొదుపు ఖాతాతోపాటు , రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవాలి. దీనివలన మొదటినుంచి పొదుపు ఒక అలవాటుగా మారుతుంది. ఏడాది తరువాత ఆ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచిది. ఈ సొమ్ము స్వల్పకాలిక పనులకు ఉపయోగపడతాయి. 7 శాతం వరకు వడ్డీ ఆశించవచ్చు.

  4. పీపీఎఫ్ ఖాతా వలన మధ్య, దీర్ఘకాలిక అవసరాలకు డబ్బు చేతికొస్తుంది. చేసిన పెట్టుబడికి, వచ్చే వడ్డీ ఆదాయం మీద, అలాగే డబ్బు ను ఉపసంహరించుకునే సమయంలోకూడా పన్ను మినహాయింపులు ఉంటాయి. 8 శాతం వరకు వడ్డీ ఉండొచ్చు.

  5. మ్యూచువల్ ఫండ్స్ లో అధిక రాబడి ఆశించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పరోక్షంగా ఈక్విటీ లలో, ప్రభుత్వ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లో మదుపు చేస్తాయి. తక్కువ మొత్తం అంటే కనీసం రూ. 500 లతో కూడా సిప్ చేయగలగడం, నిపుణుల పర్యవేక్షణలో ఫండ్స్ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఎపుడైనా సొమ్ము వాపసు తీసుకునే అవకాశం, తమ రిస్క్ సామర్థ్యం , అవసరాలకు, అవకాశాలకు , వీలుగా మదుపు చేయగలగడం వంటివి సానుకూల అంశాలు. మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఒక ఇండెక్స్ ఫండ్ తో మొదలు పెట్టినట్లయితే అలవాటు , అవగాహన ఏర్పడతాయి .

  6. పదవీవిరమణ అనంతర జీవితాన్ని ఇప్పుడే ఊహించలేము . కొంత మొత్తం నెలనెలా ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఎలా పొదుపు చేస్తున్నామో, ఎన్పీఎస్ ద్వారా మరికొంత పొదుపు చేయడం ద్వారా మంచి నిధిని జమచేసుకోవచ్చు. ఎందుకంటే కేవలం ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జమ అయ్యే సొమ్ము సరిపోదు కాబట్టి. ఎన్పీఎస్ లో కొంత మొత్తం ఈక్విటీ లలో పెట్టుబడి చేయబడుతుంది. అందువలన మంచి నిధిని జమచేసుకోవచ్చు. 9-10 శాతం వరకు వడ్డీ ఆశించవచ్చు.

  7. క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే , గడువు లోగా పూర్తి మొత్తాన్ని చెల్లించండి. వడ్డీ, అపరాధ రుసుముల బారిన పడకండి.
    ఇది మీ క్రెడిట్ స్కోర్ ఫై ప్రభావం చూపుతుంది .

  8. బ్యాంకులు ఇచ్చే వ్యక్తిగత రుణాల నుంచి దూరంగా ఉండండి. ఇవి అధిక వడ్డీని ఛార్జ్ చేస్తాయి. ఇవి మీ అనవసర ఖర్చులను పెంచుతాయి.

ముగింపు: పొదుపు/ పెట్టుబడి ఒక నిరంతర ప్రక్రియ. దీనికి క్రమశిక్షణ , పట్టుదల అవసరం. వయసు పెరిగే కొద్దీ ఆదాయం, అనుభవం పెరగవచ్చు . కానీ పెట్టుబడి చేసే సమయం తగ్గిపోతుంది. దీనివలన చక్రవడ్డీ ప్రభావంతో లభించే రాబడి తగ్గుతుంది. అందుచేత కొద్ది మొత్తంలోనైనా పెట్టుబడి చేస్తుండాలి . ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఈ రోజులలో ఆర్థిక‌ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది .
‘మీ జీవితాన్ని ఎలా మలచుకోవాలో మీ చేతిలోనే ఉన్నదని గ్రహించాలి’.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని