Tesla: భారత్‌లో టెస్లాను విడుదల చేయాలనే ఉంది, కానీ.. ఎలాన్‌ మస్క్‌! - Elon Musk Revealed the reason behind delay in Teslas entry into India
close

Published : 24/07/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tesla: భారత్‌లో టెస్లాను విడుదల చేయాలనే ఉంది, కానీ.. ఎలాన్‌ మస్క్‌!

వాషింగ్టన్‌: కొన్ని నెలల క్రితం భారత్‌లో టెస్లా ప్రవేశంపై పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. టెస్లా తమ రాష్ట్రంలోనే సంస్థను స్థాపించనుందని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఆ దిశగా పెద్దగా పురోగతి మాత్రం కనబడలేదు. అయితే, ఇటీవల ఈ విషయమై ట్విటర్‌లో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ను ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. భారత్‌లో వీలైనంత త్వరగా టెస్లా కార్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీనికి మస్క్‌ స్పందిస్తూ.. జాప్యానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘‘మేము విడుదల చేయాలనే అనుకుంటున్నాం. కానీ, భారత్‌లో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయి. స్వచ్ఛ ఇంధన వాహనాలను సైతం పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్ల వాహనాల వలే పరిగణిస్తున్నారు. అయితే, త్వరలో విద్యుత్తు వాహనాలపై కనీసం తాత్కాలిక ఉపశమనమైనా కల్పిస్తారని ఆశిస్తున్నాం’’ అని మస్క్‌ అన్నారు. భారత్‌లో వాహనాల అసెంబ్లింగ్‌ ఉంటుందా? అని అడిగిన మరో నెటిజన్‌ ప్రశ్నకు స్పందిస్తూ.. దిగుమతి చేసుకున్న టెస్లా వాహనాలు భారత్‌లో విజయం సాధిస్తే.. స్థానికంగా తయారీ సంస్థను నెలకొల్పడం సాధ్యం కావొచ్చని చెప్పారు.

దిగుమతి సుంకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు కూడా ఆయన ఇటీవల లేఖ రాసినట్లు సమాచారం. పూర్తిగా విదేశాల్లో అసెంబుల్‌ చేసిన విద్యుత్తు కార్లపై దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇటు టెస్లా గానీ, అటు భారత ప్రభుత్వ శాఖలు గానీ స్పందించలేదు.

అయితే, మస్క్‌ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో తయారీని ప్రోత్సహించడానికే ప్రీమియం కార్లపై దిగుమతి సుంకాన్ని అధికంగా ఉంచారన్నారు. మరోవైపు విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో అధిక సుంకాల వల్ల ఆయా సంస్థలు స్థానికంగా తయారీని చేపట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని